Begin typing your search above and press return to search.

బీజేపీలో చెల్లని చిన్నమ్మ మాట...?

ఇప్పటికి నాలుగు నెలలు అయింది పురంధేశ్వరి మాటలకు కేంద్రం వద్ద ఎంతవరకూ విలువ ఉంది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

By:  Tupaki Desk   |   2 Nov 2023 3:55 AM GMT
బీజేపీలో చెల్లని చిన్నమ్మ మాట...?
X

ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా దగ్గుబాటి పురంధేశ్వరి ఉన్నారు. ఆమెని జూలై నాలుగున నియమిస్తూ కేంద్ర నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికి నాలుగు నెలలు అయింది పురంధేశ్వరి మాటలకు కేంద్రం వద్ద ఎంతవరకూ విలువ ఉంది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఆమె వైసీపీ ప్రభుత్వం మీద గడచిన కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు. మద్యం అవినీతి మీద కేంద్ర దర్యాప్తు సంస్థల చేత విచారణ జరిపించమని కూడా కోరుతూ వస్తున్నారు. ఆమె స్వయంగా కేంద్ర పెద్దలని కలసి ఆధారసహితంగా ఫిర్యాదు చేసినా ఆ తరువాత ఆ ఊసే లేదు. ఇపుడు ఇసుక కుంభకోణం అంటూ చిన్నమ్మ మరో పోరాటానికి తెర లేపారు.

చిన్నమ్మ టీడీపీని అనుకూలం అని పార్టీలో మరో వర్గం దూరంగా ఉంటోంది. ఏపీలో బీజేపీ సీన్ అంతంతమాత్రంగా ఉంటే అది చాలదు అన్నట్లుగా వర్గ పోరు పీక్స్ లో ఉంది. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా జరిగిన ఒక పరిణామం పురంధేశ్వరిని మండించింది అని అంటున్నారు. పొగాకు బోర్డు చైర్మన్ గా ప్రకాశం జిల్లాకు చెందిన బీజేపీ నేత యశ్వంత్ ని నియమిస్తూ కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేయడంతో బీజేపీలో విభేదాలు భగ్గుమన్నాయి.

మూడేళ్ళ క్రితం సోము వీర్రాజు ప్రెసిడెంట్ గా ఉన్న టైం లో యశ్వంత్ బీజేపీలో చేరారు. ఆయన ప్రస్తుతం ఏపీ కిసాన్ సెల్ ప్రధార కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయనకు సోము వీర్రాజు సిఫార్సు మేరకే ఈ కీలకమైన నామినేటెడ్ పదవి దక్కింది అని అంటున్నారు. దీంతో పురంధేశ్వరి రగులుతున్నారని అంటున్నారు.

సాధారణంగా ఇలాంటి నియామకాలలో రాష్ట్ర ప్రెసిడెంట్ అనుమతి అవసరం. అలాంటిదేమీ లేకుండా యశ్వంత్ కి పదవి ఇవ్వడం పట్ల ఆమె ఏకంగా కేంద్ర బీజేపీ పెద్దలకు లేఖ రాసినట్లుగా ప్రచారం సాగుతోంది. బీజేపీ జాతీయ సంఘటన విభాగానికి చెందిన బీఎల్ సంతోష్ కి లేఖ రాసి అందులో తన అసంతృప్తిని వ్యక్తం చేశారని అంటున్నారు.

ఆ నియామకానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ వెంటనే ఆపాలని ఆమె కోరరాని కూడా అంటునారు. మరి సోము సిఫార్సు చేసిన వ్యక్తి అయిన యశ్వంత్ నియామకాన్ని కేంద్ర పెద్దలు నిలుపు చేస్తారా చిన్నమ్మ మాటకు విలువ ఇస్తారా అన్నది చర్చకు వస్తోంది. ఇది తన పదవికి ప్రతిష్టకు సవాల్ గానే చిన్నమ్మ తీసుకున్నారని అంటున్నారు.

బీజేపీలో ఆమె ప్రెసిడెంట్ అయినా సోము వీర్రాజు లాంటి వారి హవా కేంద్ర పెద్దల వద్ద సాగుతోంది అని అంటున్నారు. అలాగే ఏపీ బీజేపీ వర్గాలు సైతం ఆమెకు అడుగడుగునా బ్రేకులు వేస్తున్నాయని చెబుతున్నారు ఇక ఆమె స్వయంగా టీడీపీ మనిషిగా ముద్ర పడుతున్నారని అంటున్నారు. ఏది ఏమైనా బీజేపీ ప్రెసిడెంట్ గా చిన్నమ్మను నియమించినా మాట చెల్లుబాటు కానీయడం లేదా అన్నదే ఇక్కడ ప్రశ్నగా ఉంది.