Begin typing your search above and press return to search.

చైనా మరో దుశ్చర్య.. భారత ప్రాంతాలతో కొత్త మ్యాపు!

ఇక తైవాన్‌ పైన ఎప్పటి నుంచో చైనా కన్నేసింది. తైవాన్‌ ను విలీనం చేసుకోవడానికి సర్వశక్తులూ ఒడ్డుతోంది

By:  Tupaki Desk   |   29 Aug 2023 10:15 AM GMT
చైనా మరో దుశ్చర్య.. భారత ప్రాంతాలతో కొత్త మ్యాపు!
X

చింత చచ్చినా పులుపు చావదన్నట్టు చైనా తీరు మారడం లేదు. గతంలో లడక్‌ సమీపంలోని గాల్వాన్‌ లో భారత్‌ చేతిలో చావుదెబ్బ తిన్నా ఇంకా బుద్ధి రాలేదు. తన సామ్రాజ్యవాద బుద్ధిని చాటుకుంటూ విదేశీ ప్రాంతాలను తనవిగా పేర్కొంటూ కొత్త మ్యాపును విడుదల చేసింది. ఈ క్రమంలోనే భారతదేశ ప్రాంతాలను తన ప్రాంతాలుగా పేర్కొంది.

భారత్‌ లోని ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌ ను చైనా ఎప్పటి నుంచో దక్షిణ టిబెట్‌ గా పేర్కొంటూ వస్తోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ కు ఆవలి వైపు చైనా భూభాగంలో ఎలాంటి గ్రామాలు, నివాసాలు లేకపోయినా ఇటీవల కాలంలో ఆ దేశం పెద్ద ఎత్తున గ్రామాలను నిర్మించింది. తద్వారా ఎప్పటి నుంచో అక్కడ గ్రామాలు, నివాసాలు ఉన్నాయని అరుణాచల్‌ ప్రదేశ్‌.. చైనాలో భాగమని చెప్పుకోవడానికి కుట్రపూరిత ప్రణాళిక రచించింది.

ఈ నేపథ్యంలో తాజాగా చైనా కొత్త మ్యాపును విడుదల చేసింది. ఇందులో భారతదేశ రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌ తోపాటు కశ్మీర్‌ లోని ఆక్సాయ్‌ చిన్‌ ప్రాంతాన్ని తన దేశ భూభాగాలుగా మ్యాపులో చూపించింది. వాస్తవానికి 1962లో భారత్‌ లో జరిగిన యుద్ధంలో ఆక్సాయ్‌ చిన్‌ ప్రాంతాన్ని చైనా దురాక్రమించింది. అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని తన గుప్పిట్లోనే ఉంచుకుంది.

కాగా కొత్త మ్యాపులో కేవలం భారతదేశ ప్రాంతాలనే కాకుండా వివాదాస్పద దక్షిణ చైనా సముద్రాన్ని, తైవాన్‌ దేశాన్ని కూడా తన భూభాగాలేనని ప్రకటించుకుంది. ఆ భాగాలతో కలిపి కొత్త మ్యాపును విడుదల చేసింది.

అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ భూభాగమని, ఎప్పటికీ అంతర్భాగంగానే ఉంటుందని భారత్‌ పునరుద్ఘాటిస్తున్నప్పటికీ చైనా తీరులో మార్పురాకపోవడం గమనార్హం. చైనాతోపాటు ప్రపంచంలోని చాలా దేశాలు ఉపయోగించే సరిహద్దుల డ్రాయింగ్‌ మెథడ్‌ ఆధారంగా ఈ మ్యాప్‌ను రూపొందించారని చైనా ప్రధాన మీడియా సంస్థ గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది.

చైనా తన తాజా మ్యాపులో చూపించిన దక్షిణ చైనా సముద్రంపై వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేసియా, బ్రూనై, తైవాన్‌ తదితర దేశాలతో చైనాకు వివాదాలు ఉన్నాయి. అయితే ఆయా దేశాల సముద్ర జలాలపైన తనకే హక్కులు ఉన్నాయని.. ఆ ప్రాంతమంతా తనదేనని సముద్రాన్ని కూడా వదలకుండా చైనా మ్యాపులో చూపించుకుంది.

ఇక తైవాన్‌ పైన ఎప్పటి నుంచో చైనా కన్నేసింది. తైవాన్‌ ను విలీనం చేసుకోవడానికి సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇటీవల ఆ దేశం ఉపాధ్యక్షుడు అమెరికాలో పర్యటించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీ ఎత్తున యుద్ధ విమానాలు, ఫైటర్‌ జెట్లను తైవాన్‌ గగనతలంలోకి ప్రయోగించింది. అంతేకాకుండా యుద్ధ నౌకలను తైవాన్‌ సమీపంలోకి సముద్ర జలాల్లోకి పంపింది. తాజాగా విడుదల చేసిన మ్యాపే కాకుండా డిజిటల్‌ మ్యాపును, నేవిగేషన్‌ మ్యాపును కూడా త్వరలో విడుదల చేస్తామని చైనా ప్రకటించింది.

చైనా దుశ్చర్య నేపథ్యంలో భారత్‌ ఎలా స్పందిస్తుదనేది ఆసక్తికరంగా మారింది. కొద్ది రోజుల క్రితం దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్‌ సదస్సులో చైనా అధినేత జిన్‌ పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారని చైనా మీడియా వార్తలు ప్రచురించింది. అయితే దీన్ని భారత ప్రభుత్వం ఖండించింది. ఇప్పుడు తాజాగా భారత్‌ ప్రాంతాలతో చైనా మ్యాపు విడుదల చేయడంపై భారత్‌ వైఖరి స్పష్టం కావాల్సి ఉంది.