సగానికి పైగా భూమిని చుట్టే ప్రయాణం.. ఒక ఫ్లైట్ ప్రయాణంపై గురించి తెలుసుకోవాల్సిందే..
చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్ ప్రపంచ పటంలోనే అత్యంత సుదీర్ఘ దూరం కవర్ చేసే కొత్త విమాన సర్వీసును ప్రారంభించింది.
By: Tupaki Desk | 6 Dec 2025 2:00 PM ISTచైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్ ప్రపంచ పటంలోనే అత్యంత సుదీర్ఘ దూరం కవర్ చేసే కొత్త విమాన సర్వీసును ప్రారంభించింది. దాదాపు 20 వేల కిలోమీటర్ల ప్రయాణంతో ఈ రూట్‌ను ఇప్పటివరకు ఉన్న దీర్ఘ దూర సేవలకంటే ప్రత్యేకంగా నిలబెట్టే ప్రయత్నం సంస్థ చేసింది. ప్రయాణికుడు ఒకసారి విమానంలో కూర్చుంటే, భూమి అరగోళాన్ని దాటి మరో చివరలోని నగరానికి చేరేలా ఉండటమే ఈ రూట్ ప్రత్యేకత.
షాంఘై నుంచి బ్యూనస్ ఐరీస్ వరకు..
షాంఘై విమానాశ్రయం నుంచి అర్జెంటీనాలోని బ్యూనస్ ఐరీస్ వరకు ఈ సర్వీస్ సాగుతుంది. మధ్యలో మొత్తం 19,631 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ రూట్ పూర్తి కావడానికి సుమారు 25 గంటల 30 నిమిషాల సమయం పడుతోంది. ఇంత భారీ ప్రయాణంలోనూ విమానం మారాల్సిన అవసరం లేకుండా, మార్గమధ్యంలో న్యూజీలాండ్‌లోని ఆక్లాండ్‌లో కేవలం రెండు గంటల విరామమే ఉంచారు. ప్రయాణికులు అదే విమానంలో విశ్రాంతి తీసుకుంటూ, చిన్న బ్రేక్ తర్వాత మళ్లీ అదే సీటులో నుంచి ప్రయాణాన్ని కొనసాగించొచ్చు. అందుకే దీన్ని ‘డైరెక్ట్ జర్నీ’గానే పరిగణిస్తున్నారు.
అంతర్జాతీయ విమానరంగంలో కొత్త పంథా..
సుదీర్ఘ విమాన సర్వీసులు ఇప్పుడు అంతర్జాతీయ విమానయాన రంగంలో కొత్త పంథాగా మారుతున్నాయి. కస్టమర్లు ఎక్కువగా “ఒకే విమానం – ఒకే ప్రయాణం” అంటే ఇష్టపడుతున్న నేపథ్యంలో, ఇలా లాంగ్ రేంజ్ ఫ్లైట్లను ఆప్షన్‌గా తీసుకురావాలని కంపెనీలు చూశాయి. చైనా ఈస్ట్రన్ ఈ రూట్ ద్వారా ఆసియా – దక్షిణ అమెరికా మధ్య నేరుగా కలుపుతూ వ్యాపార, పర్యాటక రంగాలకు కొత్త దారులు తెరవాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చిందని విమానయాన నిపుణులు భావిస్తున్నారు.
అంతా ప్లెయిన్ లోనే..
అయితే ఇంత గంటల ప్రయాణం శారీరకంగా, మానసికంగా ఇప్పటివరకు అలవాటు కాని అనుభవమే. కాబట్టి ప్రయాణానికి ముందు మంచి నిద్ర, తగినంత నీరు, సరైన ఆహారం గురించి వైద్య నిపుణులు జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించే వారి కోసం సీటు వ్యాయామాలు, మధ్య మధ్యలో నడుచుకుంటూ రావడం తప్పనిసరి అని చెబుతున్నారు.
ఎయిర్ ట్రావెల్స్ సుదీర్ఘ దూరాలకు తక్కువ సమయం..
దూరాలు తగ్గిన ఈ కాలంలో, ప్రపంచం గుండెచప్పుడు వినిపించేంత దగ్గరైందని చెప్పడానికి ఈ కొత్త సుదీర్ఘ విమాన రూట్ ఒక ఉదాహరణగా నిలుస్తోంది. ఒకప్పుడు ఊహించలేని 20 వేల కిలోమీటర్ల నాన్–స్టాప్ ప్రయాణం, ఇప్పుడు సాధారణ ప్రయాణికుడికి కూడా అందుబాటులోకి వస్తుండటం విమానయాన రంగ పురోగతికి సంకేతంగా విశ్లేషిస్తున్నారు.
