నమ్మశక్యం కాని నిజం? ఉక్రెయిన్‌లో యూఎఫ్‌ఓ దాడి, గడ్డకట్టుకుపోయిన సైనికులు
మరోవైపు, సీఐఏకు చెందిన మాజీ ఏజెంట్ మైక్ బేకర్ మాత్రం ఈ కథనంపై అనుమానాలు వ్యక్తం చేశారు.
By: Tupaki Desk | 17 April 2025 3:00 AM ISTఉక్రెయిన్‌లో సోవియట్ సైనికుల మీద ఏకంగా గ్రహాంతరవాసులే దాడి చేశారట! వినడానికి ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా ఉన్నా, అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ బయటపెట్టిన కొన్ని రహస్య ఫైల్స్‌లో ఈ విషయం ఉందట. దీంతో ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిజానికి ఈ పత్రాల్ని 2000 సంవత్సరంలోనే డీక్లాసిఫైడ్ చేశారు. కెనడాకు చెందిన వీక్లీ న్యూస్, ఉక్రెయిన్‌కు చెందిన హోలోస్ ఉక్రెయినీ అనే పత్రికలు ఈ విషయాన్ని రిపోర్ట్ చేశాయి. అప్పటినుంచి గుర్తుతెలియని ఎగిరే వస్తువులు (యూఎఫ్‌వో) గురించి వెతికేవాళ్ల మధ్య ఇది ఒక హాట్ టాపిక్‌గా మారిపోయింది. అంతేకాదు, పాపులర్ పాడ్‌కాస్ట్ అయిన ‘జోరోగన్ ఎక్స్‌పీరియన్స్’లో కూడా దీన్ని గురించి చర్చించారు. ఇంతకీ ఆ ఫైల్స్‌లో ఏం ఉందో తెలుసుకుందాం పదండి!
సీఐఏ పత్రాల్లో పేర్కొన్న దాని ప్రకారం, సోవియట్‌కు చెందిన ఒక ప్లాటూన్ దళం సాసర్ ఆకారంలో ఎగురుతున్న ఒక వస్తువు మీద కాల్పులు జరిపింది. దీంతో ఆ వస్తువులో ఉన్న గ్రహాంతరవాసులు ఎదురుదాడి చేశారట. ఈ దాడిలో 23 మంది సైనికులు అక్కడి నుంచి తప్పించుకునేలోపే గడ్డకట్టుకుపోయారట. కొందరి రక్తం కూడా గడ్డకట్టుకుపోయినట్లు గుర్తించారని ఆ పత్రాల్లో ఉంది. 1991లో సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత దీనికి సంబంధించిన 250 పేజీల కేజీబీ రిపోర్టును సీఐఏ సంపాదించిందట. న్యూయార్క్ పోస్ట్ పత్రిక ఒక కథనంలో దీనికి సంబంధించిన ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, చిత్రాలు ఆ రిపోర్టులో ఉన్నాయని పేర్కొంది. సీఐఏ దగ్గర ఉన్న భారీ సమాచార సేకరణలో భాగంగా ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎలక్ట్రానిక్ రీడింగ్ రూమ్‌లో ఈ పత్రాలు అందుబాటులో ఉన్నాయని ఆ పత్రిక తెలిపింది.
ఆ రిపోర్టులో ఇంకేముందంటే, ఉక్రెయిన్‌లో శిక్షణ కార్యక్రమంలో ఉన్న సోవియట్ సైనిక బృందం చాలా తక్కువ ఎత్తులో ఎగురుతున్న సాసర్ లాంటి ఒక పెద్ద వాహనాన్ని చూసిందట. ఆ సమయంలో ఒక సైనికుడు క్షిపణిని ప్రయోగించగా అది దాన్ని తాకడంతో అది క్రాష్ ల్యాండ్ అయింది. దానిలో నుంచి పొట్టిగా ఉన్న ఆకారాలు బయటకు దిగాయని, వాటికి పెద్ద కళ్లు, పొడవైన చేతులు ఉన్నాయని ఆ రిపోర్టులో ఉంది. అంతేకాదు, వారు చాలా తీవ్రమైన కాంతి, వెలుగుతో ఉన్న ఒక పరికరంతో ఎదురుదాడి చేశారని కూడా ఆ నివేదిక తెలిపింది.
ఆ తర్వాత అక్కడ దొరికిన ఆ ఎగిరే వస్తువు శకలాలను కేజీబీ ఏజెంట్లు ఒక రహస్య ప్రదేశానికి తరలించారు. వారికి అక్కడ ఒక గుర్తుతెలియని వెలుగు కనిపించిందని, దాని వల్ల అక్కడి సైనికులందరూ బిగుసుకుపోయారని గుర్తించారు. గ్రహాంతరవాసుల దగ్గర మనం ఊహించిన దానికన్నా చాలా అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయని సీఐఏ తేల్చిందని ఆ పత్రాల్లో ఉంది. కెనడాకు చెందిన వరల్డ్ న్యూస్ 1993లో ఈ ఘటన 1989 నుంచి 1990 మధ్యలో జరిగిందని వెల్లడించింది. ఒక ఊహాజనిత కథలాంటి ఈ రిపోర్టు సీఐఏ ఫైల్స్‌లో ఉండటం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది.
మరోవైపు, సీఐఏకు చెందిన మాజీ ఏజెంట్ మైక్ బేకర్ మాత్రం ఈ కథనంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఒకవేళ గ్రహాంతరవాసుల ఘటన నిజంగా జరిగి ఉన్నా, ప్రచురితమైన ఈ నివేదిక మాత్రం ప్రత్యక్షంగా చూసిన వాళ్ల సమాచారం నుంచి రాలేదని, అది నాలుగైదు చేతులు మారిన సమాచారాన్ని ప్రచురించినట్లుగా ఉందని ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా, ఈ కథనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యూఎఫ్‌వోల గురించి ఆసక్తి ఉన్నవాళ్లందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
