Begin typing your search above and press return to search.

ఈఫిల్ టవర్ కంటే ఎత్తు..నిమిషంలో గంట ప్రయాణం..చైనా కొత్త రికార్డు!

గాజు వంతెనలు, ఆకాశహర్మ్యాలతో సరికొత్త నిర్మాణాలకు కేరాఫ్‌గా నిలిచే ఈ దేశం, ఈసారి ఏకంగా ఓ లోయను దాటేందుకు నింగినంటే వంతెనను నిర్మించింది.

By:  Tupaki Desk   |   12 April 2025 2:59 PM IST
China Unveils Engineering Marvel
X

చైనా మరోసారి తన ఇంజినీరింగ్ సత్తాను ప్రపంచానికి చాటింది. గాజు వంతెనలు, ఆకాశహర్మ్యాలతో సరికొత్త నిర్మాణాలకు కేరాఫ్‌గా నిలిచే ఈ దేశం, ఈసారి ఏకంగా ఓ లోయను దాటేందుకు నింగినంటే వంతెనను నిర్మించింది. గుయిజౌ ప్రాంతంలోని బీపన్ నదిపై నిర్మించిన ఈ హువాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ బ్రిడ్జ్, ఇంజినీరింగ్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.

2050 అడుగుల ఎత్తులో, రెండు మైళ్ల పొడవుతో నిర్మితమైన ఈ వంతెన, ఈఫిల్ టవర్ కంటే 200 మీటర్ల ఎత్తులో ఉండటం విశేషం. అంతేకాదు, ఈఫిల్ టవర్ కంటే మూడు రెట్ల బరువుతో దీన్ని నిర్మించారు. 280 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.2400 కోట్లు) ఖర్చుతో కేవలం మూడేళ్లలోనే ఈ నిర్మాణం పూర్తి చేయడం ఇంజినీరింగ్ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వంతెన నిర్మాణం వల్ల గంటల తరబడి సాగే ప్రయాణం కేవలం నిమిషాల్లో పూర్తవుతుంది. లోయ చుట్టూ తిరిగి వెళ్లాలంటే పట్టే సమయం ఈ వంతెనతో పూర్తిగా తగ్గిపోతుంది. ఈ ఏడాది జూన్ లో ఈ వంతెనను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈ వంతెన కేవలం రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, పర్యాటక రంగానికి కూడా ఊతమిస్తుంది. చైనాలో ఇలాంటి భారీ వంతెనలు అనేకం ఉన్నాయి. ప్రపంచంలోని 100 అత్యంత ఎత్తయిన వంతెనల్లో దాదాపు సగం చైనాలోనే ఉండటం గమనార్హం. ఈ భారీ వంతెన నిర్మాణం చైనా ఇంజినీరింగ్ నైపుణ్యానికి తార్కాణం. మారుమూల ప్రాంతాలకు రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఈ వంతెన దోహదపడుతుంది.