Begin typing your search above and press return to search.

చైనాకు జ‌లుబు.. భార‌త్‌లో తుమ్ములు.. మాస్క్ త‌ప్ప‌దా?

పొరుగు దేశం చైనాలో ఏం జ‌రిగినా.. వెంట‌నే దాని ప్ర‌భావం భార‌త్‌పై వాయు వేగ మ‌నోవేగాల‌తో ప‌డుతోంది

By:  Tupaki Desk   |   29 Nov 2023 5:41 PM GMT
చైనాకు జ‌లుబు.. భార‌త్‌లో తుమ్ములు.. మాస్క్ త‌ప్ప‌దా?
X

పొరుగు దేశం చైనాలో ఏం జ‌రిగినా.. వెంట‌నే దాని ప్ర‌భావం భార‌త్‌పై వాయు వేగ మ‌నోవేగాల‌తో ప‌డుతోంది. గ‌తంలో క‌రోనా వైర‌స్‌.. త‌ర్వాత‌.. జికా వైర‌స్.. ఇలా అనేక వ్యాధులు చైనాలో పుట్టి భార‌త్‌ను కుదిపేశాయి. ఈ నేప‌థ్యంలో చైనాలో ఏం జ‌రిగినా.. భార‌త్ వెంట‌నే అలెర్ట్ అవుతోంది. తాజాగా చైనాలో ఓ కొత్త ర‌కం ఇన్‌ఫెక్ష‌న్ వెలుగు చూడ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం వెంట‌నే రాష్ట్రాల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. వైద్య స‌దుపాయాలు మెరుగు ప‌రుచుకోవాల‌ని ఆదేశించింది. ఎక్క‌డ ఏచిన్న ల‌క్ష‌ణం క‌నిపించినా.. అజాగ్ర‌త్త వ‌హించ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించింది.అంతేకాదు.. అవ‌స‌ర‌మైతే.. మ‌రోసారి మాస్కులు ధ‌రించాల‌నే ఆదేశాలు ఇవ్వాల‌ని కూడా కేంద్రం సూచించింది.

ఏం జ‌రిగింది?

చైనాలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు పెరిగాయి. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ ల‌క్ష‌ణాలు ఎక్కువ‌గా ఉండ‌డం.. మ‌ర‌ణాలు కూడా సంభ‌వించ‌డం ఆదేశాన్ని కుదిపేస్తున్నాయి. దీంతో ప‌లు ప్రావిన్స్‌ల‌లో రెడ్ అలెర్ట్ కూడా ప్ర‌క‌టించారు. ఇక‌, చైనాలో చోటు చేసుకున్న ఆరోగ్య ప‌రిస్థితులు వెలుగు చూడగానే.. భార‌త‌ ప్రభుత్వం వెంట‌నే స్పందించింది. రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ముఖ్యంగా రాజస్థాన్‌, కర్ణాటక, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, హరియాణా, తమిళనాడు రాష్ట్రాలు తమ ఆరోగ్య వ్యవస్థలను అప్రమత్తం చేసుకోవాల‌ని కేంద్రం ఆదేశించింది.

దీంతో శ్వాసకోశ సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించేందుకు సంసిద్ధంగా ఉండాలని ఆసుపత్రులు, ఆరోగ్య సిబ్బందిని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదేశించాయి. తుమ్ము, దగ్గు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపించిన‌ప్పుడు నోటిని, ముక్కును కవర్‌ చేసుకోవాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని ప్ర‌భుత్వాలు సూచించాయి. రద్దీ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలని పేర్కొన్నాయి ఇన్ఫెక్ష న్‌ వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వైద్య సిబ్బందిని ఆదేశించాయి. పిడియాట్రిక్‌ యూనిట్లలో అన్ని వసతులను అందుబాటులో ఉంచాలని సూచించాయి.