ఉత్తరాంధ్రకు మరో కీలక పదవి.. లోకేశ్ కోటాలో అయ్యన్న కుమారుడికి ఛాన్స్!
శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు, ఐటీడీపీ కన్వీనర్ చింతకాయల విజయ్ కి పదవీయోగం పట్టనుందనే ప్రచారం ఊపందుకుంది.
By: Tupaki Desk | 9 April 2026 6:00 PM ISTశాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు, ఐటీడీపీ కన్వీనర్ చింతకాయల విజయ్ కి పదవీయోగం పట్టనుందనే ప్రచారం ఊపందుకుంది. టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేశ్ కు అత్యంత సన్నిహితుడైన విజయ్ ని త్వరలో జరిగే ఎన్నికలలో పెద్ద సభ అయిన రాజ్యసభకు పంపాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. 2029 ఎన్నికల నాటికి ‘లోకేశ్ జట్టు’ రెడీ చేయాలని అధినేత చంద్రబాబు భావిస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా పార్టీలో నాలుగు దశాబ్దాలకు పైగా నమ్మకంగా కొనసాగుతున్న అయ్యన్నపాత్రుడి కుటుంబానికి అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్లు చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల తర్వాత రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు భావిస్తున్నారు. నిజానికి గత ఎన్నికల్లోనూ ఆయన తప్పుకుని కుమారుడికి అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్టానాన్ని కోరినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే 2024 ఎన్నికల్లో ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా అయ్యన్నపాత్రుడి వినతిని ముఖ్యమంత్రి చంద్రబాబు తిరస్కరించారు. ఇదే సమయంలో అనకాపల్లి లోక్ సభ అభ్యర్థిగా అయ్యన్నపాత్రుడి కుమారుడు విజయ్ కి అవకాశం ఇస్తామని ప్రతిపాదించారు. అయితే కూటమిలో బీజేపీ చేరిన తర్వాత సమీకరణాలు మారడంతో విజయ్ కి అవకాశం ఇవ్వలేకపోయారు.
ఇక అంతకుముందు కూడా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏదైనా అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గం నుంచి అవకాశం కోసం విజయ్ ప్రయత్నించారు. కానీ ఇప్పటివరకు ఆయన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. దాదాపు 12 ఏళ్లకు పైగా రాజకీయంగా క్రియాశీలంగా ఉంటున్న విజయ్ చట్టసభల్లో అడుగుపెట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కుమారుడిని ఎమ్మెల్యే లేదా ఎంపీగా చూడాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా ఆశగా ఎదురుచూస్తున్నట్లు చెబుతున్నారు.
అయితే అనుకోకుండా టీడీపీ అధిష్టానం విజయ్ ని రాజ్యసభకు పంపాలని నిర్ణయం తీసుకుందని అంటున్నారు. అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఈ ప్రతిపాదనపై టీడీపీలో విస్తృత చర్చ జరుగుతోంది. అధినేత చంద్రబాబు, మంత్రి లోకేశ్ అన్నివిధాల పరిశీలించిన తర్వాతే చింతకాయల విజయ్ పేరును రాజ్యసభకు ఖరారు చేశారని అంటున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యం, బీసీ సామాజిక వర్గం, యువత, విద్యాధికుడు, పార్టీకి నమ్మకమైన నాయకుడు ఇలా ఏ కోణంలో చూసినా విజయ్ కి అన్ని అనుకూలంగానే ఉన్నాయని, దీంతో ఆయన అభ్యర్థిత్వంపై రెండో ఆలోచన పెట్టుకోవద్దని టీడీపీ అధిష్టానం ఫిక్స్ అయినట్లు చెబుతున్నారు.
