ఏది అసలైన క్రిస్మస్...!
ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా, అత్యంత భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు.
By: Tupaki Desk | 25 Dec 2025 11:16 AM ISTఈ రోజు ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా, అత్యంత భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. డిసెంబర్ 24వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచే ఈ సంబరాలు చాలా చోట్ల మొదలైపోయాయి. మనుషుల పాపాలను మోసుకునిపోవడానికి దేవుడే తన కుమారుని మానవరూపంలో ఈ భూమిపైకి పంపిన రోజే.. ఈ క్రిస్మస్! ఈ సందర్భంగా పాత నిబంధనలోని ప్రచనాలు.. కొత్త నిబంధనలో వాటి నెరవేర్పు ఎలా జరిగిందనేది ఒకసారి పరిశీలిద్దామ్..!
అవును... ఈ రోజు క్రీస్తు జన్మదినం. ఈ విశ్వం యొక్క కాలచక్రాన్ని రెండుగా విభజించి.. మానవ చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించిన అద్భుత ఘట్టం యేసు క్రీస్తు జననం. సుమారు రెండువేళ సంవత్సరాల క్రితం పాలస్తీనాలోని బెత్లహేము అనే చిన్న గ్రామంలో ఓ పశువుల పాకలో లోక రక్షకుడు, కన్య మరియ గర్భాన్న జన్మించారు. తనను అనుసరించేవారికి దేవుడు తన పుట్టుకతో ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని ఈ సందర్భంగా చెప్పకనే చెప్పారు.
'నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్యకుమారునికి తల వాల్చుకోవడానికి స్థలం లేదు' అని యేసు పెద్దైన తర్వాత తన ప్రజలకు చెప్పారు. అంటే... యేసు కఠినంగా, అగౌరవంగా ఉండటానికి ప్రయత్నించినట్లు కాదు.. తన అనుచరుడిగా ఉండాలనుకునేవారికి జీవితం అంత సులభం కాదని.. ఇది ఇరుకు మార్గమని.. బాధలు, దుఃఖాలు, శ్రమలు, వేదనలు ఉంటాయని.. వాటన్నింటినీ తట్టుకుని నిలబడితేనే అంత్య దినమున ఆయనతో కూడా పరదైసులో ఉంటావని అర్ధం!
ఈ నేపథ్యంలోనే.. క్రీస్తు తాను పశువుల పాకలో జన్మించడంతో ఈ విషయాన్ని చెప్పకనే చెపారు. ఇలా క్రీస్తు భూమిపై జన్మించిన అనంతరం ఆకాశ వీధుల్లో దేవదూతలు... "సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు.. భూమి మీద ఆయనకు ఇష్టులైన మనుషులకు సమాధానమును కలుగును గాక" అని పాటలు పాడారు! ఈ వేడుక కేవలం ఒక మతానికి పరిమితం కాదు.. అసలు క్రీస్తును అనుసరించడం అంటే అది మతమే కాదు.. అది మార్గం! నిత్యాగ్ని నుంచి తప్పించుకునే మార్గం!
ఇక్కడ మరో విశేషం ఏమిటంటే... క్రీస్తు జన్మించినప్పుడు ఆకాశంలో ఓ అద్భుత నక్షత్రం ఉదయించింది. అది తూర్పు దేశపు జ్ఞానులను బెత్లహేము వరకూ నడిపించింది. ఆ నక్షత్రమే బాలుడైన యేసును దర్శించుకునే అవకాశం వారికి ఇచ్చింది. దీంతో.. యేసును దర్శించుకున్న జ్ఞానులు.. బంగారం, సాంబ్రాణి, బోళములను ఆయనకు కానుకులుగా సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. నేడు ప్రతి ఇంటిపై కనిపిస్తున్న "క్రిస్మస్ స్టార్" ఆనాటి జ్ఞానులకు దారి చూపిన దైవిక కాంతికి నిదర్శనం!
"ఏలయనగా మనకు శిశువు పుట్టెను.. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను.. ఆయన భుజముమీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును" అని పాతనిబంధనలోని యెషయా గ్రం 9వ అధ్యాయం 6వ వచనంలో భక్తులు ప్రవచించారు.. ఆ లేఖనాలు నెరవేరాయి. కొత్తనిబంధనలోని లూకా సువార్త 1వ అధ్యాయం 31 వ వచనం నుంచి ఈ విషయం స్పష్టం అవుతుంది.
ఇందులో భాగంగా... దేవదూత కన్య అయిన మరియకు ప్రత్యక్షమై... 'ఇదిగో నీవు గర్భవతివై కుమారుని కందువు.. ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను' అందుకే.. ఆయన రాజ్యములో పాలిభాగస్తులు కావాలంటే.. ఆయనను నమ్మాలి, విశ్వసించాలి!
అందుకే క్రీస్తు జననం కేవలం ఒక చారిత్రక సంఘటన కాదు.. ఇది పాపాన్ని మోసుకుని పోవు గొర్రెపిల్ల జననం! మరణాన్ని జయించే రక్షకుడిని పంపాలనే దేవుని ప్రణాళిక యొక్క అద్భుతమైన నెరవేర్పు. లేఖనాలు ముందే చెప్పినట్లుగానే రక్షకుడు భూమిపైకి వచ్చిన రోజే ఈ క్రిస్మస్. ఈ సందర్భంగా... ఈ క్రిస్మస్ వేళ మన హృదయాలను శుద్ధి చేసుకుని, ప్రేమను పంచుతూ, శాంతిని విస్తరిస్తూ లోక రక్షకుడిని జీవితాల్లోకి ఆహ్వానించడమే అసలైన క్రిస్మస్!
ఈ సందర్భంగా.. తుపాకీ.కామ్ పాఠకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు!
