ఆపిల్ పై చైనా పరోక్ష ప్రతీకారం: భారత్‌లో ఐఫోన్ తయారీకి అడ్డంకులు!
'మేక్ ఇన్ ఇండియా' నినాదంతో కేంద్ర ప్రభుత్వం విదేశీ కంపెనీలను భారత్‌లో పెట్టుబడులు పెట్టేలా ఆకర్షిస్తోంది.
By: Tupaki Desk | 3 July 2025 9:00 PM ISTచైనా తన అసలు రూపాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. గ్లోబల్ కంపెనీలపై, ముఖ్యంగా భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఆపిల్ కంపెనీపై ఇప్పుడు చైనా పరోక్షంగా ప్రతీకారం తీర్చుకుంటోంది. దీని ఫలితంగా భారత్‌లో ఐఫోన్ల తయారీ నిలిచిపోయే పరిస్థితులు తలెత్తాయి. దీని వెనుక చైనా దురుద్దేశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు.
భారత్‌లో తయారీ.. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం
'మేక్ ఇన్ ఇండియా' నినాదంతో కేంద్ర ప్రభుత్వం విదేశీ కంపెనీలను భారత్‌లో పెట్టుబడులు పెట్టేలా ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ తన ఐఫోన్ అసెంబ్లింగ్ యూనిట్లను భారత్‌లో ఏర్పాటు చేసింది. ఈ కార్యకలాపాలకు కావాల్సిన శిక్షణను ఫాక్స్ కాన్ సంస్థ అందిస్తోంది. ఫాక్స్ కాన్ చైనాకు చెందిన సంస్థ కాగా.. దాదాపు 300 మంది చైనా ట్రైనర్లు భారతదేశానికి వచ్చి ఇక్కడి కార్మికులకు శిక్షణ ఇస్తున్నారు.
- చైనా తీసుకున్న అవాంఛనీయ నిర్ణయం
ఇటీవల ఈ ట్రైనర్లు ఎటువంటి సమాచారం లేకుండానే స్వదేశానికి వెనుదిరిగారు. దీని వెనుక చైనా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్ణయం తీసుకుందని పరిశ్రమ వర్గాలు అనుమానిస్తున్నాయి. గతంలో ఆపిల్ కంపెనీ తన ఉత్పత్తులను పూర్తిగా చైనాలోనే తయారు చేసేది. కానీ, భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో, కంపెనీ అమెరికా తర్వాత భారత్‌ను ప్రధాన తయారీ కేంద్రంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. దీనిని చూసి అసహనం చెంది చైనా ఈ దుస్సాహసానికి దిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
- శిక్షణ లేక తయారీ మందగమనం
ట్రైనర్లు వెళ్ళిపోవడంతో భారత కార్మికులకు తగిన శిక్షణ అందకపోవడం, తద్వారా ఐఫోన్ల అసెంబ్లింగ్ ప్రక్రియలో ఆటంకం ఏర్పడుతోంది. ఫాక్స్ కాన్ అతి త్వరలో 17 కొత్త మోడల్స్ తయారీకి కసరత్తులు చేస్తున్న వేళ ఈ ప్రతికూల పరిణామం కంపెనీకి తీవ్ర షాక్‌గా మారింది.
- ప్రత్యామ్నాయం వెతుకుతోన్న ఫాక్స్ కాన్
ఈ పరిణామాల నేపథ్యంలో ఫాక్స్ కాన్ సంస్థ భారత కార్మికులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇతర దేశాల ట్రైనర్లను తీసుకురావడం, లేదా నేరుగా ట్రైనింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను భారత్‌లో అభివృద్ధి చేయడం వంటి అవకాశాలను పరిశీలిస్తోంది.
- చైనా స్పష్టమైన హెచ్చరిక
గతంలో ఆపిల్ వంటి సంస్థలు చైనా నుంచి బయటకు వెళ్లినప్పుడు, "మన దేశాన్ని వదిలి వెళ్లే కంపెనీలకు మేము ఎలాంటి మద్దతు ఇవ్వం" అనే హెచ్చరికను చైనా చేసింది.. ఇప్పుడు ఆ హెచ్చరికలే కార్యరూపంలోకి మారుతున్నట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
చైనా కుట్రలు ఆపిల్ వంటి దిగ్గజాల్ని ఆశించిన అభివృద్ధికి దూరం చేయాలన్న ఉద్దేశంతోనే సాగుతున్నాయని స్పష్టమవుతోంది. అయినప్పటికీ భారత్ వంటి పటిష్టమైన మార్కెట్, నిరంతరంగా అభివృద్ధి చెందుతున్న టెక్ రంగం, ప్రత్యామ్నాయ శిక్షణ పద్ధతులతో ఈ ఆటంకాలను అధిగమించగలదని నిపుణులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అయితే, విదేశీ పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం మరింత రక్షణ కల్పించాల్సిన అవసరం ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తోంది.
