Begin typing your search above and press return to search.

పిల్లలను కంటే బంపరాఫర్.. ఏడాదికి రూ.42,000

జనాభా సంక్షోభాన్ని అధిగమించేందుకు చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

By:  Tupaki Desk   |   30 July 2025 1:00 AM IST
పిల్లలను కంటే బంపరాఫర్.. ఏడాదికి రూ.42,000
X

జనాభా సంక్షోభాన్ని అధిగమించేందుకు చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెంబర్ వన్ ఎకానమీగా ఆవిర్భవించాలనే డ్రాగన్ కలలకు జనాభా రేటు తగ్గుదల పెను సమస్యగా మారింది. దీంతో జనాభాను పెంచుకునేందుకు, వీలైనంత మంది ఎక్కువ పిల్లలను కనమంటూ చైనా ప్రభుత్వం పిలుపునిస్తోంది. అయితే పిల్లలను పెంచడం భారంగా భావిస్తున్న చైనీయులు ప్రభుత్వ సూచనలను లెక్కచేయడం లేదు. దీంతో పిల్లలను కంటే వారిని సాగేందుకు మూడేళ్ల పాటు ఆర్థిక సాయం చేసేలా ప్రభుత్వం కొత్త పథకం తీసుకువచ్చింది. ఈ నిర్ణయం వల్ల అయినా జనాభా తగ్గుదల రేటు పడిపోకుండా అడ్డుకోవచ్చని చైనా అధికారులు ఆశిస్తున్నారు.

దశాబ్దం క్రితమే ఒక బిడ్డ నినాదానికి స్వస్తి

చైనా జనాభా గత కొన్నేళ్లుగా క్షీణిస్తోంది. గత మూడేళ్లలో జననాల రేటు బాగా పడిపోయింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాకు జనాభా తగ్గుదల ఆందోళనకరంగా పరిణమించింది. ఇది ప్రపంచ నంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న ఆ దేశ లక్ష్యాన్ని అవాంతరంగా మారిందని బీజింగ్ పెద్దలు కలవరం పడ్డారు. దీనికి విరుగుడుగా పదేళ్ల క్రితమే ‘ఒకే బిడ్డ’ అన్న నినాదానికి స్వస్తి పలికింది. అయినా పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు. దేశంలో యువత కంటే వృద్ధుల సంఖ్య భారీగా ఉండటంతో ఆ దేశ ఎకానమీ భవిష్యత్తులో తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతోంది. దీంతో జనాభా సంఖ్యను పెంచే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మూడేళ్ల వరకు రూ.42 వేలు

పిల్లలను కనమంటూ డ్రాగన్ దేశ ప్రజలకు భారీ తాయిళాలు అందిస్తోంది. తాజాగా, పిల్లలను కంటే వారికి మూడేళ్లు వచ్చేవరకు ఏడాదికి 3,600 యువాన్లు అంటే మన కరెన్సీలో ఏడాదికి రూ.42 వేలు ఇస్తామని ప్రకటించింది. ఈ పథకం ఈ ఏడాది జనవరి 1 నుంచే చేయనున్నట్లు వెల్లడించింది. స్థిరంగా జనాభా తగ్గిపోవడం చైనాకు పెద్ద సమస్యగా మారింది. 2016లో 8.8 మిలియన్ల కొత్త జననాలు నమోదవవగా, 2024లో నవజాత శిశువుల సంఖ్య 9.54 మిలియన్లకు తగ్గింది. ఇలా స్థిరంగా జనాభా తగ్గుతూ ఉంటే భవిష్యత్తులో చైనాకు పెట్టుబడులు రావంటూ చైనా పాలకుల్లో ఆందోళన మొదలైంది. దీంతో పిల్లలు ఎక్కువగా కనమని ప్రజలను ప్రోత్సహించాలని చైనా నిర్ణయించింది. అయితే చైనా ప్రజలు మాత్రం పిల్లలను కనేందుకు విముఖత చూపుతున్నారు. జీవన వ్యయం పెరిగిపోవడం, ఆదాయం అతి తక్కువగా ఉండటంతో యువత పెళ్లి చేసుకునేందుకు అనాసక్తి చూపుతున్నారు.

చాలా ప్రోత్సాహకాలు

ఇదివరకే పెళ్లి అయిన వారు పిల్లలను కనాలంటేనే భయపడుతున్నారు. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా చైనాలో వివాహ రేట్లు అత్యల్ప స్థాయికి పడిపోవడమే ఇందుకు నిదర్శనం. స్థానికంగా ప్రభుత్వ అధికారులు రెండో బిడ్డను కనేవారికి 50 వేల యువాన్లు అంటే రూ.5 లక్షల 96 వేలు, మూడో బిడ్డ కంటే లక్ష యువాన్లు అంటే రూ.11 లక్షల 92 వేలు చెల్లిస్టున్నారు. అయినా పరిస్థితుల్లో మార్పు రాలేదు. దీంతో డ్రాగన్ కొత్తగా స్కీమ్ ప్రకటించింది.