జిన్‌పింగ్ సర్కార్ సీరియస్.. అధికారులకు మద్యం, సిగరెట్ల బిల్లులు బంద్!
ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తమ దేశాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు చైనా పెద్ద ప్రయత్నాలే చేస్తోంది.
By: Tupaki Desk | 20 May 2025 6:00 PM ISTఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తమ దేశాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు చైనా పెద్ద ప్రయత్నాలే చేస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వ యంత్రాంగంలోని ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు అందరూ ఖర్చులను తగ్గించుకోవాలని కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ప్రయాణాలు, విలాసవంతమైన విందులు, మద్యం, సిగరెట్ల వినియోగం వంటి అనవసరమైన ఖర్చులను పూర్తిగా తగ్గించుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు చైనా అధికారిక మీడియా సంస్థలు విస్తృతమైన కథనాలను ప్రచురించాయి.
దేశాధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం, దేశ ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిడిని నివారించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. స్థిరాస్తి రంగంలో ఏర్పడిన సంక్షోభం, స్థానిక ప్రభుత్వాల పెరుగుతున్న అప్పుల భారం దేశ ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు చేసే చిన్నపాటి దుబారా ఖర్చులు కూడా ఆర్థిక వ్యవస్థపై మరింత భారం వేయకుండా ఉండేందుకు ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ వనరులను అత్యంత జాగ్రత్తగా వినియోగించాలని, ప్రతి పైసాను ఆలోచించి ఖర్చు చేయాలని ఆదేశించింది. అనవసరమైన ఖర్చులను చేయడం సిగ్గుచేటైన చర్యగా అభివర్ణించింది.
కొద్ది నెలలుగా చైనా స్థిరాస్తి మార్కెట్‌లో అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గిపోయింది. మరోవైపు, స్థానిక ప్రభుత్వాలు తీసుకున్న రుణాల కారణంగా వాటిపై అప్పుల భారం విపరీతంగా పెరిగిపోయింది. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వ అధికారులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తే ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారే ప్రమాదం ఉంది. అందుకే, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఖర్చులను నియంత్రించడానికి చర్యలు చేపట్టింది. స్థానిక ప్రభుత్వాల ఆర్థికాభివృద్ధిని మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే అధికారుల ఖర్చులను తగ్గించడం ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణిస్తున్నారు.
కొత్త ఆదేశాల ప్రకారం ప్రభుత్వ అధికారులు కేవలం అత్యవసరమైన ప్రయాణాలు మాత్రమే చేయాల్సి ఉంటుంది. విలాసవంతమైన హోటళ్లలో బస చేయడం, ఖరీదైన విందులు ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధించారు. అలాగే, ప్రభుత్వ ఖర్చులతో మద్యం సేవించడం, సిగరెట్లు కొనడం కూడా ఇకపై కుదరదు. ఆఫీసుల మెయింటెనెన్స్ ఖర్చులు కూడా తగ్గించాలని, విద్యుత్ , నీటి వినియోగాన్ని పొదుపుగా వాడాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ప్రభుత్వ శాఖ తమ ఖర్చులను తగ్గించుకోవడానికి ఒక స్పష్టమైన ప్రణాళికను రూపొందించుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
