పాక్ కు భారత్ గుట్టు ఇచ్చిన చైనా.. అయినా మనదే పైచేయి
రక్షణశాఖకు చెందిన సెంటర్ ఫర్ జాయింట్ వార్ ఫేర్ స్టడీస్ నిర్వహించిన ఈ అధ్యయనంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
By: Tupaki Desk | 20 May 2025 3:00 AM ISTపహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ముమ్మరంగా సాగుతున్న వేళ, పాకిస్తాన్ విదేశాల సాయంతో కుట్రలకు తెరలేపిందనే సంచలన ఆరోపణలు వెలుగుచూశాయి. ముఖ్యంగా భారత్ పై ప్రతిదాడులు చేసేందుకు వీలుగా మన ఎయిర్ బేస్ లు, రక్షణ స్థావరాలు, ఇతర కీలక ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం మొదలుపెట్టిన పాకిస్తాన్ కు, దాని మిత్రదేశం చైనా సాయం అందించిందని రక్షణ శాఖకు చెందిన ఓ అధ్యయనం వెల్లడించింది.
రక్షణశాఖకు చెందిన సెంటర్ ఫర్ జాయింట్ వార్ ఫేర్ స్టడీస్ నిర్వహించిన ఈ అధ్యయనంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారత్ లో టార్గెట్ లను ఫిక్స్ చేసుకుని డ్రోన్లను పంపేందుకు వీలుగా చైనా వారికి సాయం చేసినట్లు గుర్తించారు. అంతేకాదు భారత్ లో ఆపరేషన్ సింధూర్ లో పోరాటం చేస్తున్న పాకిస్తాన్ కు ఆయుధ రక్షణ వ్యవస్థలతో పాటు ఉపగ్రహ సమాచారాన్ని సైతం చైనా అందించినట్లు రక్షణ శాఖ అధ్యయనంలో తేలింది. దీన్ని బట్టి భారత్-పాక్ పోరులో చైనా క్రియాశీలకంగా పనిచేసినట్లు గుర్తించారు. భారత బలగాల మోహరింపులు, ఆయుధాలను గుర్తించేందుకు పాకిస్తాన్ రాడార్లు, ఆయుధ రక్షణ వ్యవస్థలకు చైనా ఉపగ్రహ సాయం అందించిందని అధ్యయనంలో తేలినట్లు పేర్కొన్నారు.
ముఖ్యంగా పహల్గాం దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి మధ్యన ఉన్న సుమారు 15 రోజుల వ్యవధిలో చైనా తమ శాటిలైట్ల కవరేజ్ ను పెంచడం ద్వారా భారత్ లో లక్ష్యాల సమాచారాన్ని పాకిస్తాన్ కు అందించినట్లు తెలుస్తోంది. తద్వారా భారత బలగాల కదలికల్ని పాకిస్తాన్ ముందే తెలుసుకునేలా చేసిందని డిఫెన్స్ గ్రూప్ వెల్లడించింది. వాస్తవానికి చైనా పాకిస్తాన్ కు కేవలం ఫైటర్ జెట్లు, మిసైళ్లు మాత్రమే ఇచ్చిందని ముందుగా భావించినా.. లాజిస్టిక్, నిఘా సమాచారం కూడా ఇచ్చిందని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. తద్వారా తన ఆయుధాల్ని, శాటిలైట్లు, ఇతర నైపుణ్యాల్ని భారత్-పాక్ సంఘర్షణలో పరీక్షించినట్లయింది.
అయితే, పాకిస్తాన్ ఈ పోరులో చైనా సాయం తీసుకుని మరీ లక్ష్యాల్ని శాటిలైట్ ద్వారా గుర్తించి వందల కొద్దీ డ్రోన్లు ప్రయోగించినప్పటికీ, అవి చివరికి భారత ఎస్-400, ఎల్ 70 వ్యవస్థల ధాటికి తట్టుకోలేక కుప్పకూలినట్లు నివేదిక పేర్కొంది.
మరోవైపు, చైనా తయారీ J-10C ఫైటర్, PL-15 ఎయిర్-టు-ఎయిర్ క్షిపణి వంటి ఆయుధాలు తొలిసారి పరీక్షించబడటం, వాటి వాడకంపై తైవాన్ సహా ఇతర డ్రాగన్ ప్రత్యర్థుల్లో ఆందోళన పెంచుతున్నట్లు తెలుస్తోంది.
మొత్తంగా, ఈ రక్షణ అధ్యయనం ప్రకారం, భారత్ పై దాడికి పాకిస్తాన్ చైనా నుంచి ఉపగ్రహ, నిఘా సమాచారంతో పాటు ఇతర సైనిక సాయాన్ని కూడా పొందిందని, భారీ కుట్రకు పాల్పడి లక్ష్యాలను గుర్తించి డ్రోన్లతో దాడి చేసినప్పటికీ, భారత రక్షణ వ్యవస్థల ముందు పాకిస్తాన్ ప్రయత్నాలు ఫలించలేదని వెల్లడైంది.
