Begin typing your search above and press return to search.

సిగ్గు అంటూ నితీష్ సర్కార్ మీద కేంద్ర మంత్రి ఫైర్

దివంగత నేత కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు లోక్ జనశక్తి పార్టీ చీఫ్ కేంద్ర మంత్రి అయిన చిరాగ్ పాశ్వాన్ అయితే బాహాటంగానే నితీష్ కుమార్ సర్కార్ ని వ్యతిరేకిస్తున్నారు.

By:  Tupaki Desk   |   27 July 2025 4:00 AM IST
సిగ్గు అంటూ నితీష్ సర్కార్ మీద కేంద్ర మంత్రి ఫైర్
X

బీహార్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈసారి ఎన్డీయే కూటమికి అంత బాగా రాజకీయం లేనట్లుగా ఉంది. మరోసారి ఏదో విధంగా మ్యాజిక్ చేసి బీహార్ సీఎం చెయిర్ ని పట్టాలని బీజేపీ చూస్తోంది. మిత్రపక్షం అయిన జేడీయూకి ఎక్కడ లేని విలువను ఇస్తోంది. అయితే అదే ఎన్డీయే కూటమిలో ఉన్న లోక్ జనశక్తి పార్టీ మాత్రం నితీష్ కుమార్ సర్కార్ మీద ప్రత్యర్ధుల కంటే ఎక్కువగా విరుచుకుపడుతోంది.

నితీష్ మీద చిరాగ్ చికాకు :

దివంగత నేత కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు లోక్ జనశక్తి పార్టీ చీఫ్ కేంద్ర మంత్రి అయిన చిరాగ్ పాశ్వాన్ అయితే బాహాటంగానే నితీష్ కుమార్ సర్కార్ ని వ్యతిరేకిస్తున్నారు. ఈ సర్కార్ కి మద్దతు ఇచ్చినందుకు సిగ్గుపడుతున్నాను అని ఘాటు వ్యాఖ్యలే చేశారు. రాష్ట్రంలో నేరాలు పెరిగాయని లా అండ్ ఆర్డర్ దెబ్బ తిందని విమర్శలు గుప్పించారు. నితీష్ ప్రభుత్వం అన్ని రంగాలలో ఫెయిల్ అయిందని ఎన్డీయేకి చెందిన కేంద్ర మంత్రి చెప్పేసి షాక్ ఇచ్చారు.

ఒంటరి పోరుకు రెడీ :

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలకు లోక్ జనశక్తి పార్టీ పోటీ చేస్తుందని చిరాగ్ పాశ్వాన్ ప్రకటించారు. తమ మాదిరిగా జేడీయూకు పోటీ చేసే సత్తా ఉందా అని ఆయన నితీష్ కుమార్ ని ప్రశ్నించారు. ప్రభుత్వమే నేరస్థులతో కుమ్మకు అయి అధ్వాన్న పాలన చేస్తోందని నితీష్ కుమార్ వైఖరి వల్ల బీహార్ లో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని ఆయన దుయ్యబెట్టారు.

అసమర్ధ ప్రభుత్వం :

బీహార్ లో నడుస్తోంది అసమర్థ ప్రభుత్వం అని నితీష్ కుమార్ సర్కార్ ని ఏకి పారేశారు. నేరాలు పెరిగిపోవడానికి కారణం నేరస్తులతో నితీష్ సర్కార్ కుమ్మక్కు కావడమే అని అన్నారు. రాష్ట్రంలో ఒక్క లెక్కన హత్యలు దోపిడీలు తీవ్రమైన నేరాలు పెరిగిపోయాయని ఆయన అన్నారు. కిడ్నాపులు అత్యాచారాలు పెరిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలకు ఏదీ రక్షణ :

ఇక చిరాగ్ పాశ్వాన్ సూటిగానే నితీష్ కుమార్ ని ప్రశ్నించారు. మీ ప్రభుత్వంలో సామాన్య ప్రజలకు ఏదీ రక్షణ అని నిలదీశారు ప్రజలను కాపాడలేని దుస్థితిలో పాలన సాగుతోందని అన్నారు. ఇటువంటి ప్రభుత్వానికి మద్దతుగా నిలవడం బాధగా సిగ్గుగా ఉందని ఆయన అన్నారు.

ఎన్డీయేకి బీటలు :

నితీష్ కుమార్ ప్రభుత్వం మీద మిత్రపక్షం ద్వజమెత్తాక విపక్షాలకు అది ఆయుధంగా మారుతోంది. మరో వైపు చూస్తే చిరాగ్ పాశ్వాన్ ఒంటరి పోరుకు సిద్ధపడుతున్నారు. కొన్ని సెగ్మెంట్లలో లోక్ జనశక్తి పార్టీకి బలం ఉంది. ఆ పార్టీ కనుక సింగిల్ గా పోటీకి దిగితే ఎన్డీయే కూటమికి బీటలు వారడం ఖాయమని అంటున్నారు. మొత్తం మీద చూస్తే బీజేపీ ఆశలు బీహార్ లో ఆవిరి చేసేలా చిరాగ్ పాశ్వాన్ వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు తమకు అరడజన్ సీట్లను పొత్తులో భాగంగా కట్టబెట్టడం మీద చిరాగ్ పాశ్వాన్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు.