Begin typing your search above and press return to search.

వీడికి భూమ్మీద నూకలున్నాయి..15ఇంచుల రాడ్ నోటి నుంచి దూసుకెళ్లినా బతికిండు

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. 10 గంటల పాటు జరిగిన అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ తర్వాత అతడు ప్రాణాపాయం నుంచి తప్పించకున్నాడు.

By:  Tupaki Desk   |   23 April 2025 12:00 AM IST
వీడికి భూమ్మీద నూకలున్నాయి..15ఇంచుల రాడ్ నోటి నుంచి దూసుకెళ్లినా బతికిండు
X

దక్షిణ చైనాలో ఓ విచిత్ర, భయానకమైన ఘటన చోటు చేసుకుంది. ఓ పార్టీ జరుగుతుండగా టేబుల్‌పై బోర్లా పడిపోయిన ఒక వ్యక్తి నోటి నుంచి మెటల్ రాడ్ దూసుకెళ్లి తలకు గుచ్చుకున్నా ప్రాణాలతో బయటపడ్డాడు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. 10 గంటల పాటు జరిగిన అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ తర్వాత అతడు ప్రాణాపాయం నుంచి తప్పించకున్నాడు.

అకియాంగ్ వ్యక్తి తన సహోద్యోగులతో కలిసి భోజనం చేస్తూ మద్యం తాగుతున్నాడు. అతడు అప్పటికే బాగా మద్యం మత్తులో ఉన్నాడు. నిలబడబోతూ బ్యాలెన్స్ తప్పి డిన్నర్ టేబుల్‌పై పడిపోయాడు. దురదృష్టవశాత్తూ టేబుల్‌పై నిలువుగా ఉన్న ఒక పొడవైన మెటల్ రాడ్ అతడు టేబుల్‌పై పడగానే అతని నోటిలోకి దూసుకుపోయింది.

రక్తం కారుతుండగా షాకులో ఉన్న సహోద్యోగులు వెంటనే ఎమర్జెన్సీకి కాల్ చేశారు. అతడిని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని షెన్‌జెన్ యూనివర్సిటీ జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ షాకింగ్ కేసు వివరాలను ఆసుపత్రి ఏప్రిల్ 11న సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఆసుపత్రిలోని ట్రామా సెంటర్ వైద్యులు ఈ కేసును అత్యంత అరుదైనదిగా అభివర్ణించారు. డాక్టర్లు మాట్లాడుతూ.. "ఈ వస్తువులో చాలా బ్యాక్టీరియా ఉంది. ఇది రోగి నోరు, కళ్ళు, మెదడు ద్వారా చొచ్చుకుపోయింది. చిన్న, అజాగ్రత్త ఆపరేషన్ కూడా ప్రాణాంతక సమస్యకు దారితీయవచ్చు" అని పేర్కొన్నారు.

ఎక్స్-రే స్కానింగ్‌లో 40 సెంటీమీటర్ల పొడవైన మెటల్ రాడ్ మెదడులోకి కీలక రక్తనాళాలకు కేవలం 2మిల్లీమీటర్ల దూరంలో ఉందని తేలింది. ఆపరేషన్ కు ముందు ఫైర్ సేఫ్టీ సిబ్బంది మొదట రాడ్ బయటి భాగాన్ని కత్తిరించారు. రాడ్ పైభాగంలో ఒక క్లిప్‌ ఉంది. ఇది వెలికి తీసే సమయంలో మెదడు, కళ్ళు, నోటికి ప్రమాదాన్ని కలిగించింది. అయితే, సర్జన్లు జాగ్రత్తగా రాడ్ తొలగించారు. ఆపరేషన్ తర్వాత అకియాంగ్ ఇన్ఫెక్షన్‌తో పోరాడుతూ అనేక రోజులు ఐసీయూలోనే గడిపాడు. నెల రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు.ఆ తర్వాత అతడికి కంటి చూపు కాస్త మందగించినట్లు డాక్టర్లు తెలిపారు.