కొత్త కూటమి కడుతున్న చైనా పాక్... భారత్ మీద విద్వేషమే అజెండా !
భారతదేశం అలీన విధానాన్ని నమ్ముకుంది. భారత్ ప్రపంచానికి మిత్రుడిగా ఉంటుంది. తన ప్రయోజనాలే కాకుండా ఇతర దేశాలకూ సహాయకారిగా ఉంటూ వస్తోంది
By: Tupaki Desk | 2 July 2025 9:13 AM ISTభారతదేశం అలీన విధానాన్ని నమ్ముకుంది. భారత్ ప్రపంచానికి మిత్రుడిగా ఉంటుంది. తన ప్రయోజనాలే కాకుండా ఇతర దేశాలకూ సహాయకారిగా ఉంటూ వస్తోంది. తాను ఎదుగుతూ అందరూ బాగుండాలన్నదే భారత్ పాలసీ. అయితే దక్షిణాసియాలో భారత్ అంతకంతకూ ఎదిగిపోవడం డ్రాగాన్ చైనాకు ఎప్పటి నుంచో గిట్టడం లేదు.
భారత్ తటస్థ విధానంతో అటు అమెరికాకు ఇటు రష్యాకు కూడా మిత్రుడిగా ఉంది. అంతే కాదు ఇరాన్ ఇజ్రాయిల్ ల మధ్య యుద్ధం జరిగినా ఉక్రెయిన్ రష్యాల మధ్య భీకర సమరం సాగినా భారత్ అందరికీ మిత్రుడిగానే ఉంది. ఇదెలా సాధ్యమంటే భారత్ విదేశాంగ విధానం వల్లనే.
ఇక భారత్ మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతోంది. భారత్ పటిష్టమైన ఆర్ధిక దేశంగా ఉండడం చైనాకు అసలు నచ్చడం లేదు. తానే సూపర్ పవర్ గా ఎదగాలన్నది చైనా దురాశ. అమెరికా మాదిరిగా తాను ఏనాటికి అయినా ప్రపంచ పెద్దన్న పాత్ర పోషించాలన్నదే చైనా లక్ష్యంగా ఉంది. సరే ఆ దేశం ఆలోచనలు ఎలా ఉన్నా ఫరవాలేదు కానీ భారత్ మీద ఎందుకు అంత కసి అసూయ అన్నదే చర్చ.
భారత్ ఎదుగుదల తన ఉన్నతికి అడ్డు అని భావిస్తూ కుట్రతో చైనా చేస్తున్న ప్రధకాలకు పావుగా పాకిస్థాన్ ఏనాడో మారిపోయింది. ఇక ఇపుడు బంగ్లాదేశ్ కూడా జత కలసింది. ఈ రెండు దేశాలను తనతో ఉంచుకుని భారత్ ని వీలైనంతగా దెబ్బ తీయాలని చైనా పన్నాగంగా ఉంది.
ఇక చూస్తే కనుక తాజాగా చైనాలోని కున్మింగ్‌లో జూన్ 19వ్ చైనా అధ్యక్షతన జరిగిన ఒక కీలక సమావేశంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల ప్రతినిధులు పాల్గొన్నాయని కరాచీ కేంద్రంగా పరిచేసే ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ అనే పత్రిక రాసింది. ఈ పత్రిక కధనం ప్రకారం చూస్తే దక్షిణాసియాలో ప్రస్తుతం ఉన్న సార్క్ స్థానంలో కొత్త ప్రాంతీయ కూటమిని ఏర్పాటు చేయాలని చైనా పాక్ బంగ్లాదేశ్ నిర్ణయించాయని పేర్కొంది.
సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్ అంటే షార్ట్ ఫార్మ్ లో సార్క్ గా ఒక ప్రాంతీయ వేదిక దక్షిణాసియాలో ఉంది. ఇందులో భారత్ సభ్య దేశంగా ఉండడమే కాదు కీలక పాత్ర పోషిస్తోంది. 1985 డిసెంబర్ లో సాక్ ని స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం నేపాల్ లోని ఖాట్మండులో ఉంది.
సార్క్ లో సభ్య దేశాలుగా బంగ్లాదేశ్, భూటాన్, భారత్ , మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక వంటివి ఉన్నాయి. ఇక 2007 లో ఆఫ్ఘనిస్తాన్ ఈ సంస్థలో చేరింది. సార్క్ కి పెద్దన్నగా భారత్ ఉంది. దక్షిణాసియాలో ఈ దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక, సామాజిక, సాంస్కృతిక అభివృద్ధిని చేసుకోవడంతో పాటు పరస్పర సహకారం కోసం దీనిని ఏర్పాటు చేశారు. భారత్ సార్క్ స్పూర్తితో తోటి దేశాలకు ఇతోధికంగా సాయం చేస్తూ వస్తోంది.
అయితే సార్క్ మీద ఎనాటి నుంచో కళ్ళు కుట్టిన చైనా ఇపుడు తన నాయకత్వంలో ఈ చిన్న దేశాలను కూడగట్టి దక్షిణాసియాలో పెద్దన్న పాత్ర పోషించాలని చూస్తోంది. ఆ విధంగా భారత్ ని ఒంటరిగా చేయాలని తలపోస్తోంది. ఇప్పటికే బంగ్లాదేశ్ భారత్ మీద విషం చిమ్ముతోంది. అలా చైనాకు దగ్గర అయింది. నేపాల్ ని కూడా చైనా మచ్చిక చేసుకుంది. తాలిబన్ల చేతిలో ఉన్న అఫ్గానిస్థాన్ ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది.
అలాగే ఈ మధ్యనే మాల్దీవులు కూడా కొంత భారత్ వ్యతిరేకత వైఖరి తీసుకోవడం వెనక చైనా ఉందని భావిస్తున్నారు. దాంతో ఆ దేశాన్ని తన కొత్త కూటమిలో చేరాలని కోరనుంది అంటున్నారు. భూటాన్ శ్రీలంకలను సైతం ఆకర్షిస్తే తన నాయకత్వంలో కొత్తగా సార్క్ ని ఏర్పాటు చేయాలని ఉవ్విళ్ళూరుతోంది. అలా భారత్ చుట్టూ ఉన్న దేశాలకు తాను పెద్దన్నగా ఉంటూ భారత్ మీద తన కుట్రలను మరింతగా పెంచాలని భావిస్తొందా అన్న చర్చ సాగుతోంది. మరి ఈ పరిణామాల పట్ల భారత్ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
