Begin typing your search above and press return to search.

రేపిస్టులకు చిత్తూరు పోలీసుల షాక్ ట్రీట్ మెంట్

కొద్దిరోజుల క్రితం చిత్తూరులో సంచలనంగా మారి.. రాజకీయ రగడకు తెర తీసిన మైనర్ పై గ్యాంగ్ రేప్ వ్యవహారం తెలిసిందే.

By:  Garuda Media   |   4 Oct 2025 1:34 PM IST
రేపిస్టులకు చిత్తూరు పోలీసుల షాక్ ట్రీట్ మెంట్
X

కొద్దిరోజుల క్రితం చిత్తూరులో సంచలనంగా మారి.. రాజకీయ రగడకు తెర తీసిన మైనర్ పై గ్యాంగ్ రేప్ వ్యవహారం తెలిసిందే. ఈ ఉదంతంలో మైనర్ బాలికపై ముగ్గురు దుర్మార్గులు గ్యాంగ్ రేప్ నకు పాల్పడటం.. నిందితులకు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉందని.. అందుకే చర్యలు తీసుకోవటం లేదన్న ప్రచారం సాగింది. అయితే..ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్న విషయం తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు స్పష్టం చేశాయి. అన్నింటికి మించి గ్యాంగ్ రేప్ బాధితుల విషయంలో చిత్తూరు పోలీసులు వినూత్నంగా వ్యవహరించారు.

కాళ్లకు చెప్పులు తీయించి.. నడిరోడ్డు మీద భారీ బందోబస్తుతో కిలో మీటర్ దూరం జనమంతా చూసేలా కోర్టు వరకు నడిపించటం ద్వారా వారికి పెద్ద శిక్షే వేశారు. అయితే..వీరు చేసిన పనికి ఈ ట్రీట్ మెంట్ ఏ మాత్రం సరిపోదన్నమాటలు వినిపిస్తున్నాయి. ఇంతకూ అసలేం జరిగింది? నిందితులు ఎవరు? వారి బ్యాక్ గ్రౌండ్ ఏంటి? వారి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ మీద వచ్చిన ఆరోపణల్లో నిజం ఎంత? కోర్టు వీరి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుందన్నది చూస్తే..

అసలేం జరిగింది

సెప్టెంబరు 25న చిత్తూరు పట్టణంలోని ముకంబట్టు నగర వనానికి ఒక బాలిక, ఆమె స్నేహితుడు వెళ్లారు. వీరిద్దరు కలిసి ఉన్న సమయంలో నిందితుల్లో ఒకడైన మహేశ్ అనే వ్యక్తి వీరి వీడియో తీశాడు. అతడి వెంట ఏ2 అయిన కిషోర్, ఏ3 అయిన హేమంత్ ప్రసాద్ లు ఉన్నారు. వీరు ముగ్గురు యువకుడ్ని బంధించి.. అతడి ఎదుటే బాలికపై ఒకరి తర్వాత ఒకరు చొప్పున అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం యువకుడి వద్ద ఉన్న బంగారాన్ని లాక్కొని వెళ్లిపోయారు.

ఆ తర్వాతేం జరిగింది?

ఈ షాకింగ్ ఘటనతో బాధితులైన మైనర్ బాలిక.. దెబ్బలు తిన్న యువకుడు కానీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే.. సెప్టెంబరు 29న నగరవనం వద్ద బాధితుడైన యువకుడు.. అతని స్నేహితులు.. బంధువులు కలిసి నిందితుల్ని గుర్తించి దేహశుద్ధి చేశారు. ఈ చర్యతో నిందితులు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయారు.

పోలీసులేం చేశారు?

ఈ ఉదంతం గురించి సమాచారం అందినంతనే పోలీసులు స్పందించారు. విచారణలో భాగంగా అసలేం జరిగిందన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకొని ఫోక్సో కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగానూ.. చెన్నై.. బెంగళూరు ప్రాంతాల్లోనూ ప్రత్యేక టీంలతో కలిసి గాలింపు చేపట్టారు. ఇదే సమయంలో నిందితులు రాష్ట్రంలోని ప్రధాన పార్టీ సానుభూతిపరులని.. అందుకే పోలీసులు చర్యలు తీసుకోలేదన్న తప్పుడు ప్రచారానికి తెర తీశారు.

ఎట్టకేలకు అరెస్టు

తమ మీద వచ్చిన విమర్శలు.. ఆరోపణలకు మాటలతో కాకుండా చేతలతో స్పందించారు చిత్తూరు పోలీసులు. నిందితుల్ని నగర శివారులో అరెస్టు చేసిన అనంతరం ప్రెస్ మీట్ పెట్టారు. ఈ కేసుకు ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని చెప్పిన పోలీసులు.. నిందితుల నేర చరిత్ర గురించి చెబుతూ షాకింగ్ అంశాల్ని వెల్లడించారు. నిందితులు గతంలోనూ ఒంటరిగా ఉన్న ప్రేమజంటల వీడియోలు.. ఫోటోలు తీసి బెదిరించి.. అత్యాచారానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. వీరి నేరాలకు సంబంధించిన నాలుగైదు వీడియోలు వారి ఫోన్లలో ఉన్న విషయాన్ని గుర్తించినట్లు చెప్పారు. వీరి దారుణాలకు బలైన బాధితులు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని పోలీసులు కోరుతున్నారు.

నిందితులపై గతంలోనూ కేసులు

తాజాగా ఫోక్సోకేసులో అరెస్టు అయిన నిందితుల నేర చరిత్రతో పాటు.. వారిపై పాత కేసులు ఏమైనా ఉన్నాయా? అన్నది చూసినప్పుడు మహేశ్ మీద 2019లో ఈవ్ టీజింగ్ కేసులో నిందితుడిగా పేర్కొన్నారు. కిశోర్ మీద 2022లో బ్లాక్ లో మద్యాన్ని అమ్ముతున్న కేసు ఉందని గుర్తించారు. పార్కులకు వచ్చే ప్రేమజంటలపై దాడి చేయటం.. వారు ఏకాంతంగా ఉన్న వీడియోల్ని షూట్ చేసి నగదు.. విలువైన ఆభరణాల్ని దోచుకొని లైంగిక దాడులకు పాల్పడటం వీరి ప్రవ్రతిగా గుర్తించారు.

చిత్తూరు పోలీసుల వెరైటీ శిక్ష

దారుణ నేరాలకు పాల్పడిన నిందితులకు రోటీన్ కు భిన్నమైన ట్రీట్ మెంట్ ఇస్తూ కోర్టులో హాజరుపర్చారు. నిందితుల చెప్పులు తీయించి.. నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా.. కిలో మీటర్ మేర నడిపిస్తూ.. చిత్తూరు పాత డీపీవో ఆఫీసు నుంచి జిల్లా కోర్టు వరకు ప్రజలంతా వీరిని చూసేలా నడిపించుకుంటూ తీసుకెళ్లారు.వీరిని కోర్టులో హాజరుపర్చగా.. ఈ నెల 17 వరకు రిమాండ్ విధిస్తూనాలుగో అదనపు సివిల్ కోర్టు జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి దారుణాలకు పాల్పడే దుర్మార్గుల విషయంలో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలన్న మాట బలంగా వినిపిస్తోంది.