దేశద్రోహం కేసులో చిన్మయ్ కృష్ణదాస్‌కు బెయిల్ మంజూరు!
తాజాగా హైకోర్టు ఆయన అనారోగ్యం, విచారణ లేకుండా జైలులో ఉండటం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసింది.
By: Tupaki Desk | 30 April 2025 5:27 PM ISTకొన్ని నెలల క్రితం బంగ్లాదేశ్‌లో అరెస్ట్ అయిన ఇస్కాన్ మాజీ ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్‌కు అక్కడి కోర్టు ఊరటనిచ్చింది. దేశద్రోహం కేసులో అరెస్టయిన ఆయనకు తాజాగా బంగ్లాదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ పరిణామం ఆయన మద్దతుదారుల్లో హర్షం వ్యక్తం చేస్తోంది. చిన్మయ్ కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్ పోలీసులు దేశద్రోహం ఆరోపణలపై అరెస్టు చేశారు. ఒక హిందూ సమాజ ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారనేది ఆయనపై వచ్చిన ప్రధాన ఆరోపణ. అదే సమయంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఆయనతో సహా 18 మందిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో గతేడాది అక్టోబర్ 30న ఆయనను చిట్టగాంగ్‌లో అరెస్టు చేశారు. ఈ అరెస్టు భారతదేశంలోనూ తీవ్ర కలకలం రేపింది.
అక్టోబర్ 25న లాల్‌డింగి మైదానంలో నిర్వహించిన ర్యాలీలో బంగ్లాదేశ్ జెండాకు మించి ఎత్తులో కాషాయ పతాకాన్ని ఎగురవేయడమే ఈ కేసులకు కారణమైంది.ఆయన అరెస్టు నేపథ్యంలో దేశీయంగా మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అరెస్టు అనంతరం చిన్మయ్ కృష్ణదాస్‌కు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాదులు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే కింది కోర్టులు ఆయన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించాయి.
తాజాగా హైకోర్టు ఆయన అనారోగ్యం, విచారణ లేకుండా జైలులో ఉండటం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసింది. చిన్మయ్ కృష్ణదాస్ గతంలో ఇస్కాన్‌లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన అరెస్టు సమయంలో ఇస్కాన్ బంగ్లాదేశ్ శాఖ ఆయన చర్యలతో తమకు సంబంధం లేదని ప్రకటించింది. అయితే తాజాగా బెయిల్ మంజూరు కావడంతో ఇస్కాన్ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. చిన్మయ్ కృష్ణదాస్‌కు బెయిల్ మంజూరు కావడం ఆయన మద్దతుదారులకు ఊరటనిచ్చే విషయం. అయితే దేశద్రోహం కేసు ఇంకా కొనసాగుతుండటంతో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.
