చైనాలో వింత ట్రెండ్.. అద్దె ఇళ్ల కంటే హోటళ్లే మేలంటున్నయువత
చైనాలోని ప్రధాన నగరాల్లో అద్దె ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, అదే ప్రాంతాల్లో హోటల్ గదులు అద్దె ఇళ్ల కంటే చాలా చౌకగా లభిస్తున్నాయి.
By: Tupaki Desk | 15 April 2025 9:00 PM ISTపని లేదా చదువు కోసం వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడు సాధారణంగా అద్దె ఇళ్లలో ఉండటానికి ప్రయత్నిస్తారు. కానీ, చైనాలోని యువత మాత్రం దీనికి భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఉద్యోగాలు లేదా చదువుల కోసం ఇతర నగరాలకు వెళ్లేవారు అద్దె ఇళ్లకు బదులుగా హోటళ్లలోనే ఉండటానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీనికి కారణం ఏమిటంటే...
చైనాలోని ప్రధాన నగరాల్లో అద్దె ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, అదే ప్రాంతాల్లో హోటల్ గదులు అద్దె ఇళ్ల కంటే చాలా చౌకగా లభిస్తున్నాయి. అద్దెకు ఇల్లు తీసుకుంటే యజమానులతో ఒప్పందాలు చేసుకోవాలి, వారి నిబంధనలకు అంగీకరించాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, నిర్వహణ ఖర్చులు అదనం. అదే హోటల్‌లో ఉంటే ఆ పనులన్నీ హోటల్ సిబ్బంది చూసుకుంటారు. ఉదయం వచ్చి, తిని, నిద్రపోయి, ఆఫీసు లేదా కాలేజీకి వెళ్లడం అంతే. గది శుభ్రం చేయాల్సిన అవసరం లేదు, నిర్వహణ ఖర్చులు ఉండవు. వారాంతాల్లో బయటకు వెళ్లాలనుకుంటే థియేటర్లు, కేఫ్‌లు, పార్కులు, హోటళ్లు అన్నీ దగ్గరలోనే ఉంటాయి. అందుకే ఒంటరిగా ఉండే ఉద్యోగులు, విద్యార్థులు హోటళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
టియాంజిన్‌లో ఒక వ్యక్తి ఇల్లు అద్దెకు తీసుకుంటే నెలకు 3 వేల యువాన్లు ఖర్చవుతుంది. అదనపు ఖర్చులతో అది దాదాపు 3,500 యువాన్లకు చేరుకుంటుంది. అదే హోటళ్లతో ఎక్కువ కాలం ఉండేందుకు ఒప్పందం చేసుకుంటే నెలకు 2,500 యువాన్లు చెల్లిస్తే సరిపోతుంది. షాంఘైలోని మారియట్ వంటి లగ్జరీ హోటల్‌లో గది తీసుకుంటే నెలకు 10 వేల యువాన్లు ఖర్చవుతుంది. షాంఘైలో అపార్ట్‌మెంట్ అద్దెకు తీసుకోవాలంటే అంతకంటే ఎక్కువ ఖర్చవుతుందని అంటున్నారు. ఇదే ఇప్పుడు యువతను హోటళ్ల వైపు ఆకర్షిస్తోంది. కోవిడ్ కాలంలో హోటళ్లను నిర్వహించడం చాలా కష్టంగా మారింది. హోటల్ యజమానులు నష్టాలను పూడ్చుకోవడానికి ఛార్జీలను భారీగా తగ్గించారు. ఆ తర్వాత ఉద్యోగులు, విద్యార్థులు హోటళ్లకు ఎక్కువగా వస్తుండటంతో పూర్తికాలం ఉండేందుకు అనుమతిస్తున్నారు. ఈ ట్రెండ్ చైనా అంతటా పెరుగుతోంది.
