ఇంటికోసం 'జీహెచ్ఎంసీ'పై 'చిరు' పోరాటం
చిరంజీవి తరఫు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపిస్తూ చిరంజీవి ఇప్పటికే 2002లో GHMC అనుమతితో G+2 అంతస్తుల ఇంటిని నిర్మించారని తెలిపారు.
By: Tupaki Desk | 15 July 2025 2:35 PM ISTహైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో తన ఇంటి పునరుద్ధరణకు సంబంధించి చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని సినీనటుడు చిరంజీవి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని హైకోర్టు, చిరంజీవి దరఖాస్తును నాలుగు వారాల్లోగా చట్టపరంగా పరిష్కరించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)ని ఆదేశించింది.
దరఖాస్తును పట్టించుకోని జీహెచ్‌ఎంసీపై అసంతృప్తి
చిరంజీవి తరఫు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపిస్తూ చిరంజీవి ఇప్పటికే 2002లో GHMC అనుమతితో G+2 అంతస్తుల ఇంటిని నిర్మించారని తెలిపారు. అయితే ఇంటి పునరుద్ధరణలో భాగంగా రిటైన్‌వాల్ వంటి నిర్మాణాల కోసం జూన్ 5న అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, అధికారులు ఇప్పటి వరకు స్పందించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. అనుమతి తీసుకునే సమయంలోనే క్రమబద్ధీకరణ నిబంధనలకు లోబడి పని చేస్తున్నామని, అయినా GHMC ఎటువంటి చర్యలూ తీసుకోలేదని వివరించారు.
జీహెచ్‌ఎంసీ సమాధానం
దీనిపై GHMC తరఫు న్యాయవాది స్పందిస్తూ చిరంజీవి దరఖాస్తును చట్టపరమైన ప్రక్రియల ప్రకారం పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, చిరంజీవి దరఖాస్తును చట్టప్రకారం పరిశీలించి నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని GHMCని స్పష్టంగా ఆదేశించారు.
వాదనలు పూర్తైన నేపథ్యంలో న్యాయమూర్తి పిటిషన్‌పై విచారణను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం నేపథ్యంలో చిరంజీవి దరఖాస్తుపై GHMC ఇకపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా చిరంజీవి తీసుకున్న ఈ న్యాయపరమైన పోరాటం పలువురికి ప్రేరణగా నిలుస్తుందని చెప్పవచ్చు.
