అమెరికాను ‘ఏఐ’ వీడియోలతో ఆడుకుంటున్న చైనా
అమెరికాలో తయారీ రంగం అంతగా అభివృద్ధి చెందలేదని చైనా ఎత్తిచూపుతోంది.
By: Tupaki Desk | 11 April 2025 11:10 AM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుచూపు లేకుండా చేస్తున్న వాణిజ్య యుద్ధంలో చైనా కూడా దీటుగా బదులిస్తోంది. రెండు దేశాలు ఒకరిపై ఒకరు పన్నులు పెంచుకుంటూ పోతుండటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది. ఈ నేపథ్యంలో, చైనా నుంచి ఎగుమతులు నిలిచిపోతే అమెరికా ఎదుర్కొనే సంక్షోభాన్ని చైనా వ్యంగ్యంగా ఏఐ వీడియోల ద్వారా తెలియజేస్తోంది.
అమెరికాలో తయారీ రంగం అంతగా అభివృద్ధి చెందలేదని చైనా ఎత్తిచూపుతోంది. కాలుష్యం వంటి కారణాల వల్ల అమెరికన్ కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల తయారీ కోసం చైనా, ఇతర దేశాలపై ఆధారపడుతున్నాయని గుర్తు చేస్తోంది. యాపిల్ వంటి పెద్ద కంపెనీలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయని వివరిస్తోంది. మరోవైపు, చైనా తయారీ రంగంలో గణనీయమైన ప్రగతి సాధించి, ప్రపంచ దేశాలకు అవసరమైన అనేక ఉత్పత్తులను అందిస్తోంది. సూది నుంచి యుద్ధ సామాగ్రి వరకు ప్రపంచవ్యాప్తంగా చైనా ఉత్పత్తులకు డిమాండ్ ఉంది.
అమెరికాకు చైనా చేసే ఎగుమతులు చాలా ఎక్కువ. అయితే అమెరికా నుంచి చైనా కొనుగోలు చేసేది తక్కువగా ఉంటోంది. అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులు అత్యవసరమైనవేనని, వాటికి తక్షణమే ప్రత్యామ్నాయం కనుగొనడం అంత సులువు కాదని చైనా ఈ వీడియోల ద్వారా సూటిగా చెబుతోంది. ట్రంప్, ఎలాన్ మస్క్ ఫోన్లు బాగుచేసుకుంటున్నట్లు, బట్టలు కుట్టుకుంటున్నట్లుగా ఫన్నీ వీడియోలను రూపొందించింది. అంతేకాకుండా, అమెరికన్లు అధిక బరువుతో బాధపడుతున్న విషయాన్ని కూడా చైనా తన వీడియోల్లో వ్యంగ్యంగా ప్రస్తావిస్తోంది.
ట్రంప్ ఇదే తరహా విధానాలను కొనసాగిస్తే, భవిష్యత్తులో చైనా అగ్రరాజ్యంగా మారినా ఆశ్చర్యం లేదని ప్రపంచంలోని అనేక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇతర దేశాలన్నీ సుంకాలను తగ్గించుకునేందుకు చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ, చైనా మాత్రం ఎదురు సుంకాలు విధిస్తూ ఏమాత్రం లొంగేది లేదని స్పష్టం చేస్తోంది.
అంతేకాదు, తన వ్యంగ్యపు వీడియోలతో అమెరికాను ట్రోల్ చేస్తూ సవాల్ విసురుతోంది. ఈ పరిణామాలు రానున్న రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాల్సి ఉంది.
