చోడవరం.. తమ్ముళ్ల గరం - గరం రీజన్ ఇదే.. !
ఉమ్మడి విశాఖపట్నం (ప్రస్తుతం అనకాపల్లి) లోని చోడవరం నియోజకవర్గం టిడిపిలో టికెట్ పోరు తీవ్రంగా సాగుతోంది.
By: Garuda Media | 13 April 2026 4:00 PM ISTఉమ్మడి విశాఖపట్నం (ప్రస్తుతం అనకాపల్లి) లోని చోడవరం నియోజకవర్గం టిడిపిలో టికెట్ పోరు తీవ్రంగా సాగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి ఈ టికెట్టు దక్కించుకునేందుకు ఇద్దరు బలమైన నాయకుల మధ్య ఆధిపత్యం, అధికారం కూడా బలమైన ప్రభావం చూపిస్తుంది. గత ఎన్నికల్లో సీనియర్ నాయకుడు గతంలో రెండుసార్లు విజయం సాధించిన కె ఎస్ ఎన్ ఎస్ ఎన్ రాజుకు పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. వాస్తవానికి అప్పటివరకు ఆయన రేసులో లేరు. అంతేకాదు ఆయన రాజకీయంగా కూడా ఇక తప్పుకుంటారు అన్న చర్చ నడిచింది.
కానీ అనూహ్యంగా 2024 ఎన్నికల్లో రాజుకు టికెట్ ఇస్తూ చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనికి ముందు పార్టీలో యాక్టివ్ గా పని చేసిన తాతయ్య బాబు ఈ టికెట్ కోసం పట్టుబట్టారు. తనకే వస్తుందని కూడా ప్రచారం చేసుకున్నారు. అప్పటికే ఆయన దాదాపు 5 నుంచి 10 లక్షల రూపాయల దాకా ఖర్చు చేసి ప్రచారానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో పార్టీ అధిష్టానం పక్కనపెట్టి రాజుకు అవకాశం కల్పించింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన తాతయ్య బాబు పార్టీ అధిష్టానం దగ్గర పంచాయతీ పెట్టారు.
దీంతో ఆయనకు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం ఆయన అనకాపల్లి జిల్లా టిడిపి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి టికెట్ తనకే దక్కుతుందని తాతయ్య బాబు ప్రచారం చేసుకుంటున్నారు. ఇదే ఇప్పుడు రాజకీయంగా ఇటు ఎమ్మెల్యేకి అటు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తాతయ్య బాబుకు మధ్య వివాదాన్ని చెలరేగేలా చేసింది. వచ్చే ఎన్నికల నాటికి తనకే టికెట్ దక్కుతుందని తాతయ్య బాబు భావిస్తున్నారు. కానీ రాజు మాత్రం ఈ టికెట్ నాదేనని చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ పరిణామాలపై ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనేలాగా పరిస్థితి మారిపోయింది. ఎమ్మెల్యే చేపడుతున్న పనులను తాతయ్య బాబు వర్గం విమర్శిస్తుండగా తాతయ్య బాబు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఎమ్మెల్యే ప్రచారం చేస్తున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఆయన చేస్తున్నది ఏమి లేదని, పార్టీ పరంగా కార్యకర్తలు కూడా డైలమాలో ఉన్నారని ఎమ్మెల్యే ప్రచారం చేస్తున్నారు. ఇక తాతయ్య బాబు వర్గం మరో విధమైన ప్రచారాన్ని తెరమీదకు తెచ్చింది.
వైసీపీలో ఉన్న నాయకులను ఎమ్మెల్యే తన వైపు తిప్పుకొని ప్రచారం చేస్తున్నారని.. పార్టీలో సంస్థగతంగా పనిచేసిన కార్యకర్తలు నాయకులను ఆయన దూరం పెట్టారని చెబుతున్నారు. దీని వల్ల పార్టీ బలహీనపడుతుందని ఆవర్గం చెబుతోంది. మొత్తంగా ఈ ఇద్దరు మధ్య ఉన్న టిక్కెట్ వ్యవహారం జిల్లాలో రాజకీయాలను బలహీనపరిచేలా చేస్తుంది అన్నది ప్రధాన విమర్శ. అంతేకాదు దీనిపై పార్టీ అధిష్టానానికి కూడా ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం తాతయ్య బాబు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా అనకాపల్లి జిల్లా టిడిపి అధ్యక్షుడుగా కూడా ఉన్నారు.
