విశాఖ సదస్సు అదుర్స్... రూ.13 లక్షల పెట్టుబడులు.. 16 లక్షల ఉద్యోగాలు!
విశాఖ సాగర తీరాన్ని పెట్టుబడుల సునామీ తాకింది. సీఐఐ భాగస్యామ్య సదస్సుకు అంచనాలకు మించిన స్పందన కనిపించింది.
By: Tupaki Desk | 15 Nov 2025 7:56 PM ISTవిశాఖ సాగర తీరాన్ని పెట్టుబడుల సునామీ తాకింది. సీఐఐ భాగస్యామ్య సదస్సుకు అంచనాలకు మించిన స్పందన కనిపించింది. మూడు రోజుల పాటు ప్రభుత్వం కొనసాగించిన పెట్టుబడుల వేట ఫలించింది. ఊహించని విధంగా పారిశ్రామిక ఒప్పందాలు జరిగాయి. లక్షలాది కొత్త ఉద్యోగాలకు ఆశలు చిగురించాయి. రెండు రోజుల పాటు జరిగిన సీఐఐ 30వ భాగస్వామ్య సదస్సులో ఎంఓయూలు కుదుర్చుకోవాలని భావిస్తే... పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు పెద్ద ఎత్తున ముందుకు రావడంతో ఒక రోజు ముందు నుంచే ప్రభుత్వం ఎంవోయూలు చేసుకోవాల్సివచ్చింది.
ఈ మూడు రోజుల పాటు కుదుర్చుకున్న ఒప్పందాల విలువ మొత్తం రూ. 13,25,716 కోట్లు. వీటి ద్వారా 16,31,188 ఉద్యోగాలు రానున్నాయని అంటున్నారు. వాస్తవానికి భాగస్వామ్య సదస్సులో భారీగా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ముందుగానే అంచనా వేసింది. రెండు రోజుల్లో సుమారుగా రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని భావిస్తే... పారిశ్రామికవర్గాలు తగ్గేదెలే అన్నట్టుగా విశాఖ నగరానికి పోటెత్తారు. దీంతో ఒప్పందాల విలువ రూ. 13 లక్షల కోట్లకు పైగా చేరింది. ఊహించని ఈ స్పందనపై ప్రభుత్వ వర్గాల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది.
అంచనాలకు మించి పెట్టుబడులు
కూటమి ప్రభుత్వం ఏర్పడి నాటి నుంచే చంద్రబాబు నేతృత్వంలోని సర్కార్... పారిశ్రామికాభివృద్ధి మీద ఫోకస్ పెట్టింది. ప్రతి 15 రోజులకోసారి కెబినెట్ సమావేశాలు పెట్టుకున్న తరహాలో ఎస్ఐపీబీ సమావేశాలు నిర్వహించింది. వివిధ సంస్థలకు పెద్ద ఎత్తున అనుమతులిచ్చింది. ఈ క్రమంలో విశాఖ భాగస్వామ్య సదస్సు నాటికే సుమారుగా రూ. 10 లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఏపీపై పారిశ్రామిక వర్గాల్లో నమ్మకం కలగడానికి ఇదే నిదర్శనమని ప్రభుత్వం వివిధ సందర్భాల్లో చెబుతూనే ఉంది. దీన్ని మరింతగా కొనసాగించాలని... రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకువచ్చేలా చూడాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం విశాఖ తీరాన భాగస్వామ్య సదస్సును చేపట్టాలని ప్లాన్ చేసింది.
సీఐఐ సదస్సును విజయవంతం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్, యూఏఈ, లండన్ వంటి దేశాల్లో పర్యటించారు. అక్కడి పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు. పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. అదే సమయంలో మంత్రి లోకేశ్ తోపాటు మంత్రులు నారాయణ, బీసీ జనార్దనరెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, దుర్గేశ్, నాదెండ్ల మనోహర్ ఇలా సుమారు పది మంది మంత్రులు 30 దేశాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. దీంతో భాగస్వామ్య సదస్సు నిర్వహించిన రెండు రోజుల్లో భారీగా పెట్టుబడులు వచ్చేలా ఉన్నాయని ప్రభుత్వం కూడా ముందుగానే చెప్పింది. కానీ, ప్రభుత్వమే ఊహించని విధమైన స్పందన రావడంతో ఒప్పందాల విలువ రూ. 13 లక్షల కోట్లకు పైగా చేరింది. రూ.10 లక్షల కోట్లు పెట్టుబడిగా వస్తుందని భావిస్తే అదనంగా మరో 30 శాతం మేర సమకూరినట్లు ప్రభుత్వం చెబుతోంది.
ముఖ్యమంత్రి సమక్షంలోనే సగానికి పైగా ఒప్పందాలు
మూడు రోజుల పాటు జరిగిన ఒప్పందాల్లో మొత్తంగా రూ. 13,25,716 కోట్ల ఒప్పందాలు జరిగితే... అందులో సగానికి పైగా ఒప్పందాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే చేసుకున్నారు. మూడు రోజుల పాటు చంద్రబాబు సమక్షంలో కుదుర్చుకున్న ఒప్పందాల విలువ రూ.7,63,210 పెట్టుబడులు. 123 ఎంఓయూల ద్వారా ఈ పెట్టుబడులు వచ్చాయి. ఇక ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సహా వివిధ శాఖలకు చెందిన మంత్రులు కూడా భారీ ఎత్తునే పెట్టుబడులపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మొత్తంగా మంత్రులందరూ కలిసి 490 ఎంఓయూల ద్వారా రూ. 5,62,506 కోట్ల మేర పెట్టుబడులు కుదుర్చుకున్నారు.
12 రంగాలు... రూ. 13 లక్షల కోట్లు
మూడు రోజుల పెట్టుబడులపై జరిగిన వరుస సమావేశాలు.. భేటీల్లో అటు ముఖ్యమంత్రి.. ఇటు మంత్రులంతా కలిసి చేసుకున్న ఒప్పందాల ద్వారా 12 రంగాలకు పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడుల్లో టాప్-3లో ఇంధన రంగం, పరిశ్రమలు, మౌళిక వసతుల రంగాలు నిలిచాయి. మొత్తంగా రూ. 13.25 లక్షల కోట్ల మేర పెట్టుబడుల్లో అధిక భాగం ఇంధన రంగానికి వచ్చాయి. ఈ రంగంలో రూ. 5,33,351 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత పరిశ్రమల రంగానికి రూ. 2,80,384 కోట్లు, మౌళిక వసతుల రంగానికి రూ. 2,01,758 కోట్లు వచ్చాయి. ఇక ఉద్యోగాల కల్పనకు సంబంధించి టాప్-3లో పరిశ్రమలు, మౌళిక వసతులు. ఐటీఈ అండ్ సీ రంగాలున్నాయి.
