Begin typing your search above and press return to search.

భారత్ సరిహద్దుపై చైనా-పాక్ కలిసి మరో కుతంత్రం

భారత్‌తో ఉన్న సరిహద్దు భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి, ఆధునీకరించడానికి చైనా అధికారిక సహకారాన్ని విస్తరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది.

By:  A.N.Kumar   |   18 July 2026 7:00 PM IST
భారత్ సరిహద్దుపై చైనా-పాక్ కలిసి మరో కుతంత్రం
X

దక్షిణాసియా ప్రాంతంలో వ్యూహాత్మక, భద్రతా సమీకరణాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భద్రతా సవాళ్లు.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రతి దేశం తన సరిహద్దులను మరింత బలోపేతం చేసుకునే పనిలో పడింది. ఇందులో భాగంగానే భారత్‌కు ఇరువైపులా ఉన్న పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్‌లు తమ రక్షణ బంధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాయి. భారత్‌తో ఉన్న సరిహద్దు భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి, ఆధునీకరించడానికి చైనా అధికారిక సహకారాన్ని విస్తరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది.

ఇప్పటికే ఆర్థిక, రక్షణ రంగాల్లో అత్యంత సన్నిహిత భాగస్వాములుగా ఉన్న చైనా-పాకిస్తాన్.. ఇప్పుడు సరిహద్దు భద్రత, ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలపైనా వ్యూహాత్మక ఉమ్మడి సహకారాన్ని పెంచుతుండటం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ కొత్త పరిణామం భారత్‌కు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన అంశంగా మారింది.

జాయింట్ వర్కింగ్ గ్రూప్‌తో ఉమ్మడి వ్యూహం

చైనా నేషనల్ ఇమ్మిగ్రేషన్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నతాధికారుల ఉన్నత స్థాయి బృందం ప్రస్తుతం పాకిస్తాన్‌లో పర్యటిస్తోంది. చైనా విదేశాంగ శాఖ డైరెక్టర్ జనరల్ క్వీ జింగ్యాంగ్ నేతృత్వంలోని ఈ ప్రతినిధి బృందం.. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహసిన్ నఖ్వీ, సహాయమంత్రి తలాల్ చౌదరిలతో కీలకమైన భేటీలు నిర్వహించింది. ఈ ఉన్నత స్థాయి చర్చల అనంతరం, రెండు దేశాల మధ్య సమన్వయం కోసం ఒక 'జాయింట్ వర్కింగ్ గ్రూప్' ఏర్పాటు చేయాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. సరిహద్దు ప్రాంతాల్లో అత్యాధునిక సాంకేతికతతో నిఘా వ్యవస్థలను విస్తరించడం... సరిహద్దుల గుండా జరిగే అక్రమ చొరబాట్లను ఇరు దేశాలు ఉమ్మడిగా అడ్డుకోవడం... ఆయుధాల స్మగ్లింగ్, ఉగ్రవాద కార్యకలాపాలు, అంతర్జాతీయ మాదకద్రవ్యాల (డ్రగ్స్) అక్రమ రవాణాను సంయుక్తంగా తిప్పికొట్టడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇమ్మిగ్రేషన్ వ్యవస్థల ఆధునీకరణ

సరిహద్దు భద్రత మాత్రమే కాకుండా ఇరు దేశాల మధ్య ప్రయాణ ప్రక్రియలను మరింత సులభతరం చేసేందుకు ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను ఆధునీకరించాలని నిర్ణయించారు. సమాచార మార్పిడిని వేగవంతం చేయడం, ఆధునిక సాంకేతికత వినియోగంతో సరిహద్దు నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చేందుకు త్వరలోనే ఒక సమగ్ర ఒప్పందాన్ని ఖరారు చేయనున్నారు.

పాకిస్తాన్‌కు చైనా పూర్తి మద్దతు

"పాకిస్తాన్ మాకు అత్యంత విశ్వసనీయ వ్యూహాత్మక భాగస్వామి. ఆ దేశ సరిహద్దు భద్రతకు అవసరమైన ఆధునిక నిఘా సాంకేతికత, మౌలిక వసతులు, శిక్షణ, సమాచార వ్యవస్థల అభివృద్ధికి చైనా నుంచి పూర్తి సహకారం అందుతుంది" అని చైనా ప్రతినిధులు స్పష్టం చేశారు.

మరోవైపు పాకిస్తాన్ మంత్రి మొహసిన్ నఖ్వీ మాట్లాడుతూ.. చొరబాట్లు, అక్రమ కార్యకలాపాల విషయంలో తమ ప్రభుత్వం "జీరో టాలరెన్స్" విధానాన్ని అనుసరిస్తోందని... చైనాతో భాగస్వామ్యం వల్ల తమ భద్రతా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

భారత్‌కు వ్యూహాత్మక సంకేతమా?

భారత్‌తో సుదీర్ఘ సరిహద్దులను పంచుకుంటున్న పాకిస్తాన్, చైనా సహాయంతో సరిహద్దులను ఆధునీకరించడం వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉందని రక్షణ రంగ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం దక్షిణాసియా భద్రతా పరిస్థితులపై ముఖ్యంగా భారతదేశ రక్షణ వ్యూహాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఉన్న భారత్-చైనా సరిహద్దు వివాదాలు, అలాగే దశాబ్దాలుగా కొనసాగుతున్న భారత్-పాక్ సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఈ రెండు దేశాలు కలిసి సరిహద్దులపై కొత్త వ్యూహాలు రచించడం పట్ల భారత రక్షణ శాఖ మరియు వ్యూహాత్మక వర్గాలు తీవ్ర నిఘా ఉంచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.