Begin typing your search above and press return to search.

క‌ర్నూలు విషాదం: ఒక్క‌డి కోసం ఆలోచించి... 19 మంది ప్రాణాలు హ‌రించి!

By:  Tupaki Desk   |   26 Oct 2025 6:00 AM IST
క‌ర్నూలు విషాదం: ఒక్క‌డి కోసం ఆలోచించి... 19 మంది ప్రాణాలు హ‌రించి!
X

స్నేహం మంచిదే. కానీ, స‌మ‌యం సంద‌ర్భం కూడా ముఖ్య‌మే. ఈ విష‌యాన్ని మ‌రిచిపోయిన నేప‌థ్యంలో నే క‌ర్నూలు జిల్లా చిన్న‌టేకూరి వ‌ద్ద ఘోరం జ‌రిగింది. 19 మంది ప్రాణాలు హ‌రించేలా చేసింది. ఈ విష‌యాన్ని క‌ర్నూలు జిల్లా పోలీసులు స్ప‌ష్టం చేశారు. శుక్ర‌వారం తెల్ల‌వారు జామున జ‌రిగిన ఘోర ప్ర‌మాదంలో వేమూరి కావేరీ ప్రైవేటు ట్రావెల్స్ బ‌స్సు.. అగ్నికి ఆహుతై.. 19 మందిని మాంస‌పు ముద్ద‌లుగా మిగిల్చింది. బ‌స్సు ఫిట్‌నెస్‌.. ఇన్సూరెన్స్‌.. అనుమ‌తులు ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. ఈఘ‌ట‌న‌కు అస‌లు కార‌ణాన్ని తాజాగా పోలీసులు వెల్ల‌డించారు.

ఏం జ‌రిగింది?

క‌ర్నూలు జిల్లా తుగ్గిలి మండ‌లానికి చెందిన శివ‌శంక‌ర్‌(22-24 ఏళ్ల వ‌య‌సు).. మార్బుల్ ప‌నిచేస్తాడు. శుక్ర‌వారం ఉద‌యం డోన్‌లోని తుగ్గిలిలో ప‌ని ఉంద‌ని.. ఉద‌యం 8 గంట‌ల‌క‌ల్లా ప‌నిలోకి దిగాల‌ని మేస్త్రి నుంచి ఫోన్‌రావ‌డంతో అర్ధ‌రాత్రి 12 గంట‌ల స‌మ‌యంలో ల‌క్ష్మీపురం నుంచి మ‌రో స్నేహితుడు.. ఎర్రి స్వామితో క‌లిసి ప‌ల్స‌ర్ బైకుపై బ‌య‌లు దేరారు. ఇంటి నుంచి బ‌య‌లు దేరేప్పుడు బాగానే ఉన్నారు. కానీ, మార్గ మ‌ధ్యంలో వారు ఏదో తీసుకున్నారు(ఏంట‌నేది తేలాల్సి ఉంద‌ని పోలీసులు చెప్పారు). ఇక‌, కొంత దూరం రాగానే పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకున్నారు. (దీనికి సంబంధించిన వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది.)

పెట్రోల్ బంకులో ఉన్న స‌మ‌యంలోనే శివ‌శంక‌ర్ ర్యాష్‌గా వాహ‌నాన్ని న‌డిపిన దృశ్యాలు.. బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో ఇద్ద‌రూ తుగ్గిలికి వెళ్తుండ‌గా.. బ‌స్సు ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతంలో బైకు స్కిడ్ అయింది. దీంతో ఎర్రిసామి, శివ‌శంక‌ర్ ఇద్ద‌రూ చెరో ప‌క్కా ప‌డిపోయారు. బైక్ రోడ్డు మ‌ధ్య‌లో అలానే ఉండిపోయింది. ఈ స‌మ‌యంలో డివైడ‌ర్‌ను గుద్దుకుని అలానే అచేత‌న స్థితిలో ఉండిపోయిన త‌న మిత్రుడు.. శివ‌శంక‌ర్‌ను లేపి.. నీళ్లు ప‌ట్టించేందుకు ఎర్రి స్వామి ప్ర‌య‌త్నించాడు.

ఇదే ఎర్రిస్వామి చేసిన ప్ర‌ధాన త‌ప్పు అని పోలీసులు తెలిపారు. ఎందుకంటే... చిన్న‌టేకూరు రోడ్డు జాతీయ ర‌హ‌దారి కావ‌డంతో ప్ర‌తి నిముషానికీ ఒక వాహ‌నం ఆ రోడ్డుపై ప్ర‌యాణిస్తుంది. ఈ క్ర‌మంలో ముందుగా రోడ్డుపై అడ్డంగా ప‌డిఉన్న బైక్‌ను ప‌క్క‌కు లాగేసి ఉంటే.. ఇంత పెద్ద ప్ర‌మాదం జ‌రిగి ఉండేది కాద‌న్నారు.కానీ, ఎర్రిస్వామి త‌న స్నేహితుడి కోసం.. ప్ర‌య‌త్నించాడ‌ని.. అనంత‌రం.. బైక్‌ను తీసేందుకు.. లేచిన క్ష‌ణంలోనే కావేరీ బ‌స్సు ర‌య్య‌న దూసుకువ‌చ్చి.. బైకున్ రాసుకుంటూ.. ముందుకు సాగిపోయింద‌ని.. ఇదే పెను విషాదాన్ని మిగిల్చింద‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రింత లోతుగా ద‌ర్యాప్తు చేస్తున్నామ‌న్నారు. ఇద్ద‌రు యువ‌కులు మార్బుల్ ప‌నిచేస్తార‌ని చెప్పారు.