ఆపరేషన్ వైసీపీ.. గట్టిగా కెలకుతున్న చిన్నశ్రీను
వైసీపీ నుంచి టీడీపీలో చేరిన విజయనగరం జడ్పీ మాజీ చైర్మన్ చిన్న శ్రీను ఆపరేషన్ వైసీపీ స్టార్ట్ చేశారు.
By: Tupaki Desk | 27 Sept 2026 2:00 PM ISTవైసీపీ నుంచి టీడీపీలో చేరిన విజయనగరం జడ్పీ మాజీ చైర్మన్ చిన్న శ్రీను ఆపరేషన్ వైసీపీ స్టార్ట్ చేశారు. రెండు వారాల కిందట టీడీపీ తీర్థం పుచ్చుకున్న చిన్న శ్రీను ఇప్పుడు వైసీపీలో ఉన్న తన అనుచరులను టీడీపీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు వేగవంతం చేశారని చెబుతున్నారు. ఆదివారం మాజీ మంత్రి, తన మేనమామ బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గమైన చీపురుపల్లిలో భారీ చేరికల కార్యక్రమం చేపట్టిన చిన్నశ్రీను గట్టి సవాల్ విసిరారని అంటున్నారు. పార్టీలో చేరిన కొత్తలో వైసీపీ నేతలు ఎవరితోనూ మాట్లాడని చిన్నశ్రీను అంతరంగం ఎవరికీ అర్థం కాలేదని, కానీ ఇప్పుడు వరుసగా చేరికలను ప్రోత్సహించేలా ఆయన కదలికలు ఉన్నాయని చెబుతున్నారు.
తెలుగుదేశం పార్టీలో సొంత బలం పెంచుకోవడంతోపాటు వచ్చే స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచే విధంగా పార్టీకి ఉపయోగపడాలని జడ్పీ మాజీ చైర్మన్ చిన్న శ్రీను అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. ఇందులో భాగంగా తొలి విడతలో తన అనుచరులైన ఆరుగురు జడ్పీటీసీ సభ్యులను టీడీపీలోకి తెచ్చేందుకు చిన్నశ్రీను ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఈ ఆరుగురు ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారని, త్వరలో మరికొంత మంది కూడా రాజీనామాలు చేయడం ద్వారా భారీ ఎత్తున ఒకేసారి చేరికల సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. జిల్లాలో మండలాల వారిగా సంప్రదింపులు జరుపుతున్నారని, అంతా ఒక కొలిక్కి వచ్చిన తర్వాత జిల్లాస్థాయిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్నారని అంటున్నారు.
సీఎంను రప్పిస్తారా?
ఇక జిల్లాలో పెద్ద ఎత్తున చేరికల సభ నిర్వహించాలని భావిస్తున్న చిన్న శ్రీను ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించాలని అనుకుంటున్నారని సమాచారం. అయితే సీఎం చంద్రబాబు వరుస కార్యక్రమాలు ఉండటంతో ఆయన వచ్చే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. దీంతో యువనేత లోకేశ్ ఆధ్వర్యంలో చేరికల సభ నిర్వహించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 20 మండలాల నుంచి నాయకులు ఒకేసారి పసుపు కండువాలు కప్పుకునేలా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారని అంటున్నారు. దీనివల్ల తనను పార్టీలో చేర్చుకోవడం వల్ల కలిగే లాభమేంటి అన్నది టీడీపీ పెద్దలకు తెలియాలనేది చిన్నశ్రీను ప్లాన్ గా ఉందని చెబుతున్నారు.
వైసీపీకి గట్టి దెబ్బ తప్పదా?
ఇక చిన్నశ్రీను కదలికలు వైసీపీలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి, తన మేనమామ బొత్స ఇలాకాను పునాదులతో సహ కదిలించేలా చిన్నశ్రీను ప్లాన్ చేస్తున్నారని జరుగుతున్న ప్రచారం ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం మెరకముడిదాం మండలంలో దాదాపు అన్ని పంచాయతీల నుంచి వైసీపీ నేతలను టీడీపీలోకి తీసుకురావాలని చిన్నశ్రీను వ్యూహరచన చేసినట్లు చెబుతున్నారు. బొత్సకు ఈ మండలంలో గట్టి పట్టు ఉండగా, చిన్నశ్రీను అక్కడే తన దృష్టి కేంద్రీకరించడంపై ఆసక్తి రేగుతోంది.
గతంలో మెరకముడిదాం మండలం నుంచి జడ్పీటీసీగా చిన్న శ్రీను ఏకగ్రీవంగా ఎన్నిక అవడం కూడా ఆయనకు లాభిస్తోందని చెబుతున్నారు. మరోవైపు నియోజకవర్గంలోని మరో మూడు మండలాల్లో కూడా గుర్తింపు ఉన్న స్థానిక నేతలు చిన్నశ్రీనుతో టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు నాయకులు చిన్నశ్రీను వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నట్లు జరుగుతున్న ప్రచారం వైసీపీలో అంతర్గతంగా వాడివేడి చర్చకు దారితీస్తోంది. చిన్న శ్రీను పార్టీ మారిన కొత్తలో కేడర్ ఆయనతో వెళ్లకుండా వరుసగా సమావేశాలు నిర్వహించిన వైసీపీ నేతలు ఆ తర్వాత పట్టు విడిచినట్లు కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో చిన్న శ్రీను వ్యూహాలకు పదును పెడుతున్నారని అంటున్నారు. మొత్తానికి వైసీపీని ఖాళీ చేయించాలనే లక్ష్యంతో చిన్న శ్రీను వేస్తున్న రాజకీయ ఎత్తుగడ జిల్లా రాజకీయాలను ఆసక్తికరంగా మార్చేసిందని అంటున్నారు.
