Begin typing your search above and press return to search.

'మార్గదర్శి' పై సీఐడీ అదనపు డీజీపీ సంచలన విషయాలు!

మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ లో అవకతవకలపై ఏపీ సీఐడీ విచారణ సాగిస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 Sep 2023 9:12 AM GMT
మార్గదర్శి పై సీఐడీ అదనపు డీజీపీ సంచలన విషయాలు!
X

మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ లో అవకతవకలపై ఏపీ సీఐడీ విచారణ సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును, ఆయన కోడలు, మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ ఎండీ శైలజా కిరణ్‌ ను హైదరాబాద్‌ లో వారి నివాసంలో సీఐడీ అధికారులు విచారించారు. చందాదారుల నుంచి సేకరించిన నగదు ఎక్కడికి తరలించారన్న కోణంలో ఆమెను ప్రశ్నించారు.

చిట్‌ ల కింద సేకరించిన సొమ్మును రామోజీ గ్రూప్‌ కంపెనీలకు మళ్లించినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇటీవల మార్గదర్శి సంస్థకు చెందిన ఆస్తులను సీఐడీ అటాచ్‌ చేసింది. మార్గదర్శికి సంబంధించిన మొత్తం రూ.798.50 కోట్ల విలువైన చరాస్తులు అటాచ్‌ చేసింది.

ఈ క్రమంలో మార్గదర్శి ఛైర్మన్, ఎండీ శైలజా కిరణ్, ఫోర్‌ మెన్, ఆడిటర్లు కుట్రకు పాల్పడినట్లు ఏపీ సీఐడీ గుర్తించింది. చందాదారుల నుంచి చిట్స్‌ ద్వారా సేకరించిన సొమ్మును మ్యూచువల్‌ ఫండ్స్‌ లో పెట్టుబడి పెట్టినట్లు సీఐడీ అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం మార్గదర్శిలో క్రియాశీలకంగా ఏపీలో 1989 చిట్స్‌ గ్రూప్‌లు, తెలంగాణలో 2,316 చిట్స్‌ గ్రూపులు ఉన్నాయని సీఐడీ అధికారులు తేల్చారు.

మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌... పాట పాడుకున్న చందాదారులకు వెంటనే డబ్బులు చెల్లించే పరిస్థితుల్లో లేదని గుర్తించారు. చందాదారుల ప్రయోజనాలు రక్షించేందుకే మార్గదర్శి చరాస్తులు రూ.798 కోట్లను అటాచ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. చిట్‌ ఫండ్‌ చట్టం నిబంధనల ఉల్లంఘనకు మార్గదర్శి పాల్పడినట్లు ఆరోపిస్తోంది. ఈ మేరకు కేసులు నమోదు చేసిన సీఐడీ రాష్ట్ర వ్యాప్తంగా ఆ సంస్థ కార్యాలయాలపై పలుమార్లు ఇప్పటికే సోదాలు జరిపిన విషయం తెలిసిందే. పలువురు మేనేజర్లు, ఆడిటర్లను అరెస్టు చేసింది.

ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ సీఐడీ అదనపు డీజీపీ ఎన్‌. సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఐడీ విచారణపై తప్పుడు కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు. మార్గదర్శి పెద్ద కుంభకోణమని వెల్లడించారు. చాలా నిబంధనలు అతిక్రమించిందని తెలిపారు. మార్గదర్శి మోసాలపై ప్రజలకు నిజాలు తెలియాలన్నారు. కోట్ల రూపాయలు కట్టిన బాధితులకు మార్గదర్శి నుంచి వేలల్లో మాత్రమే దక్కిందన్నారు.

మార్గదర్శి మోసాలపై కొన్ని పత్రికలు తప్పుడు కథనాలు రాస్తున్నాయని సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిట్స్‌ నిబంధనలను మార్గదర్శి పాటించడం లేదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మార్గదర్శి మోసాలపై ఐటీ, ఈడీలకు సమాచారమిచ్చామని చెప్పారు. కోటికి పైగా చిట్స్‌ వేసిన బాధితులు 800 మందికి పైగా ఉన్నారని తెలిపారు. అన్ని రూల్స్‌ పాటిస్తున్నామని చెబుతూ మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చిట్‌ వేలం జరపకుండా నెలలపాటు పొడిగిస్తున్నారని గుర్తు చేశారు. 40 శాతం చిట్‌ గ్రూపుల్లో చందాదారులే లేరన్నారు. కంపెనీనే సొంతంగా చిట్స్‌ ను తీసుకుంటోందని బాంబు పేల్చారు.

