చైనాలో రాకాసి గాలులు.. 50కేజీలు తక్కువ ఉంటే ఎగిరిపోవటమేనట
రాకాసి గాలుల కారణంగా చైనా రాజధాని బీజింగ్ లో 300 చెట్లు నేలకూలిపోగా.. పలు వాహనాలు దెబ్బ తిన్నాయి.
By: Tupaki Desk | 13 April 2025 11:56 AM ISTరాకాసి గాలులు చైనీయులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆ గాలుల తీవ్రత ఎంతంటే.. 50 కేజీల కంటే తక్కువ బరువు ఉన్న వారు.. బహిరంగ ప్రదేశాల్లో ఉంటే.. గాల్లో ఎగిరిపోయేంత రాకాసి గాలులు వీస్తున్నాయి. గడిచిన యాభై ఏళ్లలో చైనాలో ఎప్పుడూ లేనంత భారీ రాక్షస గాలులు వీస్తున్నాయి. గంటకు 93 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈ గాలుల పుణ్యమా అని అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ రాక్షసి గాలుల కారణంగా వందలాది విమానాలు.. రైలు సర్వీసులు రద్దయ్యాయి. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 11.30 గంటలకు బీజింగ్ లోని రెండు ప్రధాన విమానాశ్రయాల్లో 838 విమాన సర్వీసుల్ని రద్దు చేసినట్లుగా దిగ్గజ మీడియా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. ఈ ప్రచండ గాలుల నేపథ్యంలో ప్రముఖ పర్యాటక ప్రాంతాల్ని మూసేశారు. 50 కేజీల కంటే తక్కువ బరువు ఉండేవారు గాల్లో ఎగిరిపోతారంటూ మీడియాలో వచ్చిన వార్తల నేపథ్యంలో లక్షలాది మంది చైనీయులు ఇళ్లకే పరిమితమయ్యారు.
రాకాసి గాలుల కారణంగా చైనా రాజధాని బీజింగ్ లో 300 చెట్లు నేలకూలిపోగా.. పలు వాహనాలు దెబ్బ తిన్నాయి. వీధులన్ని నిర్మానుష్యమయ్యాయి. ఎయిర్ పోర్టు ఎక్స్ ప్రె్ సబ్ వై లైన్ సహా రైళ్ల సర్వీసులు.. హైస్పీడ్ రైల్ లైన్ సర్వీసుల్ని రద్దు చేశారు. పార్కుల్ని మూసేశారు. అంతేకాదు.. అత్యంత వేగంగా గాలులు వీసే అవకాశాల్ని గుర్తించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయటమే కాదు.. ఎప్పటికప్పుడు ప్రజల్ని హెచ్చరిస్తున్నారు.
పెనుగాలుల వేగాన్ని 1 నుంచి 17 వరకు చైనా వాతావరణ శాఖ లెక్కగడుతోంది. పెనుగాలుల కారణంగా తీవ్రమైన నష్టం వాటిల్లింది. 12 లెవెల్ గాలులు వీస్తే మాత్రం తీవ్ర విధ్వంసం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ వారాంతంలో గాలుల వేగం 11 నుంచి 13 లెవెల్ వరకూ ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మరింత విధ్వంసం ఖాయమని చెప్పక తప్పదు.
