ఛాన్స్ దొరికింది.. మొత్తం ఊడ్చేశారు.. తమ్ముళ్లా మజాకా.. !
దీంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సర్కారుకు తాఖీదులు ఇచ్చినట్టు తెలిసింది.
By: Tupaki Desk | 19 April 2025 4:23 PM ISTచిత్తూరు టీడీపీ తమ్ముళ్ల తీరు మారలేదు. ఇసుక విషయంలో జోక్యం చేసుకోవద్దని.. ఒకటికి రెండు సార్లు సీఎం చంద్రబాబు హెచ్చరించినా.. నాయకుల తీరులో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. దీంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సర్కారుకు తాఖీదులు ఇచ్చినట్టు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నా.. చిత్తూరుపై కేంద్రం పెద్ద ఎత్తున దృష్టి పెట్టింది. ఇక్కడి స్వర్ణముఖి నదిలో ఇసుక పేరుకు పోయి ఉండడంతో దీనిని పరిశీలించిన పెద్దలు .. దీనిని తీయాలని.. నది నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడాలని అవకాశం ఇచ్చారు.
అంతే.. ఇంకేముంది..? అవకాశం లేనప్పుడే.. ఊడ్చేసిన తమ్ముళ్లు, అవకాశం చిక్కితే ఊరుకుంటారా? పైగా కేంద్రమే తవ్వమని ఆదేశిస్తే.. ఆగుతారా? ఊడ్చి పడేశారు. అయితే.. అసలు చిక్కులు ఇప్పుడు వచ్చాయి. సదరు తవ్వకాలకు సంబంధించి లెక్కలు చెప్పకపోవడం.. మనుషులతో తీయించాల్సిన ఇసుకను యంత్రాలతో తవ్వించేయడం.. ఎక్కడకు తరలించారో కూడా తెలియకుండా వ్యవహరించడం వంటివి కూటమి సర్కారుకు పంటికింద రాయి.. కంట్లో నలుసుగా మారింది.
ఏం జరిగింది...
శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని కోట మండలం గూడలి స్వర్ణముఖి నదిలో డీసిల్టింగ్(పేరుకు పోయి న ఇసును తొలగించడం) చేయాలని కేంద్రం గత నెల 5న అధికారికంగా ప్రకటించింది. దీంతో అధికార పార్టీకి చెందిన కొందరు తమ్ముళ్లు రంగంలోకి దిగారు. ఆ వెంటనే తవ్వకాలు జరిగాయి.. అయితే.. తవ్వ మన్న దానికన్నా..మొత్తం ఊడ్చేయడంతోపాటు.. అసలు ఎంత ఎక్కడెక్కడి తరలించారు అన్న లెక్కలు జలవనరుల, గనుల శాఖ, రెవెన్యూ అధికారుల వద్ద లేకపోవడంపై ఇప్పుడు వివాదం తెరమీదికివచ్చింది.
ఇక, నియోజకవర్గంలో ఎలాంటి డంపింగ్ యార్డు లేకపోగా ఇసుక అమ్మకాలపై నేటికీ ఆన్‌లైన్‌లో వివరాలు పొందుపర్చలేదు. ప్రస్తుతం ఇక్కడ ప్రభుత్వ నిబంధనల మేరకు పూడికతీత పనులు జరగడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. తవ్వకాలను కూలీలతో చేపట్టాల్సి ఉండగా నేరుగా యంత్రాలతోనే తవ్వి అక్కడే దర్జాగా విక్రయించారు. రాత్రీపగలు తేడా లేకుండా తవ్వకాలు.. తరలింపు చేస్తున్నారు. వాస్తవానికి నదిలో డీసిల్టింగ్ ద్వారా 55 వేల టన్నుల ఇసుకను తరలించాలి. కానీ,.. దీనికి రెండింతలు ఎక్కువగా తోడేశారు. ఇది ఇప్పుడు సర్కారు మెడకు చుట్టుకుంది.
