Begin typing your search above and press return to search.

ఐఫోన్‌ వాడొద్దు.. ఆ దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ప్రస్తుతం పెద్ద దేశాల మధ్య శత్రుత్వం పెరుగుతోంది. అభివృద్ధిలో ముందున్న అగ్ర రాజ్యాలు తమ రహస్యాలను తమ పోటీ దేశాలకు చేరనీయడం లేదు.

By:  Tupaki Desk   |   7 Sep 2023 5:44 AM GMT
ఐఫోన్‌ వాడొద్దు.. ఆ దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
X

ప్రస్తుతం పెద్ద దేశాల మధ్య శత్రుత్వం పెరుగుతోంది. అభివృద్ధిలో ముందున్న అగ్ర రాజ్యాలు తమ రహస్యాలను తమ పోటీ దేశాలకు చేరనీయడం లేదు. ఇందుకోసం అనేక చర్యలు తీసుకుంటున్నారు. గతంలో అమెరికా ప్రభుత్వం.. చైనాలో అతిపెద్ద మొబైల్‌ ఫోన్‌ దిగ్గజం అయిన హ్యువాయి ఫోన్లను నిషేధించింది. అమెరికా ప్రభుత్వంలో ఉన్న అధికారులు, మంత్రులు, ఇతర ప్రభుత్వ సిబ్బంది ఎవరూ హ్యువాయి ఫోన్లను వాడొద్దని ఆదేశాలను జారీ చేసింది. అమెరికా రహస్యాలు, సమాచారం ఈ ఫోన్ల ద్వారా చైనాకు చేరుతోందని అమెరికా ప్రభుత్వం అనుమానాలే ఇందుకు కారణం.

అలాగే మనదేశం కూడా చైనాకు చెందిన టిక్‌ టాక్‌ పై నిషేధం విధించింది. టిక్‌ టాక్‌ లో ఉన్న సాఫ్టువేర్‌ భారత రహస్యాలను తెలుసుకునే ప్రమాదం ఉందని.. చైనాలో ఉన్న సర్వర్లకు భారత డేటా చేరుతోందని అనుమానాలు వ్యక్తం చేస్తూ టిక్‌ టాక్‌ పై నిషేధం విధించింది. భారత్‌ బాటలోనే పలు దేశాలు కూడా నడిచాయి. అప్పట్లోనే చైనా.. భారత్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఇప్పుడు చైనా వంతు వచ్చింది. అమెరికాకు చెందిన మొబైల్‌ ఫోన్‌ దిగ్గజం.. యాపిల్‌ ఐఫోన్లను వాడకంపై చైనా నిషేధం విధించింది. ప్రభుత్వ ఉద్యోగులెవరూ వీటిని వాడొద్దని తాజాగా సంచలన ఆదేశాలు జారీ చేసింది.

సాధారణంగా యాపిల్‌ ఐఫోన్స్‌ని ఇష్టపడనివారు ఉండరు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి ఐఫోన్‌ అంటే ఇష్టం. ఇందులో ఎప్పుడు కొత్త మోడల్‌ విడుదలయినా.. విడుదలయిన రోజే విదేశాలకు వెళ్లిపోయి మరీ కొనుగోలు చేస్తుంటారు. కొందరు అయితే విదేశాల్లో తమకు తెలిసినవారి ద్వారా ఐఫోన్‌ ను తెప్పించుకుంటారు. అంతగా ఐఫోన్‌ పాపులర్‌ అయిపోయింది. అలాంటి ఐఫోన్‌ పై నిషేధం విధిస్తూ చైనా తీసుకున్న నిర్ణయం హాట్‌ టాపిక్‌ గా మారింది.

కేవలం ఐఫోన్‌ ను మాత్రమే కాకుండా విదేశాలకు చెందిన ఏ ఫోన్లను వాడొద్దని చైనా తాజా ఆదేశాల్లో పేర్కొంది. భద్రతాపరమైన భయం వల్ల ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ తెలిపింది.

మరోవైపు చైనా నిర్ణయంపై ఐఫోన్లను తయారుచేస్తున్న యాపిల్‌ కంపెనీ స్పందించలేదు. కాగా ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్‌ 15 సిరీస్‌ విడుదల కావాల్సి ఉంది. చైనా ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఐఫోన్‌ అమ్మకాలపై ప్రభావం పడుతుందని అంటున్నారు. అందులోనూ చైనా పెద్ద మార్కెట్‌ కావడంతో ఐఫోన్‌ అమ్మకాలకు గట్టి దెబ్బ తగులుతుందని భావిస్తున్నారు. అమెరికా తరువాత యాపిల్‌ కంపెనీకి పెద్ద మార్కెట్‌ చైనానే కావడం గమనార్హం.

అయితే కేవలం భద్రతాపరమైన కారణాలే కాకుండా తమ దేశానికి చెందిన స్వదేశీ బ్రాండ్స్‌ వినియోగాన్ని ప్రోత్సహించడానికి కూడా చైనా తాజా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.