Begin typing your search above and press return to search.

సీఎం జగన్ పై అనుచిత పోస్టులు పెడితే ఆస్తుల జప్తు!

అమరావతిలోని ఏపీ సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన సీఐడీ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   9 Nov 2023 5:16 AM GMT
సీఎం జగన్ పై అనుచిత పోస్టులు పెడితే ఆస్తుల జప్తు!
X

ఏపీ సీఐడీ చీఫ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. కఠిన చర్యలు ఉంటాయన్న ఆయన.. అందులో భాగంగా ఆస్తులు సీజ్ చేస్తామంటూ సంచలన హెచ్చరిక చేశారు. ‘‘తప్పుడు ప్రచారాలు చేసే వారి ఆస్తుల్ని సీజ్ చేసేందుకు కూడా వెనుకాడం. మీడియా పేరుతో పరిధి దాటి ముఖ్యమంత్రి పైన.. ఆయన కుటుంబ సభ్యులపైన కామెంట్లు చేస్తే ఊరుకోబోం’’ అంటూ ఆయన హెచ్చరించారు.

అమరావతిలోని ఏపీ సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన సీఐడీ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిపైనా.. ఆయన కుటుంబ సభ్యులపైనా అనుచిత పోస్టులకు చర్యలు తీసుకున్నట్లే.. ప్రతిపక్ష పార్టీల నేతలపైనా.. వారి మీద చేసే అనుచిత పోస్టింగులపైనా చర్యలు తప్పవని పేర్కొనటం గమనార్హం. అయితే.. ఈ వ్యాఖ్య ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లను గుర్తించలేమని అనుకుటే పొరపాటు పడినట్లేనని.. వాటిని నడిపే వారితో పాటు ప్రోత్సహించే వారిపైనా చర్యలు తప్పవన్నారు. హైకోర్టు న్యాయమూర్తిపై పోస్టింగులు పెట్టిన 19 మందికి నోటీసులు ఇచ్చినట్లుగా చెప్పిన సీఐడీ చీఫ్ సంజయ్.. ఇందులో టీడీపీ నేతలు బుద్దా వెంకన్న.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నట్లు చెప్పారు. వీరి సోషల్ మీడియా అకౌంట్లను నడిపిస్తున్న గోరంట్ల రామ్ కు నోటీసులు ఇచ్చామన్నారు.

ఇతర దేశాల్లో ఉండి అశ్లీల.. అసభ్యకర పోస్టులు పెట్టే వారిని గుర్తించినట్లుగా చెప్పిన సంజయ్.. ఆయా దేశాల ఎంబసీలతో మాట్లాడుతున్నట్లు చెప్పారు. ఆయా దేశాల ఎంబసీలతో సంప్రదింపులకు సీఐడీ టీంలను పంపినట్లుగా పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు.. మెసేజ్ లు పెట్టే 2972 మందిపై సైబర్ బుల్లీయింగ్ షీట్స్ తెరిచినట్లుగా చెప్పారు. సంజయ్ చేసిన హెచ్చరికలు మీడియాలోనూ.. రాజకీయ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.