Begin typing your search above and press return to search.

కొడాలి పకోడీ వ్యాఖ్యల పై చిరు ఫ్యాన్స్ ఫైర్!

ఈ సందర్భంగా... చిరంజీవిపై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అభిమానులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు

By:  Tupaki Desk   |   9 Aug 2023 10:21 AM GMT
కొడాలి పకోడీ వ్యాఖ్యల పై చిరు ఫ్యాన్స్  ఫైర్!
X

ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు చిరంజీవిపై ఫైరయ్యారు. అదే సమయంలో చిరంజీవిపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై ఆయన అభిమానులు కూడా మండిపడుతున్నారు.

అవును... సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పకోడీగాళ్లు అంటూ ఏపీ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో... కృష్ణా జిల్లా గుడివాడలో అగ్ర కథానాయకుడు చిరంజీవి అభిమానులు ఆందోళనకు దిగారు. "జై చిరంజీవ.. కొడాలి నాని డౌన్‌ డౌన్‌ " అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా... చిరంజీవిపై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అభిమానులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. చిరంజీవికి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అయితే ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో చిరు అభిమానులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.

దీంతో... చిరంజీవి యువత అధ్యక్షుడు, పలువురు అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో అరెస్టు చేసినవారిని తరలిస్తున్న పోలీసు వాహనాలకు అడ్డంగా చిరంజీవి అభిమానులు పడుకుని నిరసన తెలిపారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

ఇదే సమయంలో విజయవాడ మెయిన్‌ రోడ్డుపై చిరంజీవి అభిమానులు బైఠాయించారు. వంగవీటి మోహనరంగా విగ్రహానికి క్షీరాభిషేకాలు చేశారు. ఈ ఆందోళనల్లో జనసేన కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. చిరుకు అనుకూలంగా.. కొడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కాగా... ఏపీ ప్రభుత్వం పై చిరంజీవి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని మచిలీపట్నంలో స్పందించారు. ఈ సందర్భంగా కాస్త ఘాటుగానే స్పందించారు.

ఇందులో భాగంగా... "సినిమా పరిశ్రమలోని పకోడిగాళ్లు ప్రభుత్వం ఎలా ఉండాలో సలహాలు ఇస్తున్నారు" అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఎలా ఉండాలనే సలహాలు ఇస్తున్నవారు.. నటులు పరిశ్రమకే సేవలందిస్తూ సినిమాలు, ఫైట్స్‌, డ్యాన్స్‌, యాక్షన్ చేసుకోవాలంటూ వారికి కూడా సలహా ఇస్తే మేలని అన్నారు.