Begin typing your search above and press return to search.

ఏపీ పాలిటిక్స్ లో చిరంజీవి ఫ్యాక్టర్ ఎంత...?

చిరంజీవి వివాదాల జోలికి పోరు అని పేరు. ఆయన ప్రజారాజ్యం పార్టీని పెట్టి జనంలోకి వచ్చాక కూడా మీడియా ముందు ఆచీ తూచీ మాట్లాడేవారు

By:  Tupaki Desk   |   9 Aug 2023 6:47 PM IST
ఏపీ పాలిటిక్స్ లో చిరంజీవి ఫ్యాక్టర్ ఎంత...?
X

మెగాస్టార్ చిరంజీవి వివాదాల జోలికి పోరు అని పేరు. ఆయన ప్రజారాజ్యం పార్టీని పెట్టి జనంలోకి వచ్చాక కూడా మీడియా ముందు ఆచీ తూచీ మాట్లాడేవారు. ప్రత్యర్ధి పక్షంగా ఉన్న కాంగ్రెస్ తెలుగుదేశం నాయకులు ఆనాడు చిరంజీవి మీద విమర్శలు చేసినా ఆయన సున్నితంగానే వాటిని తిప్పికొట్టేవారు. తానుగా విమర్శలు చేసి ఎరగడం అన్నది చిరంజీవి విషయంలో అసలు లేదు.

అలాంటి చిరంజీవి వైసీపీ ప్రభుత్వం మీద ఉన్నట్లుండి ఎందుకు హాట్ కామెంట్స్ చేసారు అన్నది ఇపుడు చర్చకు వస్తుంది. ఆయన బోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక డైలాగ్ చెబుతారు. తన మనసుకు నచ్చినదే చేస్తాను అని. ఆ విధంగా చూస్తే చిరంజీవి మనసుకు నచ్చితేనే మాట్లాడుతారు తప్ప ఎవరూ ఆయన్ని ప్రభావితం చేయలేరు. ఇక ఆయన వైసీపీ పాలనను పలు సందర్భాలలో మెచ్చుకున్నారు. మూడు రాజధానులకు ఓపెన్ గా మద్దతు ఇచ్చారు. విశాఖ రాజధానిగా ది బెస్ట్ ప్లేస్ అని కితాబు ఇచ్చారు.

జగన్ని తన తమ్ముడు అన్నారు, యంగ్ అండ్ డైనమిక్ అని కొనియాడారు. జగన్ తో ఏడాది క్రితమే భీమవరంలో జరిగిన అల్లూరి 125వ జయంతి వేడుకలలో వేదిక పంచుకున్నారు ఇక రెండు మూడు సార్లు జగన్ ఇంటికి వెళ్లారు. సినీ పెద్దలను వెంటబెట్టుకుని చర్చలు జరిపారు. ఒక విధంగా చూస్తే చిరంజీవి జగన్ ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని అంతా అంటారు.

అలాంటిది ఇపుడు సడెన్ గా ఆయన ప్రభుత్వం మీద హాట్ కామెంట్స్ చేశారు అంటే అది లైట్ గా తీసుకోవడానికి లేదు అని అంటున్నారు. చిరంజీవి ఆవేశపరుడు అయితే కాదు, ఆయన ఆలోచనాపరుడు. , ఆయన అన్నీ ఆలోచించే ఈ కామెంట్స్ చేసి ఉంటారని అంటున్నారు. ఇక తన సినిమా బోళా శంకర్ రిలీజ్ ముందు పెట్టుకుని మరీ ఏపీ సర్కార్ మీద ఆయన విమర్శనా బాణాలు వేసారు అనుకుంటే దాని అర్ధాలు పరమార్ధాలు ఏంటి అన్న చర్చ జరుగుతోంది.

