ప్రపంచంలోనే ‘అత్యంత కఠినమైన’ పరీక్ష ఏదో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన, అత్యంత సవాలుతో కూడిన ప్రవేశ పరీక్ష ఇదే. ఇంతకీ ఈ గావోకావో పరీక్ష ప్రత్యేకత ఏంటి? ప్రపంచంలో దీని తర్వాత నిలిచే ఇతర కఠినమైన పరీక్షలు ఏంటో తెలుసుకుందాం.
By: A.N.Kumar | 8 Jun 2026 6:29 PM ISTఉన్నత చదువులు చదవాలన్నా, జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలన్నా విద్యార్థులు రకరకాల ప్రవేశ పరీక్షలు రాయడం సర్వసాధారణం. కానీ, ఒక పరీక్ష మాత్రం లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను, వారి కుటుంబాల భవిష్యత్తును శాసిస్తుంది. అదే చైనాలో నిర్వహించే ‘గావోకావో’. విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన, అత్యంత సవాలుతో కూడిన ప్రవేశ పరీక్ష ఇదే. ఇంతకీ ఈ గావోకావో పరీక్ష ప్రత్యేకత ఏంటి? ప్రపంచంలో దీని తర్వాత నిలిచే ఇతర కఠినమైన పరీక్షలు ఏంటో తెలుసుకుందాం.
ఏంటి ఈ 'గావోకావో' పరీక్ష?
చైనా ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రతి ఏటా ఈ పరీక్షను నిర్వహిస్తుంది. చైనాలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే ఈ పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించడం తప్పనిసరి. సాధారణంగా ఈ పరీక్ష మొత్తం 9 గంటల పాటు ఉంటుంది. అయితే ప్రాంతాన్ని బట్టి దీనిని 2 నుంచి 4 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ ఏడాది కేవలం రెండు రోజుల్లోనే సుమారు 1.29 కోట్ల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారంటేనే దీని క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. లక్షలాది మంది పోటీ పడుతున్నప్పటికీ చైనాలోని టాప్ యూనివర్సిటీల్లో సీటు సాధించే వారి సంఖ్య 1 శాతం కంటే తక్కువగా ఉంటుంది. తీవ్రమైన పోటీ, కఠినమైన ప్రశ్నల వల్లే ఈ పరీక్షను ప్రపంచంలోనే నంబర్ వన్ టఫెస్ట్ ఎగ్జామ్‌గా పరిగణిస్తారు.
ప్రపంచంలోని టాప్-5 కఠినమైన పరీక్షలు ఇవే!
గావోకావో మొదటి స్థానంలో ఉంటే మన భారతదేశానికి చెందిన పరీక్షలు కూడా ప్రపంచ స్థాయిలో గట్టి పోటీనిస్తున్నాయి. గ్లోబల్ లెవెల్లో అత్యంత కఠినమైన పరీక్షలు చూస్తే.. ప్రపంచంలోని అత్యంత కఠినమైన పరీక్షల జాబితాలో గావోకావో మొదటి స్థానంలో ఉండగా.. భారతదేశానికి చెందిన జేఈఈ అడ్వాన్స్ డ్ , యూపీఎస్.సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలు కూడా అగ్రస్థానాల్లో నిలిచాయి. ఇంజినీరింగ్ విద్యలో అత్యున్నత సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ డ్ అత్యంత క్లిష్టమైన ప్రశ్నలకు ప్రసిద్ధి. అలాగే దేశ అత్యున్నత పరిపాలనా సేవల్లో చేరాలనుకునే అభ్యర్థులు యూపీఎస్ సీ పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవే కాకుండా బ్రిటన్‌లో నిర్వహించే ఆల్ సోల్స్ ప్రైజ్ ఫెలోషిప్ పరీక్ష, అమెరికా విద్యార్థుల కోసం నిర్వహించే యూఎస్.ఎంఎల్.ఈ (యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామినేషన్) కూడా ప్రపంచంలోని టఫెస్ట్ ఎగ్జామ్స్‌లో చోటు సంపాదించాయి.
మన దేశం నుంచి గట్టి పోటీ: జేఈఈ అడ్వాన్స్‌డ్ & యూపీఎస్‌సీ
ప్రపంచ కఠినమైన పరీక్షల జాబితాలో భారతదేశానికి చెందిన రెండు పరీక్షలు అగ్రస్థానాల్లో ఉన్నాయి. దేశంలోనే అత్యున్నత ఇంజినీరింగ్ సంస్థలైన ఐఐటీల్లో సీటు సంపాదించడం అంత సులువు కాదు. ఇక్కడి ప్రశ్నల క్లిష్టత, లాజికల్ థింకింగ్ లెవెల్స్ ప్రపంచంలోనే అత్యుత్తమమైనవిగా గుర్తింపు పొందాయి. దేశ అత్యున్నత పరిపాలనా విభాగాలైన ఐఏఎస్, ఐపీఎస్ , ఐఎఫ్ఎస్ లలో చేరాలనుకునే అభ్యర్థులు ఈ పరీక్ష రాస్తారు. మూడు అంచెల్లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ జరిగే ఈ పరీక్ష అభ్యర్థి మేధస్సును, సహనాన్ని పరీక్షిస్తుంది.
కేవలం పుస్తకాల జ్ఞానం మాత్రమే ఉంటే ఈ పరీక్షల్లో నెగ్గడం ఇంపాజిబుల్. విద్యార్థుల సమయపాలన, మానసిక స్థైర్యం, విశ్లేషణా సామర్థ్యం, కష్టపడే తత్వాన్ని ఈ పరీక్షలు పూర్తిస్థాయిలో పరీక్షిస్తాయి. అందుకే వీటిని "వరల్డ్ టఫెస్ట్ ఎగ్జామ్స్" అని పిలుస్తారు. ఇందులో గావోకావో మాత్రం కోట్లాది మంది చైనీస్ విద్యార్థుల తలరాతను మార్చే ఒక ప్రత్యేకమైన పరీక్షగా నిలుస్తోంది.
