మారిన చైనా తీరు.. స్నేహితులకు స్వాగతమంటూ వీసాల జారీ
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మిత్రుడు శత్రువుగా.. శత్రువును మిత్రుడిగా.. మంచోడ్ని ముంచేవాడిగా.. ముంచేటోడు మంచిగా మారే అవకాశం కాలం మాత్రమే ఇవ్వగలుగుతుంది
By: Tupaki Desk | 13 April 2025 11:55 AM ISTకాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మిత్రుడు శత్రువుగా.. శత్రువును మిత్రుడిగా.. మంచోడ్ని ముంచేవాడిగా.. ముంచేటోడు మంచిగా మారే అవకాశం కాలం మాత్రమే ఇవ్వగలుగుతుంది. మారిన రాజకీయ వాతావరణం.. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఆసక్తికర సన్నివేశాలు తెర మీదకు వస్తున్నాయి. పాకిస్థాన్ తర్వాత భారతీయులు అమితంగా ద్వేషించే దేశాల్లో చైనా ముందు ఉంటుంది. దీనికి కారణం లేకపోలేదు. హిందీ చీనీ బాయి భాయి అంటూ నినదించినా.. డ్రాగన్ దేశం మాత్రం మనపట్ల దుర్మార్గంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
చైనా తీరు కారణంగా భారత్ కొన్ని వేల కి.మీ. సరిహద్దు ప్రాంతాన్ని కోల్పోయిన వైనం తెలిసిందే. అక్కడితో ఆగని చైనా కక్కుర్తి కారణంగా తరచూ ఈశాన్య రాష్ట్రాల విషయంలో ఏవో ఒక ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భారత్ విషయంలో చైనా తీరులో మార్పు వచ్చిందన్న మాట వినిపిస్తోంది.
సరిహద్దు విషయంలో కాస్త తేడాగా ఉన్న చైనా.. భారతీయులకు వీసాలు జారీ చేసే విషయంలో మాత్రం సంపూర్ణ స్నేహహస్తాన్ని చాటుతోంది. భారత పౌరులు చైనాలో పర్యటించేందుకు వీలుగా తమ ప్రయాణ పాలసీల్లో మార్పు తీసుకొచ్చింది. భారత పౌరులు మరింత సులువుగా చైనాలోకి వచ్చేలా.. వారి ప్రయాణాల్ని మరింత సులభతరం చేసేలా చర్యటు తీసుకొంటోంది. ఇందులో భాగంగా భారతీయులకు భారీగా వీసాల్ని జారీ చేస్తోంది. ఏప్రిల్ 9 నాటికి ఈ ఏడాదిలో ఇప్పటివరకు 85 వేల వీసాల్ని జారీ చేయటం గమనార్హం.
భారత్ లోని చైనా ఎంబసీ.. కాన్సులేట్లు ఈ ఏడాది ఇప్పటివరకు భారీగా వీసాల్ని జారీ చేసిన విషయాన్ని భారత్ లోని చైనా రాయబారి జుఫీహాండ్ వెల్లడించటం గమనార్హం. అంతేకాదు భారత స్నేహితుల మీద వీసా భారం తగ్గించే చర్యల్లో భాగంగా వీసా ఫీజు తగ్గింపు సాగుతోంది. మార్చిలో 50 వేల వీసాలు జారీ చేయగా.. ఏప్రిల్ 9 నాటికి మరో 35 వేల వీసాలు మొత్తంగా 85 వేల వీసాల్ని జారీ చేసింది. అంతేకాదు.. ఈ ఏడాది ఆరంభంలో వీసా ధరల తగ్గింపు నిర్ణయాన్ని చైనా మరో ఏడాదికి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2025 డిసెంబరు 31 వరకు వీసా ఫీజుల తగ్గింపు కొనసాగనుంది.
ప్రస్తుతం సింగిల్ ఎంట్రీ వీసాలకు రూ.2900, డబుల్ ఎంట్రీ వీసాలకు రూ.4400 వసూలు చేస్తున్నాయి. అదే సమయంలో ఆర్నెల్లు గడువు ఉండే మల్టిఫుల్ ఎంట్రీ వీసాలకు రూ.5900.. ఏడాది అంతకంటే ఎక్కువ గడువు ఉండే మల్టీ ఎంట్రీ వీసాలకు రూ.8800 చెల్లిస్తే సరిపోయేలా నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రకటనల నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ భారత్ కు స్నేహహస్తాన్ని చాటటం తెలిసిందే. మొత్తంగా భారత్ తో కలిసి ఉమ్మడి భవిష్యత్తు లక్ష్యంగా పని చేసే సమాజాన్ని ఏర్పాటు చేయాలని తాను ఆశిస్తున్నట్లుగా పేర్కొన్నారు. మొత్తంగా భారత్ - చైనా మధ్య అనుబంధం రానున్న రోజుల్లో మరింత బలోపేతం అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో చూద్దాం.
