Begin typing your search above and press return to search.

రఫేల్ ను బ్యాడ్ చేస్తోన్న చైనా.. కారణమిదే

ప్రపంచ యుద్ధ విమానాల మార్కెట్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఫ్రాన్స్ తయారీ రఫేల్ యుద్ధవిమానాలపై చైనా కుట్రలు పన్నుతోంది.

By:  Tupaki Desk   |   8 July 2025 2:00 AM IST
రఫేల్ ను బ్యాడ్ చేస్తోన్న చైనా.. కారణమిదే
X

ప్రపంచ యుద్ధ విమానాల మార్కెట్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఫ్రాన్స్ తయారీ రఫేల్ యుద్ధవిమానాలపై చైనా కుట్రలు పన్నుతోంది. ఇటీవల భారత్-పాకిస్థాన్ మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతల తర్వాత, రఫేల్ పనితీరుపై సందేహాలు రేపే ప్రయత్నంలో డ్రాగన్ దేశం నిమగ్నమైందని ఫ్రాన్స్ నిఘా వర్గాలు గుర్తించాయి. యుద్ధ విమానాల మార్కెట్‌ను ప్రభావితం చేయాలన్న లక్ష్యంతో చైనా ఈ తప్పుడు ప్రచార యత్నాలకు దిగిందని ఫ్రాన్స్ అధికార వర్గాలు చెబుతున్నాయి.

రాయబార కార్యాలయాలే దుష్ప్రచారం కేంద్రాలు

చైనా విదేశీ దౌత్య కార్యాలయాల నుంచే ఈ దుష్ప్రచార యత్నాలు సాగుతున్నట్లు ఫ్రాన్స్ నిఘా సంస్థలు స్పష్టం చేశాయి. ఇప్పటికే రఫేల్ విమానాలకు ఆర్డర్ చేసిన దేశాల్లో ముఖ్యంగా ఇండోనేసియాలో చైనా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఫ్రెంచ్ ఇంటెలిజెన్స్ గుర్తించింది. రఫేల్ యుద్ధ సమయాల్లో పనితీరు చూపలేవన్న వాదనను చైనా రక్షణ సంబంధిత అధికారులు అక్కడ వ్యాప్తి చేస్తున్నారని తెలిసింది.

-భారత్-పాక్ ఘర్షణల తరువాత ఉద్ధృతమైన ప్రచారం

మే నెలలో భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఘర్షణల సమయంలో భారత వాయుసేన ఐదు యుద్ధవిమానాలు కోల్పోయిందని పాకిస్థాన్ పేర్కొంది. వాటిలో మూడు రఫేల్‌లు ఉన్నాయని దావా చేసింది. అయితే, భారత్ ఈ విమాన నష్టాన్ని అంగీకరించినప్పటికీ సంఖ్యలపై స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో రఫేల్‌ల పనితీరుపై అనుమానాలు వెల్లువెత్తేలా చేస్తూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగింది.

- ఫ్రాన్స్ వైమానిక దళం స్పందన

భారత్ నష్టపోయిన యుద్ధవిమానాల్లో రఫేల్, సుఖోయ్-30, మిరాజ్-2000 ఉన్నట్లు ఫ్రాన్స్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ జనరల్ జెరోమ్ బెల్లాంజర్‌ వెల్లడించారు. ఈ విషయంతో రఫేల్‌ను కొనుగోలు చేసిన దేశాల్లో పలు సందేహాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఫలితంగా రఫేల్ ప్రతిష్ఠకు భంగం కలిగే పరిస్థితి ఏర్పడింది.

- ఫ్రాన్స్ చర్యలు

ఈ ప్రచారానికి కౌంటర్‌గా ఫ్రాన్స్ ప్రభుత్వం, దసో ఏవియేషన్ సంస్థలు రఫేల్ విశ్వసనీయతను సమర్థించేందుకు చర్యలు చేపట్టాయి. చైనా-పాకిస్థాన్ మద్దతుతో ఆన్‌లైన్‌లో వేలాది ఖాతాల ద్వారా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నట్లు గుర్తించి, వాటిపై నిఘా పెంచారు. ఈ ప్రచారంలో చైనా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని ఫ్రాన్స్ ఆరోపించింది. అయితే, చైనా మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. తాము సైనిక ఎగుమతుల విషయంలో బాధ్యతాయుత నీతిని పాటిస్తున్నామని తెలిపింది.

-విశ్వవ్యాప్త రఫేల్ వినియోగం

దసో ఏవియేషన్ తయారీ రఫేల్ విమానాలు ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం పొందిన యుద్ధవిమానాలుగా పేరొందాయి. ఇప్పటివరకు 533 రఫేల్‌లను విక్రయించిన దసో.. ఈజిప్ట్, ఖతార్, భారత్, గ్రీస్, క్రొయేషియా, యూఏఈ, సెర్బియా వంటి దేశాలకు వీటిని సరఫరా చేసింది. ఇండోనేసియా ప్రస్తుతం 42 రఫేల్ యుద్ధవిమానాలకు ఆర్డర్ ఇచ్చింది.

చైనా పన్నుతున్న దుష్ప్రచారం ద్వారా రఫేల్ యుద్ధవిమానాల అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తున్నప్పటికీ, ఫ్రాన్స్ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి ఈ ప్రచారానికి తగిన కౌంటర్ చర్యలు తీసుకుంటోంది. యుద్ధ రంగంలో రఫేల్ ప్రదర్శించిన సామర్థ్యం, ఆయుధ సామగ్రి పరంగా అత్యాధునికత ఇంకా ప్రాధాన్యతను బట్టి చూస్తే, చైనా ప్రచారం ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.