బిల్డర్ మోసాలు-రెరాతో పనే లేదు! 26 అంతస్తులు 5రోజుల్లోనే.. షాకిస్తున్న చైనా భవన నిర్మాణ టెక్నిక్!
ఈ భవన నిర్మాణంలో సాంప్రదాయ కాంక్రీట్‌కు బదులుగా బి-కోర్ అని పిలిచే పేటెంట్ పొందిన స్టెయిన్‌లెస్ స్టీల్ సాండ్‌విచ్ నిర్మాణాన్ని కోర్ మెటీరియల్‌గా ఉపయోగించారు.
By: Sivaji Kontham | 20 May 2026 9:41 AM ISTభారతదేశంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో అక్రమాలు, మోసాలు నిత్యకృత్యంగా మారాయి. చట్టాల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని అడ్డగోలుగా భవంతులు నిర్మిస్తూ.. కస్టమర్లను నిలువునా ముంచేసే బిల్డర్లకు కొదవే లేదు. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు భారతదేశం రెరా (RERA) వంటి కఠినమైన చట్టాలను తీసుకువచ్చినా.. ఇల్లు కొనుగోలుదార్లు లేదా బయ్యర్ల కష్టాలు పూర్తిగా తీరడం లేదు. బిల్డర్లు నిర్మాణాలను ఏళ్ల తరబడి ఆలస్యం చేయడం.. ప్రాజెక్టులను మధ్యలోనే వదిలేసి బ్యాంకులకు ఐపీలు పెట్టడం వల్ల సామాన్యులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ప్రతిరోజూ వార్తా ఛానళ్లలో భయానక మోసాలకు సంబంధించిన వార్తలు వింటూనే ఉన్నాం. అయితే బిల్డర్ల కలకలం రేపే మోసాలకు.. వినియోగదారుల కోర్టు వివాదాలకు చెక్ పెట్టే గుడ్ న్యూస్ చెప్పింది చైనా. అన్ని మోసాలకు ఆ దేశం శాశ్వత పరిష్కారాన్ని కనుగొంది. అసలు బిల్డర్ ఆలస్యం అనే మాటే లేకుండా.. సరికొత్త నిర్మాణ సాంకేతికతతో ప్రపంచాన్ని నిశ్చేష్టులను చేస్తోంది.
లండన్ లేదా న్యూయార్క్ వంటి అంతర్జాతీయ నగరాల్లో కూడా ఒక మధ్యస్థ స్థాయి మల్టీ స్టోరీడ్ భవనం పూర్తి కావడానికి కనీసం మూడేళ్ల సమయం పడుతుంది. కానీ చైనాకు అంత సమయం అవసరం లేదు. చైనాలోని హునాన్ ప్రావిన్స్- క్సియాంగిన్ కౌంటీలో కేవలం 100 మంది కార్మికులతో ఒక 26 అంతస్తుల నివాస భవనాన్ని కేవలం ఐదు రోజుల్లోనే నిర్మించి సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించారు. 2024 జనవరి 7న మొదటి మాడ్యూల్ ఏర్పాటు చేయగా.. జనవరి 11 నాటికే `జింగ్డు హోలోన్ బిల్డింగ్` పేరిట భారీ టవర్ తక్షణమే నివసించడానికి వీలుగా సిద్ధమైపోయింది. `బ్రాడ్ గ్రూప్ హోలోన్` అనే డెవలపర్ సంస్థ కేవలం ఐదు రోజుల్లోనే 14,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 208 అపార్ట్‌మెంట్‌లను పూర్తి ఫర్నిచర్ సహా నిర్మించి, గ్లోబల్ మాడ్యులర్ కన్‌స్ట్రక్షన్ మార్కెట్‌లో సరికొత్త మైలురాయిని నెలకొల్పింది.
ఈ అద్భుత నిర్మాణ వేగానికి కారణం సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఉండే `రివర్స్ కన్‌స్ట్రక్షన్ ఫిలాసఫీ`. ఇసుక, సిమెంట్, ఇటుకలను సైట్‌కు తెచ్చి ఓపెన్ ఎయిర్‌లో నెలల తరబడి నిర్మించే విధానానికి స్వస్తి పలికి, ఇందులో దాదాపు పూర్తి అపార్ట్‌మెంట్‌ను ఫ్యాక్టరీలోనే తయారు చేస్తారు. ఈ భారీ టవర్ నిర్మాణంలో సైట్ వద్ద ఎక్కడా సిమెంట్‌ను ఉపయోగించలేదు.. అలాగే ఎలాంటి వెల్డింగ్ పనులు కూడా చేపట్టలేదు. కేవలం ఫ్యాక్టరీలో తయారైన స్టెయిన్‌లెస్ స్టీల్ మాడ్యూళ్లను ఒకదానికొకటి అమర్చి బోల్టులతో బిగించారు. ఫ్యాక్టరీ లోపల ఉండే ప్రొడక్షన్ లైన్ ప్రతి 21 నిమిషాలకు ఒక మాడ్యూల్‌ను సిద్ధం చేస్తుంది. ఆ మాడ్యూల్ లోపలే ఎలక్ట్రికల్ వైరింగ్, ఎయిర్ కండిషనింగ్ పైపింగ్ .. ఇంటీరియర్ ఫినిషింగ్ పనులను ఫ్యాక్టరీలోనే పూర్తి చేసి ట్రక్కుల ద్వారా సైట్‌కు తరలించి, బొమ్మల బ్లాకులను పేర్చినట్లుగా అతికించారు.
