Begin typing your search above and press return to search.

సముద్ర గర్భంలో చైనా 'మృత్యు ద్వీపం': అమెరికా గజగజ.. ప్రపంచానికి కొత్త త‌ల‌నొప్పి!

నేటి ఆధునిక యుద్ధ తంత్రంలో సముద్ర గర్భ మ్యాపింగ్ డేటా అనేది దేశాలకు అత్యంత శక్తివంతమైన ఆయుధంగా మారుతోంది.

By:  Sivaji Kontham   |   29 April 2026 5:00 PM IST
సముద్ర గర్భంలో చైనా మృత్యు ద్వీపం: అమెరికా గజగజ.. ప్రపంచానికి కొత్త త‌ల‌నొప్పి!
X

నేటి ఆధునిక యుద్ధ తంత్రంలో సముద్ర గర్భ మ్యాపింగ్ డేటా అనేది దేశాలకు అత్యంత శక్తివంతమైన ఆయుధంగా మారుతోంది. సముద్రపు అడుగుభాగానికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఉంటే.. శత్రువుల నావికాదళ కదలికలను పసిగట్టడం.. జలాంతర్గాములను రహస్యంగా నడపడం .. సముద్ర గర్భంలో సెన్సార్లు లేదా క్షిపణులను అమర్చడం సులభతరం అవుతుంది. ఈ నేపథ్యంలోనే చైనా నిర్మిస్తున్న ప్రపంచపు మొట్టమొదటి భారీ స్థాయి మొబైల్ డీప్-సీ పరిశోధనా వేదిక ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాతో పాటు భారత్‌ వంటి దేశాలను ఒణికిస్తోంది.

``డీప్-సీ ఆల్-వెదర్ రెసిడెంట్ ఫ్లోటింగ్ రీసెర్చ్ ఫెసిలిటీ`` అని పిలుచుకునే ఒక `ఫ్లోటింగ్ ఐలాండ్` (తేలే ద్వీపం)ని చైనా అభివృద్ధి చేస్తోంది. దాదాపు 78,000 మెట్రిక్ టన్నుల బరువుతో ఒక భారీ విమాన వాహక నౌక పరిమాణంలో ఇది ఉండబోతోంది. సుమారు 30 అంతస్తుల ఎత్తు.. రెండు ఫుట్‌బాల్ మైదానాల అంత వైశాల్యం కలిగిన ఈ ప్లాట్‌ఫారమ్ ఎటువంటి బయటి సరఫరా లేకుండానే 238 మంది పరిశోధకులతో నాలుగు నెలల పాటు సముద్రంపై నిరంతరాయంగా కార్యకలాపాలు సాగించగలదు.

10,000 మీటర్ల లోతుల్లోకి చైనా కన్ను:

ఈ పరిశోధనా వేదిక సాధారణ నౌకల కంటే భిన్నమైనది. చమురు పరిశ్రమలో వాడే `సెమీ-సబ్‌మెర్సిబుల్` డిజైన్‌ను వాడటం వల్ల ఇది సముద్రంపై వేగంగా ప్రయాణించగలదు. ప్రతికూల వాతావరణంలోనూ స్థిరంగా ఉండగలదు. ఇది గరిష్టంగా 10,000 మీటర్ల లోతు వరకు ఉన్న సముద్ర గర్భాన్ని శోధించగలదు. ఇందులో ఉన్న 31 మీటర్ల భారీ `మూన్ పూల్` ద్వారా 300 టన్నుల బరువున్న యంత్రాలను 6,000 మీటర్ల లోతులోకి పంపవచ్చు. ఇందులో ఉన్న ఆరు అత్యాధునిక ప్రయోగశాలలు సముద్ర గర్భ రహస్యాలను ఛేదించేందుకు సిద్ధమవుతున్నాయి.

చైనా ఈ ప్రాజెక్టును కేవలం తుపానుల అంచనా, పర్యావరణ పరిశోధన, ఇంధన వనరుల అన్వేషణ కోసమేనని బ‌య‌ట‌కు చెబుతున్నా కానీ జిత్తుల మారిని ప్ర‌పంచం న‌మ్మ‌డం లేదు. దీని వెనుక ఉన్న ద్వంద్వ ప్రయోజనం వ్యూహం అమెరికాను ఆందోళనకు గురిచేస్తోంది. పసిఫిక్, హిందూ, ఆర్కిటిక్ మహాసముద్రాల అడుగుభాగాన్ని క్రమపద్ధతిలో మ్యాపింగ్ చేయడం ద్వారా.. చైనా తన జలాంతర్గాముల ప్రయాణ మార్గాలను సుగమం చేసుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా తైవాన్- అమెరికా కీలక స్థావరమైన గ్వామ్ సమీపంలో చైనా తన కార్యకలాపాలను పెంచడం గమనార్హం.

2030 నాటికి సముద్ర గర్భంపై చైనా ఆధిపత్యం:

ఈ భారీ ప్రాజెక్టును 2030 నాటికి పూర్తి చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పూర్తయితే సముద్ర గర్భంలో జలాంతర్గాముల నావిగేషన్, రహస్య ఆయుధాల అమరిక వంటి అంశాల్లో చైనాకు తిరుగులేని డేటా లభిస్తుంది. శాస్త్రీయ పరిశోధనల పేరుతో చైనా సేకరించే ఈ సమాచారం.. భవిష్యత్తులో సముద్ర యుద్ధాల్లో ఆ దేశానికి వ్యూహాత్మక ఆధిక్యతను ఇస్తుందని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికాకు ఇది మునుపెన్నడూ లేని విధంగా ఒక సవాలుగా పరిణమించబోతోంది.