దీపావళి బాంబులకన్నా ఘోరంగా విఫలమైన చైనా ఆయుధాలు.. కారణంపై ఆరా..?
యుద్ధ రంగంలో ‘డ్రాగన్ టెక్నాలజీ’ అని చైనా గొప్పగా చెప్పుకునే ఆయుధాల నిజస్వరూపం మరోసారి బట్టబయలైంది.
By: Tupaki Desk | 6 Jan 2026 11:51 AM ISTయుద్ధ రంగంలో ‘డ్రాగన్ టెక్నాలజీ’ అని చైనా గొప్పగా చెప్పుకునే ఆయుధాల నిజస్వరూపం మరోసారి బట్టబయలైంది. పాక్ భూభాగంలోనూ, వెనెజువెలా ఘటనల్లోనూ చైనా సరఫరా చేసిన ఎయిర్ డిఫెన్స్ డిస్టమ్ ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోయింది. ఒకప్పుడు చైనా ఆయుధాలు తక్కువ ఖర్చుతో, అధిక సామర్థ్యంతో ఉంటాయని ప్రచారం జరిగినా.. నిజమైన యుద్ధ పరిస్థితుల్లో అవి నిలబడలేకపోతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పాకిస్తాన్ తో భారత్ యుద్ధం సమయంలో..
పాకిస్తాన్‌లో కొంత కాలంగా భారత్‌కు సంబంధించిన మిస్సైల్ టెస్టులు, ఎయిర్ ఆపరేషన్ల సమయంలో చైనా తయారీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ స్పందించలేకపోయిన సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. చైనా నుంచి దిగుమతి చేసుకున్న హెచ్‌క్యూ (HQ) సిరీస్ వ్యవస్థలు భారత క్షిపణుల ట్రాకింగ్‌లో విఫలమైనట్లు రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి. భారతదేశం అభివృద్ధి చేసిన ఖచ్చితత్వం ఉన్న మిస్సైల్ టెక్నాలజీ ముందు చైనా రాడార్లు, ఇంటర్‌సెప్టర్లు బలహీనంగా మారాయని విశ్లేషకులు అంటున్నారు.
పాకిస్తాన్ కథ వెనెజువాలో రిపీట్..
ఇదే తరహా పరిస్థితి వెనెజువెలాలోనూ కనిపించింది. అక్కడ అమెరికా డ్రోన్లు, నిఘా విమానాలు చొరబడినప్పుడు చైనా సరఫరా చేసిన రక్షణ వ్యవస్థలు సమర్థంగా స్పందించలేకపోయాయి. యూఎస్ (US) ఆపరేషన్ల ముందు చైనా ఎయిర్ డిఫెన్స్ పూర్తిగా విఫలమైందన్న ఆరోపణలు అంతర్జాతీయ రక్షణ వర్గాల్లో చర్చకు వచ్చాయి. ఇది చైనా ఆయుధాల విశ్వసనీయతపై మరోసారి పెద్ద ప్రశ్నార్థకం పెట్టింది.
ప్రధాన పరిశ్రమకు దెబ్బపడనుందా?
చైనా ఆయుధ పరిశ్రమ ప్రధానంగా డిఫెన్స్ ఎగుమతులపై ఆధారపడుతోంది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు తక్కువ ధరకు ఆయుధాలు సరఫరా చేస్తూ మార్కెట్ పెంచుకోవాలని బీజింగ్ ప్రయత్నిస్తోంది. కానీ ధర తక్కువగా ఉండడం ఒక్కటే సరిపోదు. నిజమైన యుద్ధ పరిస్థితుల్లో పనికిరాని టెక్నాలజీ దేశాల భద్రతకే ముప్పుగా మారుతుంది. ఇప్పుడు పాక్, వెనెజువెలా ఉదాహరణలు ఇదే విషయాన్ని బయటపెట్టాయని నిపుణులు అంటున్నారు.
శత్రు దేశాలకు ఊరట..
మరో వైపు భారత్, అమెరికా వంటి దేశాలు యుద్ధాల్లో తమ టెక్నాలజీని వాస్తవంగా పరీక్షించుకుంటూ ముందుకు సాగుతున్నాయి. భారత మిస్సైల్ ప్రోగ్రామ్స్, US ఎయిర్ ఆపరేషన్లు కేవలం ప్రదర్శన కోసం కాకుండా, యుద్ధ పరిస్థితుల్లో సామర్థ్యాన్ని చూపిస్తున్నాయి. అందుకే చైనా ఆయుధాలతో పోలిస్తే, ఈ దేశాల రక్షణ వ్యవస్థలపై విశ్వాసం ఎక్కువగా ఉందన్న అభిప్రాయం బలపడుతోంది.
డిఫెన్స్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం..
డ్రాగన్ టెక్నాలజీకి వరుస వైఫల్యాలు ఎదురవడం చైనా గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్‌పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆయుధాలు కొనుగోలు చేసే దేశాలు ఇకపై చైనా సిస్టమ్స్‌పై మరింత జాగ్రత్తగా ఆలోచించే పరిస్థితి ఏర్పడుతోంది. కాగితాలపై శక్తివంతంగా కనిపించే టెక్నాలజీ.. యుద్ధ మైదానంలో పనిచేయకపోతే దాని విలువ శూన్యం. ఈ నిజం చైనా ఆయుధాల విషయంలో మళ్లీ మళ్లీ రుజువవుతోంది.
దౌత్యానికి కూడా దెబ్బేనా?
ఈ పరిణామాలు చైనా రక్షణ వ్యూహానికే కాదు, దాని దౌత్య వ్యూహానికీ పెద్ద ఎదురుదెబ్బగా మారుతున్నాయి. ఆయుధాల ఎగుమతుల ద్వారా రాజకీయ ప్రభావాన్ని పెంచుకోవాలని చూసిన బీజింగ్‌కి, ఇప్పుడు అదే ఆయుధాల వైఫల్యం వల్ల విశ్వసనీయత కోల్పోయే పరిస్థితి ఎదురవుతోంది. ఒక దేశం తన భద్రతను మరొక దేశం టెక్నాలజీపై ఆధారపెడితే, ఆ టెక్నాలజీ నిజంగా పరీక్షలో నిలబడుతుందా లేదా అన్నదే కీలకం. పాక్, వెనెజువెలా ఘటనలు చూసిన తర్వాత, చైనా ఆయుధాలపై అంధ విశ్వాసం పెట్టడం ఎంత ప్రమాదకరో చాలా దేశాలకు అర్థమవుతోంది.
ఇక గ్లోబల్ పవర్ బ్యాలెన్స్ కోణంలో చూస్తే, ఈ వైఫల్యాలు చైనా శత్రు దేశాలు యూఎస్, భారత్ వంటి దేశాలకు వ్యూహాత్మకంగా ఊరట కలిగించే అంశాలుగా భావించవచ్చు. స్వదేశీ టెక్నాలజీపై పెట్టుబడులు పెట్టడం, మిత్ర దేశాలతో కలిసి అభివృద్ధి చేసిన రక్షణ వ్యవస్థలను వినియోగించడం ఎంత అవసరమో ఇవి గుర్తుచేస్తున్నాయి. యుద్ధాల్లో గెలుపు కేవలం సంఖ్యలతో కాదు, నమ్మదగిన టెక్నాలజీతోనే సాధ్యమవుతుంది. డ్రాగన్ ఆయుధాల వరుస ఫెయిల్యూర్లు ప్రపంచానికి చెప్పే పాఠం ఇదే శబ్దం చేసే ప్రచారం కాదు, మైదానంలో నిలిచే సామర్థ్యమే అసలైన శక్తి.
