Begin typing your search above and press return to search.

చిరంజీవి రాజకీయ వైరాగ్యం...చాలా మందికి స్ఫూర్తిదాయకం...!?

అంటే చిరంజీవి పొలిటికల్ ప్రభావం సినీ కెరీర్ మీద ఏ మాత్రం పడలేదు అనడానికి అది ఒక నిదర్శనం. అంతే కాదు ఆయన సినిమాలు కూడా బాగానే ఆడుతున్నాయి.

By:  Tupaki Desk   |   14 April 2024 4:14 AM GMT
చిరంజీవి రాజకీయ వైరాగ్యం...చాలా మందికి స్ఫూర్తిదాయకం...!?
X

ఆయన మెగాస్టార్. వెండి తెర వేలుపు. రారాజు లాంటి కెరీర్. దాన్ని పక్కన పెట్టి 55 ఏళ్ళ వయసులో రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజారాజ్యం పార్టీని పెట్టి ఉమ్మడి ఏపీలో రాజకీయ సంచలనానికి తెర తీశారు. అయితే ఆయన పార్టీని పెట్టిన టైం టైమింగ్ అంత మంచివి కావు అన్నది తరువాత కాలంలో రుజువు అయింది. ఒక వైపు విభజన వాదం ఉంది. మరో వైపు తెలంగాణా ఉద్యమం ఉంది. అలాగే అటు వైఎస్సార్ ఇటు చంద్రబాబు ఇలా హోరాహోరీ పోరు సాగిస్తున్న సందర్భం అది.

దాంతో మెగాస్టార్ ప్రజారాజ్యం పార్టీ మధ్యన పడి నలిగిపోయింది అని ఒక సత్యమైన విశ్లేషణ ఉంది. ప్రజారాజ్యం పార్టీ ఆ సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా ఏకంగా డెబ్బై లక్షల ఓట్లు 18 అసెంబ్లీ సీట్లు సాధించింది. ఇది గొప్ప విషయంగానే అంతా చూసారు.

అయితే ఆ తరువాత చకచకా సంభవించిన రాజకీయ పరిణామాలతో ఆయన పార్టీని నడపలేక కాంగ్రెస్ లో విలీనం చేయడం కేంద్ర మంత్రిగా కొన్నాళ్ళు పనిచేసి ఆ మీదట రాజకీయాలకు పెద్ద నమస్కారం చేయడం జరిగిపోయాయి. ఇక ఆయన ఇపుడు సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఆయన మళ్ళీ సినీ రంగ ప్రవేశం చేశాక దేశంలోనే అత్యున్నత రెండవ పౌర పురస్కారం అయిన పద్మ విభూషణ్ ఆయనను వరించింది.

అంటే చిరంజీవి పొలిటికల్ ప్రభావం సినీ కెరీర్ మీద ఏ మాత్రం పడలేదు అనడానికి అది ఒక నిదర్శనం. అంతే కాదు ఆయన సినిమాలు కూడా బాగానే ఆడుతున్నాయి. జనాలు కూడా పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో చిరంజీవి తాను వర్తమాన రాజకీయాలకు అనర్హుడిని అని ఒక సంచలన కామెంట్ చేశారు.

తన మనస్తత్వం రాజకీయాలకు పడదని ఆయన అన్నారు. మంచి చేయాలని రాజకీయాల్లోకి వెళ్లాను కానీ అక్కడ వాతావరణాన్ని తట్టుకోలేక వెనక్కి వచ్చేశానన్నారు. నిజంగా చిరంజీవిలో రాజకీయ వైరాగ్యం కలిగింది అంటే అది వర్తమానంలో చోటు చేసుకున్న పరిస్థితులను చూసే అని భావించాలి. గతానికి భిన్నంగా వ్యక్తిగత దాడులు చేస్తున్నారు. కుటుంబాలను వీధుల్లోకి లాగుతున్నారు

ఎక్కడ లేని వివాదాలను తెర పైకి తెస్తున్నారు. విలువలు లేకుండా పోయాయి. ఎవరైనా సిద్ధాంతాల గురించి మాట్లాడటం మానేశారు. ఇది ఒక్క చిరంజీవికే కాదు రాజకీయాల పట్ల ఆసక్తిని పెంచుకుని వెళ్ళిన వివిధ వర్గాల వారికి కూడా ఎదురవుతున్న అనుభవం. వివిధ రంగాలను పక్కన పెడితే సినిమా వారు చాలా సున్నితంగా ఉంటారు. వారు అలాగే ఆలోచిస్తారు అందుకే వారు రాజకీయాల్లో ఎక్కువ కాలం ఉండలేకపోతున్నారు.

రాజకీయం అనే చదరంగం వెండితెర తారలకు ఇబ్బందికరం అని చాలా సందర్భాలలో రుజువు అయింది. చిరంజీవి రాజకీయ అనుభవాలు ఇతరులకు కూడా గుణపాఠాలు అనే అంటున్నారు. రాజకీయాల్లో తట్టుకుని నిలబడడం సినీ హీరోలకు కష్టతరమే. అందుకే ఒక్క ఎన్టీయార్ తప్ప ఆ తరువాత నుంచి ఈ రోజు వరకూ ఎవరూ రాజకీయంగా రాణించలేకపోయారు. ఎన్టీయార్ కాలంలో ఇంతలా ఉండేది కాదు కాబట్టే ఆయన మన గలిగారు.

ఇపుడు కూడా సినీ రంగం నుంచి వచ్చి రాజకీయంగా అద్భుతాలు సృష్టించే వారు ఎవరూ లేరు. ఆ సామర్థ్యం సత్తా ఉన్న ఏకైక నటుడు మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. ఆయనే రాజకీయాలకు దండం పెట్టేశాక ఆయన కంటే గొప్ప వారు కూడా ఎవరూ లేరు రారు కూడా. ఇది కేవలం తెలుగు సినీ పరిశ్రమకు మాత్రమే కాదు ఇతర సినీ పరిశ్రమలకూ వర్తిస్తుంది. మెగాస్టార్ రాజకీయ వైరాగ్యం చాలా మందికి స్పూర్తి దాయకం అవుతుంది అని అంటున్నారు. రాజకీయాల్లోకి వచ్చి ఏదో చేయాలనుకుంటున్న వారికి కూడా ఒక మంచి అనుభవంగా ఉంటుందని అంటున్నారు.

దీనికి ఒక్క రాజకీయ నేతలనే తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా బాగా మారిపోయారు వారిలో కోరికలు కూడా వేగంగా మారుతున్నాయి. ఓపిక తగ్గుతోంది. అందుకే మేలు ఎవరు చేసినా వారిని గుర్తుంచుకోవడం లేదు. అలాగే ఎంత పెద్ద నేతలను అయినా పక్కన పెట్టేస్తున్నారు. ఇదీ వర్తమాన రాజకీయ భారతం. అందుకే అందులో అంతా అభిమన్యులే అవుతున్నారు.