చెక్‌ ప్రిపేర్‌ అయినా లెడ్జర్‌ లో వివరాలు పొందుపరచడం లేదని సీఐడీ అదనపు డీజీపీ సంజయ్‌ తెలిపారు. చందాదారులను బెదిరిస్తూ చిట్‌ అమౌంట్‌ ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రతి చిట్‌ గ్రూపులో మోసాలు బయటపడ్డాయన్నారు. గోస్ట్‌ సబ్‌ స్క్రైబర్స్‌ పేరుతో కంపెనీనే చందాదారులు కట్టిన డబ్బులు తీసుకుంటోందని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో మార్గదర్శిపై పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదులు నమోదయ్యాయన్నారు. కొందరు చిట్‌ వేయకున్నా వారి పేరుతో చిట్స్‌ నడుస్తున్నాయని.. దీనిపై వారు ఫిర్యాదు చేశారని వెల్లడించారు.

మార్గదర్శిలో అక్రమాలపై కవర్‌ చేసుకుంటూ ఈనాడు పత్రికలో రాసుకుంటున్నారని సంజయ్‌ మండిపడ్డారు. మార్గదర్శికి అనుకూలంగా.. చిట్‌ ఫండ్‌ నిర్వహణలో తప్పులు లేనట్లు రాస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. మేము రాసిందే కరెక్ట్‌ అన్న ధోరణిలో రామోజీ, శైలజా కిరణ్‌లు ఉన్నారన్నారు. అందుకే ప్రజలకు వివరాలు వెల్లడిస్తున్నామని తెలిపారు. విచారణకు కూడా వారిద్దరూ సహకరించడం లేదని చెప్పారు. పైగా రామోజీరావు, శైలజ కిరణ్‌లను తాము ప్రశ్నించకూడదు అని వారు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే మార్గదర్సి చిట్స్‌ కార్యాలయాలలో తనిఖీలు చేయడానికి ఒప్పుకోవడం లేదన్నారు. సీఐడీ తనిఖీ చేసినప్పుడు మార్గదర్శి రోజువారీ కార్యకలాపాలకి ఆటంకాలు సృష్టిస్తున్నామని తప్పుడు రాతలు రాస్తున్నారని గుర్తు చేశారు.

మార్గదర్సిలో చిట్స్‌ కడుతున్నట్లు దాదాపు 3 వేల మందికి తెలియనే తెలియదని సంజయ్‌ తెలిపారు. ఈ మేరకు వంద మంది ఘోస్ట్‌ సబ్‌ స్క్రైబర్స్‌ ను గుర్తించి విచారించామన్నారు. ఘోస్ట్‌ సబ్‌ స్క్రైబర్స్‌కు తెలియకుండా వారి ఆధార్, ఇతర వివరాలని మార్గదర్సి వాడుకుంటోందని సంచలన ఆరోపణలు చేశారు. ఒక్క కంపెనీ 20,30, 50 చిట్లు ఎలా వెయ్యగలిగిందని ప్రశ్నించారు.

అలాగే జగజ్జనని కేసులో రూ.9 కోట్ల ఆస్తులు అటాచ్‌ చేశామని సంజయ్‌ తెలిపారు. అనుమతులు లేకుండా చిట్‌ గ్రూప్‌ ను ప్రారంభించారన్నారు. వేలం జరగకుండా నాలుగైదు చిట్లు ఎలా కట్టించుకుంటారని అని నిలదీశారు. శైలజ కిరణ్‌ పీఏ శశికళ నుంచి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయన్నారు.

800 మంది అత్యధిక డబ్బులతో నడుస్తున్న చిట్‌ల వివరాలను ఇన్‌కం ట్యాక్స్‌ విభాగానికి పంపామన్నారు. విజయవాడలో ఒక బిల్డర్‌ రూ.50 కోట్ల చిట్‌లు వేస్తున్నారన్నారు. అవి నగదా, చెక్‌ ల రూపంలో చెల్లిస్తున్నారా..? అని విచారణ చేస్తున్నామని వెల్లడించారు. అలాగే మార్గదర్శి బ్రాంచ్‌ మేనేజర్లు ఏజెంట్లను మోసం చేస్తున్నారని చెప్పారు. నరసరావుపేట బ్రాంచ్‌ లో ఏజెంట్‌ సంతకాన్ని బ్రాంచ్‌ మేనేజర్‌ ఫోర్జరీ చేశారన్నారు.