Begin typing your search above and press return to search.

చైనా ఆయువుపట్టుపై కొట్టిన అమెరికా?

అమెరికా-చైనాల మధ్య ఇప్పటికే తీవ్రమైన వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఆరోపణలు వెలుగు చూడటం గమనార్హం.

By:  Tupaki Desk   |   15 April 2025 6:38 PM IST
చైనా ఆయువుపట్టుపై కొట్టిన అమెరికా?
X

అమెరికాలోని నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (NSA) తమ దేశంలో సైబర్‌ దాడులకు పాల్పడిందని చైనా తీవ్రంగా ఆరోపించింది. ఈ మేరకు హార్బిన్ నగర పోలీసులు ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరిలో జరిగిన 9వ ఆసియాన్ వింటర్ గేమ్స్ సందర్భంగా ఈ సైబర్ దాడులు జరిగాయని చైనా పేర్కొంది. ఈ వ్యవహారంలో ముగ్గురు ఎన్‌ఎస్‌ఏ ఏజెంట్ల పేర్లను కూడా వాంటెడ్ జాబితాలో చేర్చింది. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, వర్జీనియా టెక్‌ సంస్థలు కూడా ఈ సైబర్ దాడుల్లో భాగమయ్యాయని తమ దర్యాప్తులో తేలిందని చైనా ఆరోపించింది. అయితే, ఈ సంస్థలు ఏ విధంగా దాడుల్లో పాలుపంచుకున్నాయనే విషయాన్ని మాత్రం చైనా వెల్లడించలేదు.

నిందితుల జాబితాలో అమెరికాకు చెందిన కేథరిన్ ఎ విల్సన్, రాబర్ట్ జె స్నీలింగ్, స్టీఫెన్ డబ్ల్యూ జాన్సన్‌లు ఉన్నారని చైనా తెలిపింది. వీరు చైనాలోని కీలకమైన మౌలిక సదుపాయాలు, ముఖ్యమైన సంస్థలను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులకు పాల్పడ్డారని పేర్కొంది. బాధితుల్లో ప్రముఖ టెలికాం దిగ్గజం హువావే కూడా ఉందని చైనా తెలిపింది. ఈ మేరకు చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని గ్లోబల్ టైమ్స్ పత్రిక కథనం వెల్లడించింది.

ఇదిలా ఉండగా, ఏప్రిల్‌లో చైనాకు చెందిన నేషనల్ కంప్యూటర్ వైరస్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్, నేషనల్ ఎమర్జెన్సీ లాబొరేటరీ ఫర్ కంప్యూటర్ వైరస్ ప్రివెన్షన్ టెక్నాలజీ సంయుక్తంగా ఒక నివేదికను విడుదల చేశాయి. 9వ ఆసియా వింటర్ గేమ్స్‌ను సైబర్ దాడుల ద్వారా దెబ్బతీయాలని కొన్ని విదేశీ శక్తులు ప్రయత్నించాయని ఆ నివేదికలో పేర్కొన్నారు. ముఖ్యమైన మౌలిక సదుపాయాలపై దాడి చేసి గందరగోళం సృష్టించి, డేటాను దొంగిలించడానికి ప్రయత్నించారని వెల్లడించారు. తాము పరిశీలించిన డేటా ప్రకారం, 63.24 శాతం దాడులు అమెరికా కేంద్రంగానే జరిగాయని నివేదిక స్పష్టం చేసింది. అమెరికాలోని ఎన్‌ఎస్‌ఏ కార్యాలయంలోని ఎస్‌32 అనే కోడ్‌నేమ్‌తో ఉన్న సంస్థ ఈ దాడులను నిర్వహించిందని పేర్కొంది. ఇది సిగ్నల్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్‌కు చెందిన విభాగమని తెలిపింది. అయితే, బీజింగ్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం ఈ ఆరోపణలపై ఇంకా స్పందించలేదు.

అమెరికా-చైనాల మధ్య ఇప్పటికే తీవ్రమైన వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఆరోపణలు వెలుగు చూడటం గమనార్హం. ఇటీవల ఇరు దేశాలు తమ పౌరులకు ట్రావెల్ వార్నింగ్‌లు కూడా జారీ చేశాయి. అంతేకాకుండా, అమెరికా చిత్రాలను తమ దేశంలోకి అనుమతించబోమని చైనా ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తాజా సైబర్ దాడి ఆరోపణలు ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత దిగజార్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.