Begin typing your search above and press return to search.

పోలీసుల ముందుకు వైసీపీ నెంబర్ టు.. క్షణం క్షణం ఉత్కంఠ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు అంతా పోలీసుల ఎదుట క్యూ కడుతున్నారు.

By:  Tupaki Desk   |   9 May 2025 9:42 AM
పోలీసుల ముందుకు వైసీపీ నెంబర్ టు.. క్షణం క్షణం ఉత్కంఠ
X

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు అంతా పోలీసుల ఎదుట క్యూ కడుతున్నారు. సోషల్ మీడియా కార్యకర్త నుంచి వైసీపీ టాప్ లీడర్ల వరకు ప్రతి ఒక్కరిపై ఏదో ఒక కేసు నమోదు అవుతూనే ఉంది. కొందరు ఈ కేసుల నుంచి విచారణ ఎదుర్కుంటుండగా, మరికొందరు ఆ స్థాయి దాటి కోర్టుల్లో బెయిల్ తెచ్చుకుంటున్నారు. ఇక మరికొందరు అరెస్టు అయి జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే తాజాగా వైసీపీలో మాజీ ముఖ్యమంత్రి జగన్ తర్వాత అంతే ప్రాధాన్యం ఉన్న నేత సజ్జల రామకృష్ణారెడ్డిని సీఐడీ పోలీసులు విచారించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై గతంలో జరిగిన దాడికి సంబంధించి ఆయనపై కేసు నమోదైంది.

వైసీపీ నెంబర్ టు నేత, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం గుంటూరులోని సీఐడీ పోలీసుల ఎదుట హాజరయ్యారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి ఘటనలో ఆయన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో సజ్జలతోపాటు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్ కూడా విచారణకు వచ్చారు. గుంటూరు ప్రాంతీయ సీఐడీ కార్యాలయంలో సజ్జలతోపాటు దేవినేని అవినాశ్ ను సీఐడీ ప్రశ్నించింది. దాదాపు గంటపాటు ఇద్దరినీ విచారించారు.

సీఐడీ కార్యాలయానికి కారుపై వెళ్లేందుకు సజ్జల ప్రయత్నించగా, పోలీసులు అనుమతించలేదు. రోడ్డుపైనే ఆయన కారు నిలిపివేయడంతో నడుచుకుంటూ వెళ్లారు. సీఐడీ విచారణకు సజ్జల రావడంతో గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ నేతలు అంబటి రాంబాబు, విడదల రజని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు సజ్జలను కలిసి సంఘీభావం తెలిపారు.

విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన సజ్జల టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన సమయంలో తాను స్థానికంగా లేనని వివరించారు. దాడుల సంస్కృతికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఈ కేసులో గతంలో పోలీసులు తనను విచారించారని, ఇప్పుడు సీఐడీ ప్రశ్నించిందని వెల్లడించారు. తాను బాధ్యత గల పౌరుడిగా సీఐడీని గౌరవిస్తూ విచారణకు వచ్చానన్నారు. దాడులను తాను సమర్థించడం లేదని కూడా పేర్కొన్నారు.