Begin typing your search above and press return to search.

గేల్-మాల్యా-మోదీ.. ముగ్గురు 'ఆటగాళ్లు' ఒకే ఫ్రేమ్ లో..

..ఈ ముగ్గురు ఆటగాళ్లు ఒకే ఫ్రేమ్ లో కనిపించి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశారు. అది కూడా ఇంగ్లండ్ గడ్డపై కావడం విశేషం.

By:  Tupaki Desk   |   2 July 2025 2:05 PM IST
గేల్-మాల్యా-మోదీ.. ముగ్గురు ఆటగాళ్లు ఒకే ఫ్రేమ్ లో..
X

ఒకరేమో 45 ఏళ్లు వచ్చినా క్రికెట్ ను వదలని ’ఆటగాడు’

మరొకరేమో జనరంజకమైన ఆటనే రూపదిద్దిన ‘ఆటగాడు’

ఇంకొకరు జీవితం అంటేనే జల్సా చేయడం అనే ‘ఆటగాడు’

..ఈ ముగ్గురు ఆటగాళ్లు ఒకే ఫ్రేమ్ లో కనిపించి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశారు. అది కూడా ఇంగ్లండ్ గడ్డపై కావడం విశేషం. యూనివర్సల్ బాస్ గురించి క్రికెట్ ఫ్యాన్స్ కు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలో ఏ మూలన క్రికెట్ లీగ్ జరిగినా అందులో కనిపించే ఏకైక బ్యాట్స్ మన్ వెస్టిండీస్ వీరుడు క్రిస్ గేల్. ఇప్పటికీ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడగల సత్తా ఉన్నవాడు. అయితే, ఏ జట్టూ తీసుకోవడం లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు చాలా ఏళ్లు ఆడాడు గేల్. అద్భుత ఇన్నింగ్స్ తో అలరించాడు కూడా. ఆటతోనే కాదు వ్యక్తిగత జీవితంలోనూ గేల్ చాలా విలాస పురుషుడు. తరచూ యువతులతో జల్సాలు చేస్తుంటాడు.

ఇక ఐపీఎల్ పుట్టుకతోనే సంచలనం.. ఇప్పుడు లక్ష కోట్ల రూపాయిల లీగ్. నాణ్యత, ధరలోనే కాక ప్రపంచంలో మరే లీగ్ కూ లేనంత గొప్ప పేరు దీని సొంతం. అలాంటి లీగ్ కు పురుడు పోసింది లలిత్ మోదీ. భారత్ లోని సంపన్న కుటుంబానికి చెందిన లలిత్.. ఐపీఎల్ కు దాదాపు ఐదేళ్లు కర్త-కర్మ-క్రియ. అలాంటివాడు అదే లీగ్ లో అవకతవకలకు పాల్పడిన కారణంగా దేశం విడిచివెళ్లాడు. పదేళ్లుగా విదేశాల్లో తలదాచుకుంటున్నాడు. ఇప్పటికే పలువురితో ఎఫైర్లు నడిపిన లలిత్ మోదీ.. కొన్నేళ్ల కిందట మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ తోనూ రిలేషన్ లో ఉన్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ ఏడాది టైటిల్ విజేత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ). చాంపియన్ గా నిలవడానికి 17 ఏళ్లు పట్టినా.. లీగ్ లో అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న జట్టు ఆర్సీబీ. అలాంటి ఆర్సీబీకి ఒకప్పుడు ఓనర్ విజయ్ మాల్యా. ఐపీఎల్ తోనే కాదు.. తన బ్రాండ్ కింగ్ ఫిషర్ తో బాగా పాపులర్ అయిన మాల్యా.. విలాస పురుషుడు. 25 ఏళ్ల కిందటే అందమైన మోడల్స్ ను విదేశాలకు తీసుకెళ్లి కొత్త సంవత్సర కేలండర్ ను సూపర్ స్టయిలిష్ గా తీసుకొచ్చిన మోడ్రన్ మేన్. కానీ, బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగవేసిన కేసులో మాల్యా దేశం విడిచి పారిపోయాడు. లండన్ లో తలదాచుకుంటున్నాడు.

ఐపీఎల్ తో చాలా దగ్గరి సంబంధం ఉన్న ఈ ముగ్గురు ‘ఆటగాళ్లు‘ ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. అది కూడా లండన్ లో కలిశారు. బహుశా వింబుల్డన్ చూసేందుకో... ఇండియా-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ చూసేందుకో.. వెకేషన్ లోనో..? ముగ్గురూ కలిశారు. ఈ మేరకు మాల్యా, లలిత్ మోదీతో ఉన్న ఫొటోను క్రిస్ గేల్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ’మేం ఎంతో ఆనందంగా గడుపుతున్నాం..అందమైన సాయంత్రానికి ధన్యవాదాలు’ అని క్యాప్షన్ పెట్టాడు.

ఆర్సీబీ తరఫున అద్భుత ఇన్నింగ్స్ ఆడిన గేల్.. 30 బంతుల్లోనే సెంచరీ కూడా కొట్టాడు. లీగ్ లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ కూడా. 2018లో ఆర్సీబీ వదిలేశాక పంజాబ్ కింగ్స్ కు మూడేళ్లు ఆడాడు. 2021 నుంచి ఐపీఎల్ లో లేడు. గత నెల 3న ఆర్సీబీ టైటిల్ కొట్టాక ఆ జట్టు ఆటగాళ్లను అభినందించేందుకు మైదానంలోకి వచ్చాడు గేల్.