ఈ భవన నిర్మాణంలో సాంప్రదాయ కాంక్రీట్‌కు బదులుగా బి-కోర్ అని పిలిచే పేటెంట్ పొందిన స్టెయిన్‌లెస్ స్టీల్ సాండ్‌విచ్ నిర్మాణాన్ని కోర్ మెటీరియల్‌గా ఉపయోగించారు. స్టెయిన్‌లెస్ స్టీల్‌కు ఉండే సాగే గుణం వల్ల భూకంపాలు వచ్చినప్పుడు ఈ భవనం ఒత్తిడిని తట్టుకుని సురక్షితంగా నిలబడుతుంది. 2008లో చైనాలో సంభవించిన ఘోర భూకంపం తర్వాత విపత్తులకు కూలిపోని భవనాలను నిర్మించాలనే లక్ష్యంతోనే బ్రాడ్ గ్రూప్ ఈ సాంకేతికతను అభివృద్ధి చేసింది. సాధారణ కాంక్రీట్ కట్టడాలు 50 నుండి 70 ఏళ్లలోనే బలహీనపడతాయి.. కానీ స్టెయిన్‌లెస్ స్టీల్‌కు ఉండే తుప్పు నిరోధకత వల్ల ఈ టవర్ ఏకంగా 1000 ఏళ్లకు పైగా మన్నికగా ఉంటుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. అంతేకాదు.. ఇందులో సౌర వేడిని నిరోధించే 4-ప్యాన్డ్ కిటికీలు, ఎనర్జీ-రికవరీ వెంటిలేషన్ సిస్టమ్... కుళాయి నీటిని నేరుగా తాగగలిగే ఇంటిగ్రేటెడ్ వాటర్ ఫిల్ట్రేషన్ సిస్టమ్ వంటి అత్యాధునిక వసతులను కూడా కల్పించారు.
ఈ సరికొత్త సాంకేతికతలో ఉన్న మరో అద్భుతమైన ఫీచర్ ఏంటంటే ఈ భవనాన్ని ఒక చోటు నుండి మరో చోటుకు మార్చవచ్చు. భవనానికి ఉన్న బోల్ట్ లు నట్లు కనెక్షన్‌లను విప్పి.. మొత్తం 26 అంతస్తుల బిల్డింగ్‌ను ట్రక్కులలో లోడ్ చేసి వేరే ప్రాంతానికి తరలించి మళ్లీ అసెంబుల్ చేసుకోవచ్చు. దీనివల్ల వరదలు లేదా ప్రభుత్వ జోనింగ్ సమస్యలు వచ్చినప్పుడు బిల్డింగ్ రూపంలో పెట్టిన పెట్టుబడి మునిగిపోకుండా సురక్షిత ప్రాంతాలకు మార్చుకునే వెసులుబాటు ప్రభుత్వాలకు, కొనుగోలుదారులకు కలుగుతుంది. ఈ మాడ్యూల్స్ అన్నీ అంతర్జాతీయ షిప్పింగ్ కంటైనర్ పరిమాణంలో ఉండటం వల్ల ప్రత్యేక అనుమతులు లేకుండానే వీటిని ఓడలు లేదా ట్రక్కుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా రవాణా చేయవచ్చు. ఇప్పటికే అమెరికా, ఫిలిప్పీన్స్, యూఏఈలలో ఈ తరహా ప్రాజెక్టులు పైప్‌లైన్‌లో ఉన్నాయి. ఇటువంటి అధునాతన టెక్నాలజీ భారతదేశానికి కూడా విస్తరిస్తే భవిష్యత్తులో బిల్డర్ల మోసాలు, రెరా కోర్టుల చుట్టూ తిరిగే గొడవలు లేకుండా కొనుగోలుదారులు కేవలం వారంలోనే కొత్త ఇళ్లలో అడుగు పెట్టవచ్చు. నిరంతర అడ్డగోలు మోసాలు , కోర్టు గొడవలు, తలనొప్పులు అన్నిటికీ చెక్ పెట్టవచ్చు!
