ఫోన్ పే, ఏటీఎం పిన్ నెంబరు చెప్పి మరీ.. కుటుంబం తీవ్ర నిర్ణయం
ఏం కష్టం వచ్చిందో కానీ ఓ కుటుంబంలో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
By: Tupaki Political Desk | 22 Jun 2026 9:00 AM ISTఏం కష్టం వచ్చిందో కానీ ఓ కుటుంబంలో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ముందుగా పిల్లలకు విషమిచ్చి, తర్వాత తాము అదే విషం తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా తమ చావు ఎవరికీ భారం కాకూడదనే ఉద్దేశంతో అంత్యక్రియల కోసం తమ డబ్బునే వాడాలని సూసైడ్ నోటు రాసి మరీ చనిపోవాలని నిర్ణయించుకోవడం హృదయాలను కలిచివేస్తోంది. చిత్తూరు రూరల్ మండలం బంగారెడ్డిపల్లిలో చోటుచేసుకున్న ఒక ఘటన అందరినీ కలచివేయడమే కాకుండా, మరణంలో కూడా ఆ కుటుంబం ప్రదర్శించిన ఆత్మాభిమానం తీవ్ర చర్చకు దారితీస్తోంది.
బంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన దామోదర్, ఆయన భార్య నిర్మల, వారి పిల్లలు దిలీప్, శ్రీవిద్య తమ ఇంట్లోనే మరణించి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. భార్య నిర్మల గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటం, ఆ అనారోగ్యాన్ని భరించలేక, భార్యపై ఉన్న ప్రేమతో దామోదర్ ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. తన కుటుంబంతో కలిసి జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్న దామోదర్, మొదట భార్య, పిల్లలకు విషం ఇచ్చి, ఆ తర్వాత తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మరణంలోనూ నిక్కచ్చి నిర్ణయం
ఈ ఘటనలో అందరినీ కదిలిస్తున్న అంశం దామోదర్ రాసిన సూసైడ్ నోట్. చనిపోయే ముందు ఆయన రాసిన లేఖలో ‘మా చావుకు ఎవరూ కారణం కాదు’ అని పేర్కొనడమే కాకుండా, తమ అంత్యక్రియల కోసం ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదని భావిస్తున్నట్లు రాశాడు. తన ఏటీఎం పిన్ నెంబర్లను, ఫోన్ పే వివరాలను ఆ లేఖలో స్పష్టంగా రాసి ఉంచాడు. "నా ఖాతాలో డబ్బులు ఉన్నాయి, వాటిని డ్రా చేసి మా అంత్యక్రియలకు ఉపయోగించండి" అని ఆయన కోరడం చూస్తుంటే, చివరి క్షణంలో కూడా ఇతరులపై భారం వేయకూడదనే ఆయన ఆత్మాభిమానం, వ్యక్తిత్వం స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. మరణం అంచున ఉన్నా, తన బాధ్యతలను విస్మరించని ఆ తండ్రి ఆవేదన అందరినీ కన్నీరు పెట్టించింది.
తీరని విషాదం
ఒకే కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో బంగారెడ్డిపల్లి గ్రామం శోకసముద్రంలో మునిగిపోయింది. ఆ కుటుంబానికి బంధువులు కూడా లేని పరిస్థితి కావడంతో, ఆత్మీయులను కోల్పోయిన బాధలో ఉన్న స్థానికులే ఇప్పుడు వారి అంత్యక్రియల ఏర్పాట్లు చేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే చిత్తూరు రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం వాటిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల మృతికి కారణమైన పరిస్థితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
