భారత సరిహద్దుల్లో చైనా తన గోతిని తానే తవ్వకుంటోందా?
బ్రహ్మపుత్ర నది భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అసోం ప్రజల జీవనాధారం.
By: A.N.Kumar | 11 July 2026 9:26 AM ISTచైనా టిబెట్ ప్రాంతంలో నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టుపై ఇప్పుడు కొత్త ఆందోళనలు మొదలయ్యాయి. భారత సరిహద్దుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మపుత్ర నదిపై చైనా ఈ భారీ డ్యామ్‌ను తలపెట్టింది. దాదాపు 60 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో సుమారు 137 బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఈ మెగా ప్రాజెక్ట్‌పై ఇప్పటికే అంతర్జాతీయంగా పలు విమర్శలు ఉన్నాయి. అయితే తాజాగా చైనాకు చెందిన భూగర్భ శాస్త్రవేత్తలే ఈ ప్రాజెక్టు భద్రతపై సంచలన హెచ్చరికలు చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
డ్యామ్ కిందే క్రియాశీల భూగర్భ పగులు
చైనా జియాలాజికల్ సర్వే నిర్వహించిన తాజా పరిశోధనల ప్రకారం ఈ డ్యామ్ నిర్మిస్తున్న మెడాగ్ ప్రాంతంలో 'పైజెన్ ఫాల్ట్' అనే క్రియాశీల భూగర్భ పగులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. టెక్టోనిక్ ప్లేట్ల కదలికల కారణంగా ఈ ప్రాంతంలో తీవ్రమైన భూకంపాలు వచ్చే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. వేల సంవత్సరాలుగా ఉన్న ఈ భూగర్భ పగులు ప్రస్తుతం అత్యంత సున్నితమైన స్థితిలో ఉంది. ఒకవేళ ఈ పగులు చురుకుగా మారితే డ్యామ్‌తో పాటు ఆ ప్రాంతంలో నిర్మిస్తున్న వంతెనలు, రహదారులు, సొరంగాలు వంటి కీలక మౌలిక వసతులు క్షణాల్లో కుప్పకూలే ప్రమాదం ఉంది. ఈ ఆందోళనలు ఊహాజనితం మాత్రమే కావు. 2017లో ఇదే ప్రాంతంలో 6.9 తీవ్రతతో భారీ భూకంపం సంభవించడం ఈ ముప్పుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. అంతటి భారీ డ్యామ్, అందులో నిల్వ ఉండే బిలియన్ల కొద్దీ గ్యాలన్ల నీటి బరువును ఆ ప్రాంత భూభాగం ఎంతవరకు తట్టుకోగలదనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ప్రాజెక్టుకు సమీపంలోని 'పై' గ్రామం సహా పరిసర ప్రాంతాలు ఈ భూకంప ముప్పు పరిధిలో ఉన్నాయి.
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు ఏంటి?
బ్రహ్మపుత్ర నది భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అసోం ప్రజల జీవనాధారం. వ్యవసాయం, తాగునీరు, పర్యావరణ సమతుల్యత అంతా ఈ నదిపైనే ఆధారపడి ఉన్నాయి. చైనా ప్రాజెక్టు వల్ల భారత్‌కు ప్రధానంగా రెండు రకాల ముప్పులు ఉన్నాయి. భూకంపం కారణంగా డ్యామ్‌కు ఏవైనా పగుళ్లు వచ్చినా లేదా చైనా ఒక్కసారిగా నీటిని విడుదల చేసినా ఈశాన్య భారతం మునిగిపోయే ప్రమాదం ఉంది. సాధారణ రోజుల్లో నదీ ప్రవాహాన్ని చైనా నియంత్రిస్తే భారత్‌తో పాటు దిగువన ఉన్న బంగ్లాదేశ్‌లో తీవ్ర నీటి క్షామం ఏర్పడుతుంది.
చైనా వాదన.. అంతర్జాతీయ ఆందోళన
చైనా ప్రభుత్వం మాత్రం తాము అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో అన్ని భద్రతా చర్యలు తీసుకుంటూనే ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నామని గంభీర ప్రకటనలు చేస్తోంది. కానీ సొంత దేశ శాస్త్రవేత్తలే బాంబు లాంటి నిజాన్ని బయటపెట్టడంతో చైనా డిఫెన్స్‌లో పడింది.
సరిహద్దుల్లో వ్యూహాత్మక ఆధిక్యం కోసం చైనా చేస్తున్న ఈ జల సాహసం, భవిష్యత్తులో ఆ దేశానికే కాకుండా మొత్తం దక్షిణ ఆసియా ప్రాంతానికే ఒక పెద్ద విపత్తుగా మారుతుందా అనే అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. భారత్ సైతం ఈ పరిణామాలను అత్యంత నిశితంగా గమనిస్తోంది.
