Begin typing your search above and press return to search.

చైనా ‘వాటర్ బాంబ్’.. భారత్ కు ముప్పేనా?

చైనా నిర్మించ తలపెట్టిన ఈ భారీ డ్యామ్ నిర్మాణ వ్యయం సుమారు 137 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు.

By:  Tupaki Desk   |   10 July 2025 8:00 AM IST
చైనా ‘వాటర్ బాంబ్’.. భారత్ కు ముప్పేనా?
X

భారత్-చైనా సరిహద్దులో చైనా ప్రతిపాదించిన భారీ జలవిద్యుత్ ప్రాజెక్టుపై అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టును ఆయన 'వాటర్ బాంబ్'గా అభివర్ణించారు, ఇది దేశ భద్రతకు, లక్షలాది మంది జీవనాధారమైన నదీ వ్యవస్థకు తీవ్ర ముప్పు అని హెచ్చరించారు.

బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మించతలపెట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు భారత్‌కు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ఈ ప్రాజెక్టుపై తన భయాన్ని వ్యక్తం చేస్తూ, ఇది సైనిక ముప్పుకు మించినదిగా అభివర్ణించారు. "చైనాపై ఎటువంటి విశ్వాసం పెట్టలేం. వారు ఏ సమయంలో ఏ చర్యలు తీసుకుంటారో తెలియదు. జలవిద్యుత్ ప్రాజెక్టు పేరుతో వారు భారీ డ్యామ్ నిర్మిస్తున్నారు. కానీ ఇది నీటిని నిల్వ చేయడానికే కాదు.. అవసరమైతే నీటిని ఆయుధంగా మార్చే ప్రయత్నం కావచ్చు. ఒక్కసారిగా నీటిని విడుదల చేస్తే సియాంగ్ ప్రాంతమంతా సమూలంగా నాశనమవుతుంది" అని ముఖ్యమంత్రి ఖండూ హెచ్చరించారు. ఈ ప్రాజెక్టు భారత్-చైనా సరిహద్దుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం ఆందోళనను మరింత పెంచుతోంది.

- ప్రాజెక్టు ముప్పులు.. భారత దేశానికి ప్రమాదాలు

చైనా నిర్మించ తలపెట్టిన ఈ భారీ డ్యామ్ నిర్మాణ వ్యయం సుమారు 137 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల భారత్ ఎదుర్కోబోయే ప్రధాన ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. వేసవి కాలంలో బ్రహ్మపుత్ర నదికి నీటి ప్రవాహం తగ్గిపోవచ్చు. ఇది దిగువ ప్రాంతాల్లోని వ్యవసాయం, జీవనాధారాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వర్షాకాలంలో చైనా ఒకేసారి భారీగా నీటిని విడుదల చేస్తే, అస్సాం, అరుణాచల్, ఇంకా బంగ్లాదేశ్ ప్రాంతాలు తీవ్ర ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. డ్యామ్ నిర్మాణం పూర్తయిన తర్వాత, చైనా జల పరిపాలనను రాజకీయ లేదా సైనిక ప్రయోజనాల కోసం ఆయుధంగా వాడే అవకాశం ఉందని భారత అధికారులు భయపడుతున్నారు.

- ఒప్పందాల గందరగోళం.. సమాచార లోపం

బ్రహ్మపుత్ర నది జల సమాచారం మార్పిడి కోసం భారత్-చైనా మధ్య మొదటి ఒప్పందం 2002లో కుదిరింది. 2008, 2013, 2018లో ఈ ఒప్పందంలో మార్పులు చేశారు. అయితే 2023తో ఆ ఒప్పందం గడువు ముగిసింది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో పునఃఒప్పందం జరగలేదు, దీంతో చైనా ఇప్పుడు ఎలాంటి సమాచారం భారత్‌తో పంచుకోవడం లేదు. ఇది దిగువ ప్రాంతాల్లోని ప్రజలకు నది ప్రవాహంపై కచ్చితమైన అంచనా వేయడంలో అడ్డంకిగా మారింది.

- రక్షణ భద్రతకు తీవ్ర ముప్పు

ఈ ప్రాజెక్టు అత్యంత సున్నితమైన సరిహద్దు ప్రాంతానికి సమీపంలో ఉండటంతో, భవిష్యత్తులో యుద్ధ పరిస్థితుల్లో చైనా నీటిని ఆయుధంగా వాడే అవకాశాన్ని భారత ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేయలేకపోతున్నాయి. ఇది భారత రక్షణ భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. ఈ పరిణామాలపై కేంద్రం సీరియస్‌గా స్పందించాలని, అంతర్జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని ప్రస్తావించాలని అరుణాచల్ సీఎం పెమా ఖండూ డిమాండ్ చేస్తున్నారు.

చైనా నిర్మించబోయే ఈ మెగా ప్రాజెక్టు ఒక సాధారణ డ్యామ్ కాదు, అది ఒక నీటి బాంబు. ఇది పరిసర దేశాల భద్రత, జీవనాధార వ్యవస్థలపై తీవ్రమైన ముప్పుగా మారే అవకాశముంది. భారత ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకొని అంతర్జాతీయ ఒత్తిడిని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.