Begin typing your search above and press return to search.

సముద్రంలోకి అణు జలాల విడుదల... చైనా కీలక నిర్ణయం!

అయితే ఈ విషయంపై చైనా, దక్షిణ కొరియాలతో పాటు స్వదేశంలోని కొన్ని వర్గాల నుంచీ దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

By:  Tupaki Desk   |   25 Aug 2023 4:01 AM GMT
సముద్రంలోకి  అణు జలాల విడుదల... చైనా కీలక నిర్ణయం!
X

సునామీ కారణంగా దెబ్బతిన్న ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంట్ నుండి పేరుకుపోయిన వ్యర్థ జలాలను సముద్రంలోకి విడుదల చేయడం మొదలు పెట్టింది జపాన్. ఈ విషయంపై సరిహద్దు దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోన్నప్పటికీ... జపాన్ తనపని తాను స్టార్ట్ చేసింది.


అవును... సునామీ కారణంగా ప్రమాదానికి గురైన ఫుకుషిమా దైచీ అణు విద్యుత్‌ కేంద్రం నుంచి రేడియోధార్మిక వ్యర్థ జలాలను సముద్రంలోకి విడుదల చేసే ప్రక్రియను జపాన్‌ ప్రారంభించింది. అయితే ఈ విషయంపై చైనా, దక్షిణ కొరియాలతో పాటు స్వదేశంలోని కొన్ని వర్గాల నుంచీ దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.


అయినప్పటికీ "ఐక్యరాజ్య సమితి పర్యవేక్షక సంస్థ, అంతర్జాతీయ అణుశక్తి మిషన్ (ఐఏఈఏ)" నుంచి అనుమతి తెచ్చుకున్న జపాన్... ఫుకిషిమా అణు విద్యుత్‌ కేంద్రాన్ని పూర్తిగా నిలిపివేయడానికి ఈ వ్యర్థజలాలను విడుదల చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని తెలిపింది.

టోక్యో ఎలక్ట్రిక్‌ పవర్‌ కంపెనీ (టెప్కో) చెబుతున్న లెక్కల ప్రకారం... ప్రస్తుతం జపాన్ లోని వెయ్యి ట్యాంకుల్లో 13.7 లక్షల టన్నుల రేడియోధార్మిక జలాలు పోగై ఉన్నాయి. అయితే వచ్చే ఏడాది మార్చి నాటికి వీటిలో 31,200 టన్నుల జలాలను వదిలించుకోవాలని టెప్కో ప్రణాళిక అని అంటున్నారు.

దీనిలో భాగంగానే 200 నుంచి 210 క్యూబిక్‌ మీటర్ల నీటిని శుద్ధి చేసి, రేడియో ధార్మిక గాఢతను తగ్గించి సముద్రంలోకి పంపింగ్‌ చేస్తున్నారు.

అయితే ఈ వ్యవహారంపై ఆసియా-పసిఫిక్‌ దేశాల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నీటి వల్ల ఇక్కడి మత్స్య సంపదకు డిమాండ్‌ పడిపోతుందని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "సేవ్ అవర్ సీస్" అంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. ఈ సమయంలో చైనా ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

అవును... జపాన్‌ నుంచి దిగుమతయ్యే అన్ని సముద్ర ఉత్పత్తులపై చైనా నిషేధం విధించింది. ఈ నిషేధం తక్షణమే అమలులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. మరోపక్క జపాన్‌ లోనూ ఈ నీటి విడుదలను కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టగా.. చేపల వేటపై ఆధారపడిన వారి ఉపాధికి సియోల్ ప్రభుత్వం హామీ ఇచ్చింది.

మరోపక్క 40,000 కంటే ఎక్కువ మంది ప్రజలు.. 160 తిమింగలాల తరపున ఫుకుషిమా నీటి విడుదలను నిలిపివేయాలని దక్షిణ కొరియా రాజ్యాంగ న్యాయస్థానానికి ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ లో తిమింగలాలు పిటిషనర్లుగా చేర్చబడటం గమనార్హం!