Begin typing your search above and press return to search.

వైసీపీకి మెగాస్టార్ మద్దతు... చెప్పిందెవరంటే...!

దీనికి ఉదాహరణగా తన అన్న మెగాస్టార్ చిరంజీవి వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారని పవన్ చెప్పడం ఆశ్చర్యం కలిగించేలా ఉంది.

By:  Tupaki Desk   |   24 Nov 2023 12:14 PM GMT
వైసీపీకి మెగాస్టార్ మద్దతు... చెప్పిందెవరంటే...!
X

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరం అయి చాలా కాలం అయింది. ఆయన ఎపుడూ రాజకీయాల గురించి మాట్లాడడం లేదు. తన పనేంతో తానేంటో అన్నట్లుగా ఉన్నారు. చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పేరుతో పార్టీ పెట్టారు. 2009లో ఉమ్మడి ఏపీలో పోటీ చేశారు. 18 సీట్లు సాధించారు. ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి రాజ్యసభ మెంబర్ అయ్యారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు.

ఇక 2018లో తన రాజ్యసభ సభ్యత్వం ముగియగానే ఆయన నో పాలిటిక్స్ అనేశారు. మరి చిరంజీవి ఎవరికి మద్దతు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే అది నిజంగా సంచలనమే. ఆ మాట కూడా అన్నది ఎవరు అన్నది ఆలోచిస్తే ఇంకా సంచలనమే. చిరంజీవి వైసీపీకి మద్దతు ఇచ్చారని చెప్పింది స్వయానా ఆయన తమ్ముడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్.

ఆయన తెలంగాణా ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలలో బంధాలు స్నేహాలు వేరు అని పవన్ తనదైన డెఫినిషన్ చెప్పారు. దీనికి ఉదాహరణగా తన అన్న మెగాస్టార్ చిరంజీవి వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారని పవన్ చెప్పడం ఆశ్చర్యం కలిగించేలా ఉంది.

అలాగే తమ కుటుంబ సభ్యులు కొందరు వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారని ఆయన చెప్పుకొచ్చారు. స్నేహాలు ఎవరితో ఉన్నా తన సిద్ధాంతాలు వేరు అని అందుకే తాను మోడీకే సపోర్ట్ అని పవన్ క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే పవన్ సడెన్ గా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావన ఎందుకు తెచ్చారు అన్నది చర్చకు వస్తోంది.

చిరంజీవి ఇప్పటికి నాలుగేళ్ళ క్రితం 2020 ప్రాంతంలో జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనకు మద్దతు ఇచ్చారు. విశాఖ అన్ని విధాలుగా రాజధానికి తగినది అని ఆయన అప్పట్లో స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తరువాత జగన్ ఇంటికి వెళ్ళి భోజనం చేశారు. అదే విధంగా జగన్ తో రెండు మూడు సార్లు భేటీ అయి చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలను కూడా ముచ్చటించారు.

జగన్ సినీ పరిశ్రమ పట్ల పాజిటివ్ గా ఉన్నారని అప్పట్లో కితాబు ఇచ్చారు చిరంజీవి. అయితే ఆనాడు ఏపీలో జనసేనాని పలు సభలలో మాట్లాడుతూ తన అన్న సినీ పరిశ్రమ సమస్యల గురించి వెళ్తే ఆయన చేత కూడా దండం పెట్టించుకుని సీఎం అవమానించారని విమర్శించారు. ఆనాడు చిరంజీవి వైసీపీకి మద్దతు ఇచ్చారని ఎక్కడా కనీసంగా చెప్పలేదు.

ఇపుడు తన అన్నయ్య వైసీపీకి మద్దతు ఇచ్చారని చెప్పడం మాత్రం రాజకీయంగా చూస్తే సంచలనంగానే ఉంది. ఇటీవల చిరంజీవి ఒక సినిమా కార్యక్రమంలో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం సినీ పరిశ్రమ వంటి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తోంది అని ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదాతో పాటు ఇతర విషయాలు చూసుకోవాలని సలహా ఇచ్చారు కూడా. దాంతో మెగాస్టార్ చిరంజీవి వైసీపీ మీద ఎందుకో కోపంగా ఉన్నారు అన్న టాక్ నడచింది.

ఇక వచ్చే ఎన్నికల్లో జనసేన తరఫున మెగాస్టార్ నేరుగా ప్రచారం చేయకపోయినా తన మద్దతుని ఏదో రూపంలో తెలియచేస్తారు అని అంతా అనుకుంటున్న నేపధ్యంలో పవన్ వైసీపీని చిరంజీవి మద్దతు గురించి చెప్పడంలోని ఆంతర్యం ఏంటి అన్న చర్చ వస్తోంది. ఈ ఎన్నికల్లో కూడా మెగాస్టార్ పొలిటికల్ గా ఎవరికీ మద్దతు ఇవ్వకుండా న్యూట్రల్ గా ఉండిపోతారా అన్న చర్చ కూడా నడుస్తోంది.