ఇలా ప్రాణాలు పోవాల్సిందేనా ?
జనాలది ఉత్సాహం. పాలకులది నిర్లక్ష్యం వెరసి బలి అవుతోంది నిండు ప్రాణం. ఎవరు కనిపెట్టారో కానీ ప్రాణాలకు విలువ.
By: Tupaki Desk | 5 Jun 2025 9:16 AM ISTజనాలది ఉత్సాహం. పాలకులది నిర్లక్ష్యం వెరసి బలి అవుతోంది నిండు ప్రాణం. ఎవరు కనిపెట్టారో కానీ ప్రాణాలకు విలువ. వెల కట్టి మరీ విదిలించే నష్ట పరిహారం. ఒక మనిషి ప్రాణం ఖరీదు పైసలతో సరా అన్నది తలచుకుంటేనే గుండె బరువు ఎక్కుతుంది.
తప్పులు అలా జరుగుతూనే ఉంటాయి. గుణపాఠాలు ఎవరూ నేర్చుకోరు. అటు జనాలూ నిర్పూచీగా ఉంటారు. . ఇ ఏలికలు కూడా షరా మామూలే అన్న వైఖరితో ఉంటారు. ఇక సారీలు క్షమాపణలు గుండె బరువెక్కింది అంటూ నాయకులు కొట్టే భారీ డైలాగులు ఇవన్నీ రొటీన్.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన విషాదానికి బాధ్యులు ఎవరు ఈ పాపం ఎవరిది అన్న నిలువెత్తు ప్రశ్నకు బహుశా జవాబు ఎప్పటికీ దొరకదేమో. ఈ లోగా మరో ప్రమాదం జరిగి పాత వాటిని మరచిపోవడమే అంతా చేసేది.
క్రీడాభిమానం ఉండడం తప్పు కాదు, కానీ వేలం వెర్రిగా జనాలు రావడం మాత్రం తప్పు. అయితే వారిని ఎవరు కట్టడి చేస్తారు ఎవరు చెబుతారు అంటే ఏలిన వరే. మరి వారు చూస్తూ వదిలేస్తే బాధ్యత ఎవరు తీసుకోవాలి. నిజమే కట్ట తెచ్చుకుని గట్టు దాటుకుని ప్రవహించే నదిని కట్టడి చేయడం ఎవరి వల్లా కాదు, అలాగే జనాలను సైతం ఒక దశ వరకే ఎవరైనా ఆపగలరు. అంతకు మించి ఏమీ చేయలేరు. మరి పోలీసులు కానీ ఇతర వర్గాలు కానీ ముందుగా ఎందుకు వారించలేదు అనేది ప్రశ్న.
అంటే ఎవరి ఖర్మన వారు పోతారన్న ఉదాశీన భావమా అంటే అలగే అనుకోవాల్సి వస్తోంది. దాదాపుగా 18 ఏళ్ళ తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీకి దక్కిన అద్భుత విజయం. దాని తాలూకా పవర్ ఏమిటో ఒక రోజు రాత్రి అంతా చిన్నా పెద్దా తేడా లేకుండా చేసుకున్న సంబరాలను చూసిన తరువాత అయినా అది జన సునామీగా మారుతుందని అర్ధం కాకపోతే ఇక వ్యవస్థలు ఎందుకు అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
పాపం చిన్న పిల్లలు టీనేజ్ లేడీస్, యువత కుర్రకారు నడి వయసు వారు ఇలా వివిధ వర్గాల వారు అంతా ఈ తొక్కిసలాటలో చిక్కుకుపోయారు ఏకంగా పదకొండు మంది వరకూ అక్కడే మరణించారు. మరో యాభై మంది దాకా ఆసుపత్రిలో సీరియస్ కండిషన్ లో ఉన్నారు.
వారిని చూసినా వీరిని చూసినా ఏమిటీ అన్యాయం అనిపించకమానదు. విజయోత్సాహంతో విషాదం జరిగిపోయింది అని పెద్దలు అనవచ్చు. బాధ పడవచ్చు. కన్నీరు కార్చవచ్చు. కానీ పోయిన ప్రాణాలను ఎవరూ తీసుకుని రాలేరు కదా అన్నదే అందరి ఆవేదనగా ఉంది.
చూడబోతే అది చిన్నస్వామి స్టేడియమే. అంటే దాని కెపాసిటీ కేవలం 35 వేలు మాత్రమే. కానీ వచ్చిన వారు రెండు లక్షలకు పైగా జనాలు అంటే అయిదారు రెట్లు అన్న మాట. మరి ఇంత పెద్ద ఎత్తున వెల్లువలా జనాలు విరుచుకుపడతారు అన్న అంచనా ఎవరికీ లేకపోవడమే అతి పెద్ద వైఫల్యం కాదా అని సూటిగానే ప్రశ్నిస్తున్నారు అంతా.
ఇక నష్ట పరిహారాలు న్యాయ విచారణలు ముందు ఇలాంటి ఘటనలు జరగనీయమని పడికట్టు మాటలు అంతా వింటూనే ఉన్నారు. మరోసారి వింటారు. ఈ దేశంలో ఏ తొక్కిసలాటలో అయినా ఇదే తీరు. మరి దానిని చూసి నేర్చుకున్న గుణ పాఠం ఏమిటి అన్నదే ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్న.
పాపం వచ్చిన వాళ్ళదే అంటే అంత కంటే పెద్ద తప్పు ఉండదు వ్యవస్థలు ఉన్నాయన్న ధైర్యంతోనే ఎవరైనా రోడ్డు మీదకు వస్తారు. అలా కాదు మీ ప్రాణాలకు మీరే పూచీ బలి అయ్యేది మీరే అని అన్యాపదేశంగా అయినా చెప్పినా అమాయకులు వారి ప్రాణాలను దక్కించుకునేవారు.
కానీ అలా జరగదు కదా. అందుకే ఈ వేదనలు రోదనలు. చివరికి ఈ అకాల మరణాలు, ఈ మృత్యు ఘోషలు దిక్కులు పిక్కటిల్లేలా ఈ ఏడుపులూ...ఎన్ని కన్నీళ్ళు పెట్టినా చితి మంటలు ఆరునా అన్నట్లు ఎంతగా వగచి వాపోయినా ఈ తొక్కిసలాటలో ప్రాణాలు పోయే దుర్నీతికి అంతం ఉంటుందా అన్నదే చర్చ.
