జనసేనానికి మెగా అండ దండా...?
భద్రాచలం కొండా సీతమ్మ వారి దండ కావాలా నీకండ దండా అని మెగాస్టార్ చిరంజీవి గ్యాంగ్ లీడర్ లో హీరోయిన్ తో కలసి పాడతారు.
By: Tupaki Desk | 3 Sept 2023 9:49 AM ISTభద్రాచలం కొండా సీతమ్మ వారి దండ కావాలా నీకండ దండా అని మెగాస్టార్ చిరంజీవి గ్యాంగ్ లీడర్ లో హీరోయిన్ తో కలసి పాడతారు. అలాంటి మెగాస్టార్ అండా దండా కావాలి అని ఎవరు కోరుకోరు. అందునా ఆయన అనుంగు తమ్ముడికి అన్న గారి నిండు ఆశీర్వాదం ఎపుడూ ఉంటుంది. అలా తమ్ముడి పుట్టిన రోజున అన్న గారు నిండైన దీవెనలు అందించారు.
అంతే కాదు జనసేనానిని కాస్తా జన హృదయ సేనాని అనేశారు. అంటే ఇక కోట్లాది మంది ఏపీ జనల గుండెలలో తమ్ముడికి సుస్థిర స్థానం దక్కింది అని మెగాస్టార్ అంటున్నారు. అలాగే ఒక పెద్దగా కుటుంబ పెద్దగా అన్నగా తమ్ముడి సంకల్పం నెరవేరాలని మసనా వాచా గట్టిగా కోరుకున్నారు
ఇంకేముంది పవన్ కళ్యాణ్ కి పుట్టిన రోజు వేళ అతి పెద్ద గిఫ్ట్ అంటే ఇదే కదా అని జనసేన నాయకులు కార్యకర్తలు సంబరపడుతున్నారు. నిజం చెప్పాలీ అంటే అన్న మనసులో తమ్ముడికి ఎంతో విలువైన స్థానం ఉంది. అది ఎప్పటికపుడు బయటపడుతూనే ఉంది. కానీ మరి కొద్ది నెలలలో ఏపీలో ఎన్నికలు జరుగుతున వేళ దానికి ముందు వచ్చిన పుట్టిన రోజున అన్న గారు తధాస్తూ అని తమ్ముడి మనసెరిగి ఇచ్చిన దీవెనలు నిజంగా గొప్ప వరంగా భావించాల్సిందే.
ఇక ఇటీవల కాలంలో మెగాస్టార్ తన మనసును ఎక్కడా దాచుకోవడంలేదు. జనసేన విషయంలో ఆయన పూర్తి ఆశాభావంతో ఉన్నారు. అంతకంటే తమ్ముడి నాయకత్వ లక్షణాల మీద ఇంకా ధీమాగా ఉన్నారు. అందుకే తమ్ముడు గెలవాలని పూర్తి స్థాయిలో కోరుకుంటున్నారు.
ఎన్నికల వేళ మెగాస్టార్ నేరుగా తమ్ముడి కోసం ఎన్నికల ప్రచారంలోకి దిగుతారా లేక మద్దతు మీడియా ముఖంగా ఇస్తారా లేక మెగా కాంపౌండ్ లోని సమస్త పరివారాన్ని తమ్ముడికి అండగా దింపుతారా అన్నది తెలియదు కానీ మెగాస్టర్ మనసు మాత్రం తమ్ముడిని ఉన్నత స్థానంలో చూడాలని ఆరాటపడుతోంది.
అన్నదమ్ములు ఇద్దరు అత్యంత శక్తిమంతులు. ఈ ఇద్దరూ ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే అది ఫ్యాన్స్ కి పండుగే. ఇక రాజకీయ తెర మీద ఈ ఇద్దరూ ఒకే గొంతు వినిపిస్తే అది జనసేనకు విజయ నినాదమే అవుతుంది అన్న వారూ ఉన్నారు. ఏది ఏమైనా మెగా సపోర్టు మాకే అని ఇన్నాళ్ళూ జనసేన నేతలు క్యాడర్ చెప్పుకునేవారు. అది నూరు శాతం నిజమనిపించేలా మెగాస్టార్ మాటలు ఇస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఏపీలో జరిగే ఎన్నికల కురుక్షేత్రంలో అస్త్రశస్త్రాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇక జనసేన నాయకులు క్యాడర్ సీఎం గా పవన్ని చూడాలని అనుకుంటున్నారు. అన్న గారి కోరిక అదే అని వెల్లడి అవుతోంది. ఇక దీని మీద సేనాని మాత్రమే సమర శంఖాన్ని పూరించాల్సిన అవసరం అయితే ఉంది మరి. ఆ దిశగా పవన్ అడుగులు వేస్తే ఆయనకు కావాల్సినంత అండ దండా కచ్చితంగా మెగా స్థాయిలోనే దక్కవచ్చు అన్నది తెలుస్తున్న నిజం అంటున్నారు.