ప్రభుత్వం విషయంలో మెగాస్టార్ గట్టిగానే నిలబడాలని నిర్ణయించుకున్నారా అన్న చర్చ వస్తోంది. ఇక చిరంజీవి విషయంలో ఒకటి ఉందని అంటున్నారు. ఆయన రాజకీయాల్లో సక్సెస్ కాలేదని అంతా అంటారు. ఆయనకు ఆ వెలితి ఉండి ఉండాలి. అందువల్ల సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చినట్లుగా పాలిటిక్స్ లో కూడా రీ ఎంట్రీ ఇస్తున్నారా అన్న చర్చ అయితే వస్తోంది.

ఏపీలో పరిస్థితులు ఇపుడు మూడవ పార్టీ ఎదిగేందుకు అనుకూలంగా ఉన్నాయని చిరంజీవి భావిస్తున్నారా జనసేనకు ఏపీలో మంచి అవకాశాలు ఉన్నాయని అంచనా కడుతున్నారా అన్నది కూడా చూడాల్సి ఉంది. ఇక చిరంజీవి సినిమాల విషయం తీసుకుంటే రీ ఎంట్రీ తరువాత బ్రహ్మాండమైన హిట్లు అంటే ఒకటి ఖైదీ నంబర్ 150 అలాగే రెండు ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్యలను చెప్పుకోవాలని అంటున్నారు

ఇక ఆయన మరిన్ని సినిమాలను కూడా చకచకా చేస్తున్నారు కానీ ఏడు పదుల వయసు చేరువలో ఉన్న చిరులో మళ్ళీ రాజకీయ ఆరాటం మొదలైందా అన్న చర్చ సాగుతోంది. చిరంజీవి ఏపీ పాలిటిక్స్ లో ఎంట్రీ ఇస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుంది చిరంజీవి ఫ్యాక్టర్ ఎంతవరకూ ఉంది అన్నది కూడా చర్చకు వస్తున్న విషయం.

ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడే చిరంజీవికి పీక్స్ లో అభిమానం పండింది. అది డెబ్బై లక్షల ఓట్లుగా 18 సీట్లుగా మారింది. అపుడు కూడా పవన్ చిరంజీవి కలసే పాలిటిక్స్ చేశారు. ఇపుడు పవన్ కళ్యాణ్ జనసేనకు మద్దతుగా చిరంజీవి బరిలోకి దిగితే ఏపీ రాజకీయం ఏ విధంగా మారుతుంది అన్నది కూడా చూడాల్సి ఉంది.

అయితే టీడీపీతో పొత్తు పెట్టుకుని జనసేన రంగంలోకి దిగితే ఈ కూటమికి చిరంజీవి ప్రచారం గట్టిగా చేస్తే కనుక కచ్చితంగా అది సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు. అలా కాకుండా జనసేన ఒంటరిగా పోటీ చేసి దానికి మెగాస్టార్ డైరెక్ట్ గా రంగంలోకి దిగి మద్దతు ప్రచారం చేస్తే వైసీపీ అధికారంలోకి మళ్లీ రావడం ఖాయమని అంటున్నారు.

ఇక చిరంజీవికి సినిమాపరంగా అందరివాడు అన్న పేరు ఉంది. రాజకీయాల్లో ఆయన వచ్చి ప్రచారం చేస్తే ఆ ఫ్యాక్టర్ ఎంతవరకూ ఉంటుంది అన్నది చూస్తే కనుక కొంత ఆలోచించాల్సిందే అని అంటున్నారు. మెగా ఫ్యాన్స్ ఎటూ జనసేన వైపు ఉంటారు. న్యూట్రల్ సెక్షన్స్ ని మెగాస్టార్ జనసేన వైపు తిప్పగలరా అనంది చూడాల్సి ఉంది అని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ మాత్రం మెగా ఫ్యామిలీ ఫ్యాక్టర్ తో ఇబ్బంది లేదన్నట్లుగానే ముందుకు సాగుతోంది. అదే సమయంలో టీడీపీ మాత్రం 2009 ప్రజారాజ్యం ఎంట్రీ తరువాత తమకు ఎదురైన చేదు ఫలితాలు, 2019లో జనసేన చేసిన నష్టం నేపధ్యంలో ఆచీ తూచీ రియాక్ట్ అవుతోంది.