Begin typing your search above and press return to search.

పెళ్లి.. పిల్లల మీద ఇంట్రస్టు లేని చైనీయులు.. అసలు కారణమిదే!

అనుకుంటాం కానీ సుఖంగా ఉండాలి..సౌఖ్యంగా బతకాలనుకున్న క్షణం నుంచి బతుకు బండి పరుగులు తీయాల్సిన తప్పని పరిస్థితి

By:  Tupaki Desk   |   17 Aug 2023 5:49 AM GMT
పెళ్లి.. పిల్లల మీద ఇంట్రస్టు లేని చైనీయులు.. అసలు కారణమిదే!
X

అనుకుంటాం కానీ సుఖంగా ఉండాలి..సౌఖ్యంగా బతకాలనుకున్న క్షణం నుంచి బతుకు బండి పరుగులు తీయాల్సిన తప్పని పరిస్థితి. అలా మొదలైన రేసులో వేగం పెరుగుతూనే ఉండాలే తప్పించి.. తగ్గే పరిస్థితులు ఉండకూడదు. వేగం తగ్గితే.. బతకలేని దుస్థితిలోకి పోవటం అప్పుడప్పుడు చోటు చేసుకుంటుంది. వ్యక్తిగతంగానే ఇలా ఉంటే.. ఒక దేశంలోని ప్రత్యేక పరిస్థితులు.. ఇలాంటి మైండ్ సెట్ ను మరింత పెంచేస్తాయి. ప్రపంచంలో తన చుట్టుపక్కల ఉన్న వారితో తరచూ పేచీలు పెట్టుకునే చైనాలో ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొంది.

ఆ దేశంలోని పరిస్థితుల పుణ్యమా అని.. ఇప్పుడా దేశంలోని యువత పెళ్లి చేసుకోవటం.. పిల్లల్ని కనే విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం లేదు. దీంతో.. పెళ్లిళ్ల రేటు భారీగా పడిపోవటమే కాదు.. దాని ప్రభావం పిల్లల్ని కనే విషయం మీదా పడుతోంది. మొన్నటి వరకు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనాలో.. గడిచిన పది.. పదిహేనేళ్ల కాలంలో పరిస్థితుల్లో చాలానే మార్పులు చోటు చేసుకున్నాయి. 2013లో చైనాలో జరిగిన పెళ్లిళ్లతో పోలిస్తే 2022 నాటికి అందులో సగానికి పైనే పెళ్లిళ్ల జరగలేదంటున్నారు. ఇదొక్కటి చాలు చైనాలోని యువత పెళ్లి విషయంలో ఎంత విముఖంగా ఉన్నారో అర్థమవుతుంది.

పెళ్లిళ్లకు.. పిల్లల్ని కనే విషయంలో చైనీయులు పెద్దగా ఆసక్తి చూపించని నేపథ్యంలో చైనా ప్రభుత్వం పిల్లల్ని కన్న వారికి నజరానాలు ఇస్తానని చెబుతోంది. అయినప్పటికీ వాటి మీద పెద్ద ఆసక్తి చూపకపోవటం గమనార్హం. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు సైతం ప్రోత్సాహాకాలు అందించేందుకు సిద్ధమవుతున్నా.. చైనీయులు మాత్రం పిల్లల్ని కనే విషయంలో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. చైనాలో అభివృద్ధిలో అంతకంతకూ పెరుగుతున్న కొద్దీ.. ఆ దేశంలోని ప్రజల ఇబ్బందులు పెరుగుతున్నాయి.

రియల్ ఎస్టేట్ బూమ్ తో అక్కడి ఇళ్ల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి. దీంతో.. జీవన వ్యయం పెరగటంతో పాటు.. ఆర్థిక ఇబ్బందులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లిళ్లకు పెద్దగా ఇంట్రస్టు చూపటం లేదు. పెళ్లి చేసుకున్నంతనే పెరిగే బాధ్యతల్ని ఫేస్ చేసేందుకు ఆసక్తి చూపటం లేదంటున్నారు. ఒకవేళ.. పెళ్లిళ్లు చేసుకున్నా.. పిల్లల్ని కనే విషయంలో అమ్మాయిలు ఇష్టపడటం లేదంటున్నారు. దీనికి కారణం.. పిల్లల్ని కన్న తర్వాత కెరీర్ అవకాశాలు దెబ్బ తినే వీలు ఉండటంతో వారు పిల్లల్ని కనే విషయంపై పెద్దగా ఫోకస్ చేయటం లేదు.

ఈ మొత్తం దేశంలోని జననాల మీద ప్రభావాన్ని చూపుతోంది. జనన మరణాలకు సంబంధించిన సైకిల్ లో ఇప్పటికే చైనా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. జననాలు అంతకంతకూ తగ్గిపోతున్న నేపథ్యంలో దేశంలో పెద్ద వయస్కుల వారు పెరుగుతున్నారు. యువత సంఖ్య తగ్గుతోంది. రానున్న రోజుల్లోఈ సమస్య మరింత తీవ్రమవుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలో అత్యల్ప జననాల రేటు నమోదు అవుతున్న దేశాల జాబితాలో చైనాతో పాటు దక్షిణ కొరియా.. తైవాన్.. హాంకాంగ్.. సింగపూర్ లు కూడా ఉండటం గమనార్హం. 2017లో చైనాలో సగటున ఒక మహిళకు 1.3 పిల్లలు ఉండగా.. గత ఏడాది ఈ సంఖ్య 0.9కు తగ్గింది. 2019 నాటికి చైనాలో 25 కోట్ల మంది అరవైఏళ్లకు పైబడిన వారు ఉంటే.. 2040 నాటికి ఈ సంఖ్య 40 కోట్లు దాటనుంది.

అప్పటి చైనా జనాభాలో ఈ పెద్దవయస్కుల సంఖ్య 28 శాతంగా చెబుతున్నారు. జననాలు తగ్గిపోవటంతో పెద్ద వయస్కుల సంఖ్య పెరగటం కారణంగా.. ప్రభుత్వ ఖజానాపై భారం అధికంగా ఉండనుంది. అదే సమయంలో శ్రామిక శక్తి తగ్గితే దేశాభివృద్ధిపైనా ప్రభావం పడనుంది. దీంతో.. దేశ ప్రజల మైండ్ సెట్ మార్చలేని డ్రాగన్ కిందా మీదా పడుతోంది.